అమరావతిపై వైసీపీ వైఖరేంటో?... బాబు క్లారిటీ ఇచ్చేశారు

అమరావతిపై వైసీపీ వైఖరేంటో?... బాబు క్లారిటీ ఇచ్చేశారు

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిపై వైసీపీ వైఖరి ఏమిటి? అసలు అమరావతి నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం కొత్త సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉందా? అసలు అమరావతిలో ఉంటున్న వైసీపీ నేతలు ఎలా వ్యవహరిస్తున్నారు?... కాస్తంత క్లారిటీ ఉన్నా జగన్ గతంలో చేసిన ప్రకటనలను బట్టి చూస్తే.... అమరావతి నిర్మాణం ముందుకు సాగడం ఖాయమనే భావన వ్యక్తమవుతోంది. ఇది బయటకు కనిపిస్తున్న మాట మాత్రమే.

అయితే వైసీపీ నేతలు, ప్రత్యేకించి జగన్ వైఖరి ఈ విషయంలో ఎలా ఉందన్న విషయాన్ని వెల్లడి చేసేందుకు అమరావతి నిర్మాణానికి పునాది వేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రంగంలోకి దిగిపోయారు. సోమవారం సాయంత్రం అమరావతి వేదికగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమరావతి నిర్మాణంపై వైసీపీ నేతలు, జగన్ వైఖరి ఇదేనంటూ చంద్రబాబు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.

విపక్షంలో ఉన్నంత కాలం అమరావతిని భ్రమరావతి అని పిలిచిన వైసీపీ... అధికారంలోకి వచ్చాక కూడా అదే మాటను కొనసాగిస్తోందని చంద్రబాబు నిప్పులు చెరిగారు. రాష్ట్ర విభజనతో రాజధాని కూడా లేకుండా ప్రస్థానం మొదలెట్టిన ఏపీకి విశ్వ నగర స్థాయిలో అమరావతి నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించామని, తమ ప్రణాళిలు నచ్చి రైతులు స్వచ్ఛందంగా 34 వేలఎకరాలను ఇచ్చారని చంద్రబాబు చెప్పారు.

ఈ భూముల సేకరణ కోసం తమ ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పూలింగ్ విధానంతో సర్కారీ ఖజానాకు చిల్లిగవ్వ కూడా భారం పడలేదని చెప్పుకొచ్చారు. రైతులు ఉదారంగా భూములు అందిస్తే... ఆ భూముల్లో విశ్వ స్థాయి నగరాన్ని నిర్మిద్దామని తాము చేసిన యత్నాలను వైసీపీ అడుగడుగునా అడ్డుకుందని చంద్రబాబు మండిపడ్డారు.

అమరావతి అభివృద్దికి తాము ఎంతగా కష్టపడ్డామో అందరిరీ తెలిసిందేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాము పడుతున్న కష్టం నీళ్లలో పోసిన పన్నీరులా మార్చేందుకు వైసీపీ యత్నించిందని బాబు ఆరోపించారు. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తే.. వారిని అడ్డుకునేందుకు వైసీపీ యత్నించిందని అన్నారు.

ఇందులో భాగంగా వైసీపీ రైతులను రెచ్చగొట్టిందని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ప్రభావితం చేసే క్రమంలోనే వారి పొలాలను వైసీపీ తగులబెట్టిందని నిప్పులు చెరిగారు. కోర్టులకెక్కి అమరావతి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు యత్నించారని ఆరోపించారు. అమరావతికి పెట్టుబడులు రాకుండా అడ్డుకునే యత్నాలు చేశారన్నారు. రుణాలు ఇవ్వొద్దని ప్రపంచ బ్యాంకుకు పదే పదే ఫిర్యాదు చేశారన్నారు. వైసీపీకి ఉండే అవినీతి ముద్రను టీడీపీపైకి నెట్టేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.

రాజధానిలో తమ హయాంలో గజం భూమి ధర రూ.64 వేలు ఉంటే... ఇప్పుడు వైసీపీ వచ్చీ రాగానే ఆ ధర రూ.20లకు పడిపోయిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సర్కారు చేస్తున్న పనుల వల్ల ఈ ధర మరింతగా దిగజారే అవకాశాలు లేకపోలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అమరావతి మనది అనే భావన వైసీపీ నేతల్లో కించిత్ కూడా కనిపించడం లేదన్నారు.

విపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని భ్రమరావతి అని హేళన చేసిన వైసీపీ నేతలు... ఇప్పటికీ అదే భావనలోనే ఉన్నారన్నారు. అమరావతిలో ముళ్లు, కంప తప్ప ఇంకేమున్నాయని అంటున్న వైసీపీ నేతలు... అమరావతిలో ఉన్నంత సేపు ముళ్ల మీద కూర్చున్నట్లుగానే వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా రాజధాని అమరావతి నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం తమకు లేదని వైసీపీ నేతలు వారి వ్యవహార సరళితోనే చెప్పేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English