23... బాబును వెంటబడి వేధిస్తోంది

 23... బాబును వెంటబడి వేధిస్తోంది

నిజంగానే... ట్వంటీ త్రీ (23) టీడీపీ అధినేత, ఏపీ విపక్ష నేత నారా చంద్రబాబునాయుడిని వెంటబడి వేదిస్తోంది. అదేందో గానీ... బాబు ఏ విషయాన్ని పట్టుకున్నా కూడా ఈ ట్వంటీ త్రీనే ఆయనను వెంటాడేస్తోంది. మొన్నటిదాకా ఏపీ సీఎంగా ఉన్న సమయంలో దిలాసాగా, కులాసాగా కాలం గడిపిన చంద్రబాబు... విపక్ష నేతగా మారిన వెంటనే ఈ ట్వంటీ త్రీ ఆయనకు నిద్ర పట్టనివ్వడం లేదంటే అతిశయోక్తి కాదేమో. ఆ ట్వంటీ త్రీ నిజంగానే చంద్రబాబును నిద్రపోనివ్వడం లేదా? అంటే... వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే... ఈ మాట నిజమేనని ఒప్పుకోక తప్పదన్న వాదన వినిపిస్తోంది. సరే మరి... బాబును అంతగా ఇబ్బంది పెడుతున్న ఆ ట్వంటీ త్రీకి, బాబుకు మధ్య ఉన్న లింకేమిటో, బాబును ఆ సంఖ్య అంతగా ఇబ్బంది పెడుతున్న వైనమేమిటో చూద్దాం పదండి.

అధికారంలో ఉండగా వైసీపీని బలహీనం చేసే క్రమంలో ఆ పార్టీ టికెట్లపై గెలిచిన ఎమ్మెల్యేలను విడతలవారీగా తన పార్టీలో చేర్చుకున్నారు. ఇలా ఏకంగా వైసీపీ ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో 23 మందిని చంద్రబాబు లాగేశారు. తాజాగా మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాజయం దక్కగా... తాను ఎంతమందిని అయితే వైసీపీ నుంచి లాగేశారో సరిగ్గా అంతే సంఖ్యలో అంటే... 23 మంది మాత్రమే టీడీపీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈ ఫలితాలు మే 23ననే విడుదలయ్యాయి. ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్న జగన్, వైసీపీ నేతలు చంద్రబాబును నానా ఇబ్బందులు పెడుతున్నారు.

ఇక తాజాగా కర్ణాటకలో అక్కడి సంకీర్ణ కూటమి నేతృత్వంలోని కుమార స్వామి సర్కారు నిన్న కుప్ప కూలింది కదా. సంకీర్ణ కూటమి విజయం కోసం చంద్రబాబు కర్ణాటకలో బాగానే ప్రచారం చేశారు. బీజేపీని ఓడించాలని, కాంగ్రెస్ ను గెలిపించాలని కూడా చంద్రబాబు అక్కడి తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రచారం చేశారు. అయితే అక్కడి అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ ఓటమి పాలు కాగా బీజేపీ అధిక స్థానాలు గెలిచింది. సరే... జేడీఎస్ తో జట్టుకట్టిన కాంగ్రెస్ బీజేపీని అధికారానికి దూరం పెట్టేసింది. ఆ క్రమంలో గతేడాది మే 23న సీఎంగా కుమార చేసిన ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబు హాజరయ్యారు.

అది గతం అనుకుంటే... నిన్న కుమార సర్కారు కూలిన డేట్ కూడా సరిగ్గా 23వ తేదీనే కావడం గమనార్హం. ఇలా చంద్రబాబును ప్రతిష్ఠ మంటగలిపే ఘటనలన్నీ కూడా 23వ తేదీననే జరిగాయి. ఇదే విషయాన్ని గుర్తించిన నెటిజన్లు... బాబును తమదైన శైలిలో ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్ ఎంతగా ఉందంటే... జగన్ కూడా టార్గెట్ చేయనంతగా నెటిజన్లు బాబును ఓ ఆట ఆడేసుకుంటున్నారు. సో... ట్వంటీ త్రీ బాబుకు నిద్ర పట్టనివ్వట్లేదన్న మాట నిజమే కదా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English