ధోని రిటైరవుతున్నాడు.. ఇదిగో ప్రూఫ్

ధోని రిటైరవుతున్నాడు.. ఇదిగో ప్రూఫ్

మామూలుగా ప్రపంచకప్ ముగియగానే.. టోర్నీలో భారత జట్టు ప్రదర్శన గురించి చర్చ నడుస్తుంది. సమీక్షలు జరుగుతాయి. కానీ భారత క్రికెట్లో ఇప్పుడు టాపిక్ అది కాదు. అందరూ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రపంచకప్ అవ్వగానే ధోని రిటైరవుతాడన్న అంచనా నిజం కాకపోవడంతో దీని గురించి రకరకాలు చర్చలు జరిగిపోతున్నాయి.

ధోని ప్రకటన చేసే వరకు జనాలు ఊరుకునేలా లేరు. సామాజిక మాధ్యమాల్లో ధోని రిటైరవ్వాలని ఓ వర్గం.. వద్దొద్దంటూ ఇంకో వర్గం.. అసలు ధోని ఏం చేయబోతున్నాడంటూ మరో వర్గం.. వాదోపవాదాలు సాగించేస్తున్నాయి. ఐతే ధోని మాత్రం సైలెంటుగా ఉన్నాడు. ఇలా అందరూ మాట్లాడుతున్నపుడు రిటైర్మెంట్ ప్రకటించడం అతడికి ఇష్టం లేనట్లే ఉంది. తన టాపిక్ వదిలేసి అందరూ సైలెంటైపోయాక అతను ప్రకటన చేస్తాడేమో అనిపిస్తోంది.

ఐతే తాను అతి త్వరలోనే రిటైరవబోతున్నట్లు ధోని తాజాగా ఒక హింట్ ఇచ్చాడు. దాని ప్రకారం అయితే ధోని ఆల్రెడీ రిటైరైపోయాడనే భావించాలి. ధోని ఆర్మీలో అధికారిగా గౌరవ హోదాలో ఉన్న సంగతి తెలిసిందే. అప్పుడప్పడూ బోర్డర్‌కు వెళ్లి ఒకట్రెండు రోజులు గడిపి వస్తుంటాడు. ఇప్పుడు ఆర్మీ సేవల కోసం రెండు నెలలు వెళ్తున్నానని.. కాబట్టి వెస్టిండీస్ పర్యటనకు తనను పరిగణనలోకి తీసుకోవద్దని సెలక్టర్లకు సమాచారం ఇచ్చాడు ధోని.

దీన్ని బట్టి ధోని ఆ రెండు నెలల తర్వాత మళ్లీ భారత జట్టులోకి వస్తాడని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇక్కడో మతలబు ఉంది. ఆరేళ్ల కిందట ఆర్మీలో గౌరవ హోదాలో చేరిన సమయంలో ధోని ఒక మాట చెప్పాడు. తాను క్రికెట్లో ఉండగా ఆర్మీ విధులు నిర్వర్తించలేనని.. కానీ క్రికెట్ వదిలేయగానే కచ్చితంగా ఆర్మీలోకి వచ్చి ఫుల్ టైం విధులు నిర్వర్తిస్తానని అన్నాడు.

దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నట్లు సంకేతాలు ఇచ్చినట్లే అని భావిస్తున్నాడు. తన గురించి చర్చలు ఆగాక.. ప్రశాంతంగా ఒక రోజు అతను రిటైర్మెంట్ ప్రకటన చేస్తాడేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English