సత్తిబాబూ.. అధికారంలో ఉన్నదే మీరేనండి

సత్తిబాబూ.. అధికారంలో ఉన్నదే మీరేనండి

ఇటీవలే ముగిసిన ఎన్నికల్లో అప్పటిదాకా విపక్షంగా ఉన్న వైసీపీ రీసౌండింగ్ మెజారిటీతో విక్టరీ సాధించింది. ఆ వెంటనే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీకి నూతన సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 25 మందితో జగన్ తన మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు.

ఈ 25 మందిలో మెజారిటీ కుర్రకారే ఉన్నా... విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు కూడా జగన్ తన కేబినెట్ లో చోటిచ్చారు. వెరసి ఇప్పుడు బొత్స మంత్రిగా ఉన్నారు. సరే ఇక్కడిదాకా బాగానే ఉన్నా... సోమవారం నాటి శాసనమండలి సమావేశాల్లో బొత్స వ్యవహరించిన తీరుతో... మంత్రినన్న విషయాన్ని ఆయన మరిచిపోయారేమోనన్న అనుమానాలను రేకెత్తించింది.

ఎందుకంటే... సభలోని అటు విపక్ష, ఇటు అధికార పక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ఉన్న బొత్స... ఏకంగా సభ నుంచి వాకౌట్ చేసి అందరినీ విస్మయానికి గురి చేశారు. బొత్స వాకౌట్ చేసిన దృశ్యాలను చూసిన జనం... తాను మంత్రిగా ఉన్న విషయాన్ని, వైసీపీ అధికారంలోకి వచ్చిన విషయాన్ని బొత్స మరిచిపోయారా? అంటూ జనం తలలు పట్టుకున్నారు.

అయినా మండలిలో సోమవారం ఏం జరిగిందంటే.. సోమవారం నాటి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే శాసనమండలిలో కరవు, అనావృష్టిపై చర్చ ప్రారంభమైంది. విపక్ష సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు బొత్స సమాధానమిస్తూ... జిల్లాల నుంచి నివేదికలు తెప్పిస్తున్నామని... త్వరలోనే లెక్కలన్నీ తేలుతాయని చెప్పారు. చాలా ప్రాంతాల్లో అతి తక్కువ వర్షపాతం నమోదైందని... ఎవరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు? ఎలాంటి పరిస్థితుల్లో చేసుకున్నారు? అనే అంశాలపై నివేదికలు తయారవుతున్నాయని తెలిపారు.

ఇదే సమయంలో గత టీడీపీ ప్రభుత్వంపై బొత్స విమర్శలు గుప్పించారు. రైతుల పట్ల గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ద్వజమెత్తారు. బొత్స మాట్లాడుతుండగా విపక్ష సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో, చర్చ కొనసాగుతుండగానే సభ నుంచి బొత్స ఉన్నపళంగా వెళ్లిపోయారు.

సమాధానాలు చెబుతున్న క్రమంలోనే ఉన్నపళంగా బొత్స సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఇటు విపక్ష సభ్యులతో పాటు అధికార పక్ష సభ్యులు కూడా షాక్ తిన్నారు. అయినా వాకౌట్ అంటూ చేస్తే విపక్షం చేయాలి గానీ... అధికార పక్షానికి చెందిన, అది కూడా కీలక మంత్రిగా ఉన్న బొత్స వాకౌట్ చేశారంటే నిజంగానే ఆశ్చర్యమే కదా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English