'జగన్ ను విమర్శిస్తే విదేశీ బెదిరింపులొస్తున్నాయట'

'జగన్ ను విమర్శిస్తే విదేశీ బెదిరింపులొస్తున్నాయట'

జగన్ కేవలం రెండు నెలల్లో ఏపీని 60 ఏళ్ల వెనక్కు తీసుకెళ్లాడని మాజీ మంత్రి జవహర్ విమర్శించారు. రివర్స్ టెండరింగ్ అనేది అవినీతిని ఏరేయడానికి కాదని, ప్రాజెక్టులను తమ సొంత కాంట్రాక్టర్లకు ఇప్పించే ఎత్తుగడ మాత్రమే అని ఆయన ఆరోపించారు.

తాను ఏదైనా జగన్ పై విమర్శలు చేస్తే... స్వీడన్ తదితర దేశాల నుంచి ’జగన్ ను విమర్శిస్తే అయిపోతావు‘ అంటూ ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇలాంటి వాటికి జంకేది లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లాలోని చండ్రుపట్లలో  జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జవహర్ పై వ్యాఖ్యలు చేశారు.

ఆర్నెల్లో జగన్ మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటాను అని చెప్పి రెండు నెలల్లోనే చెడ్డ ముఖ్యమంత్రి అనిపించుకున్నారని... ఎన్నికలపుడు ఈవీఎంలపై వచ్చిన అనుమానాలు నిజమని జనం నమ్ముతున్నారని ఆయన అన్నారు. మేము ముందు నుంచే ఈవీఎంలను అనుమానిస్తున్నా చాలామంది పట్టించుకోలేదని ఫలితాల అనంతరం చాలామంది మా అనుమానాలు నిజమని నమ్ముతున్నారని జవహర్ అన్నారు.

ప్రజా రంజక పాలన ఇస్తానని చెప్పిన జగన్ అన్నీ యుటర్న్ లు తీసుకుంటున్నారని... ఆశా వర్కర్లకు తెలుగుదేశం ప్రభుత్వం జీతాలు రెట్టింపు చేసి 8600 రూపాయలు చెల్లిస్తే జగన్ వచ్చి కేవలం 1400 పెంచాడని, కానీ అది అమలులోకి రాకుండా మాటల్లోనే ఉండిపోయిందని దుయ్యబట్టారు. పాపం ఇప్పటికీ వారు ధర్నాలుచేస్తున్నారని జవహర్ అన్నారు.

ఇసుకపై నిషేధం వల్ల కోటి మందికి పైగా అనేక స్థాయిల్లో ప్రభావితం అయ్యారని లక్షలాది నిర్మాణ కూలీలు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయకత్వంలో జగన్ అసలు రంగు బయటపెట్టి జనాలకు నిజాలు తెలిసేలా చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English