జగన్-చంద్ర‌బాబు మధ్యలో నలిగిపోయిన 'అమ‌రావ‌తి'

జగన్-చంద్ర‌బాబు మధ్యలో నలిగిపోయిన 'అమ‌రావ‌తి'

ప్ర‌పంచ ప్ర‌ఖాత స్థాయిలో నిర్మించాల‌ని భావించిన ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం ఇప్ప‌ట్లో జ‌రిగేలా క‌నిపించ‌డం లేదు. ప్ర‌ధానంగా ప్ర‌పంచ బ్యాంకు ఇస్తుంద‌ని అనుకున్న 9800 కోట్ల రూపాయ‌ల రుణం ఆగిపోయింది.

అదే స‌మ‌యంలో ఏఐఐబీ సంస్థ కూడా 13,600 కోట్ల రూపాయ‌ల రుణం ఇచ్చే విష‌యంలోను పున‌రాలోచ‌న‌లో ప‌డింది. దీంతో ఇప్పుడు అమ రావ‌తి నిర్మాణం అస‌లు ముందుకుసాగుతుందా? అనే విష‌యం సందిగ్ధంలో ప‌డింది.

ప్ర‌స్తుత ప్ర‌భుత్వం కూడా దీనిని లైట్‌గా తీసుకోవ‌డంతో మ‌రింతగా ఈ సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలోనే అమ‌రావ‌తికి రుణం విష యంలో అడ్డు ప‌డింది, రాకుండా చేసింది మీరంటే మీరేన‌ని వైసీపీ, టీడీపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలో అస‌లు అమ‌రావ‌తి విష‌యంలో ఏం జ‌రిగింది? ఇక‌పై ఏం జ‌రుగుతుంది? అనే అంశం ఆస‌క్తిగా మారింది. విష‌యంలోకి వెళ్తే.. ‘అమరావతి’ ప్రాజెక్టు నుంచి ప్రపంచ బ్యాంకు ఎందుకు తప్పుకొంది. పర్యావరణవేత్తలు, రైతు సంఘాల ప్రతినిధుల ఫిర్యాదే దీనికి కారణమా? లేక... కేంద్ర ప్రభుత్వమే ఈ రుణానికి మోకాలడ్డిందా? అదీ కాకపోతే... రాష్ట్ర ప్రభుత్వమే ఈ రుణంపై ఆసక్తి చూపలేదా? దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది.

నిబంధనల ప్రకారం... రాష్ట్రాలు నేరుగా ప్రపంచ బ్యాంకు నుంచి రుణం పొందలేవు. సంబంధిత ప్రాజెక్టులను కేంద్రం ప్రతిపాదించి తీరాలి. ఇలాగే... గతంలో అమరావతి ప్రాజెక్టుకు రుణం ఇవ్వాలంటూ ప్రపంచ బ్యాంకును కేంద్రం కోరింది.

అయితే, ఈ అభ్యర్థనను వెనక్కి తీసుకుంటున్నామని కేంద్రం నుంచి తమకు సమాచారం వచ్చిందని, అందుకే ప్రాజెక్టు నుంచి తాము తప్పుకొన్నామని ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా విభాగం సీనియర్  కమ్యూనికేషన్స్‌ అధికారి ఎలీనా కారబన్ మీడియాకి తెలిపారు భారత ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల బోర్డుకు తెలియజేశామని... ఈ ప్రాజెక్టుపై తదుపరి చర్యలు తీసుకోవడం లేదని తెలిపినట్లు ఆయన ఈ-మెయిల్‌లో స్పష్టం చేశారు. అయితే... అమరావతి రుణ ప్రతిపాదనను ఉన్నట్టుండి కేంద్రం ఎందుకు వెనక్కి తీసుకుందన్నదే ఇక్కడ అసలు విషయం!

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... అమరావతిలో జరుగుతున్న రహదారుల నిర్మాణం, ఇతర పనులను తనిఖీ చేసేందుకు ప్రపంచ బ్యాంకు బృందం గత నెలలో ఇక్కడ పర్యటించాలని భావించింది. అయితే... దీనిపై జగన్‌ సర్కారు ఆసక్తి చూపలేదని తెలిసింది. తాము ప్రాజెక్టును పునఃపరిశీలించి కొత్త ప్రతిపాదనలు పంపాలనుకున్నామని తెలిపింది. ఈ విషయం తెలిసిన తర్వాతే కేంద్రం తన వైఖరి మార్చుకున్నట్లు సమాచారం.

రాష్ట్ర ప్రభుత్వానికే రాజధాని పట్ల ఆసక్తి లేకపోవడం వల్లే... రుణ ప్రతిపాదనను వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రపంచ బ్యాంకుకు కేంద్రం సమాచారం పంపినట్లు తెలిసింది. ఒక దేశంలోని రాష్ట్రంలో ఇలా ప్ర‌పంచ బ్యాంకు త‌నిఖీ చేస్తే.. దేశంలో జ‌రిగే ఇత‌ర ప్రాజెక్టుల‌పైనా దీని ప్ర‌భావం ప‌డుతుంద‌ని కేంద్రం భావిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే వెన‌క్కి త‌గ్గింది.

ఇక‌, చంద్ర‌బాబు అనుస‌రించిన వైఖ‌రి కూడా దీనికి ప్ర‌ధాన కార‌ణంగా క‌నిపిస్తోంది. లేద‌ని ఉన్న‌ట్టుగా ఇక్కడ ఆయ‌న క‌ల్పించిన భ్ర‌మ‌లు రాజ‌ధానిపై ఎఫెక్ట్ ప‌డేలా చేశాయ‌ని అంటున్నారు. అదేస‌మ‌యంలో రైతుల నుంచి కూడా భారీగా భూమ‌లు తీసుకున్నా.. కొంద‌రు ఇష్ట‌ప‌డ‌లేదు. వారి నుంచి బ‌లవంత‌పు భూసేక‌ర‌ణ చేప‌ట్టారు.

దీంతో రాజ‌ధాని నిర్మా ణం విష‌యం ర‌గ‌డ‌కు దారి తీసింది. దీనిపై వైసీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌స‌మ‌యంలో మ‌రింత పెద్ద‌ది చేసింద‌నేది వాస్త వం. అస‌లు 33 వేల ఎక‌రాలు రాజ‌ధానికి ఎందుకు? అనే ప్ర‌తిపాద‌న‌ను తెర‌మీదికి తెచ్చారు. ఈ క్ర‌మంలో అటు టీడీపీ, ఇటు వైసీపీ రెండూ కూడా దీనికి కార‌ణ‌మ‌నే వ్యాఖ్య‌లు సాధార‌ణ ప్ర‌జ‌ల నుంచి వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English