అసెంబ్లీలో వైసీపీకి మరో ఎమ్మెల్యే..!?

అసెంబ్లీలో వైసీపీకి మరో ఎమ్మెల్యే..!?

రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పై  రాష్ట్రవ్యాప్తంగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌తిప‌క్ష పార్టీలో ఉండి, అసెంబ్లీలో అధికార ప‌క్షాన్ని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతుండ‌టంతో అటు టీడీపీతోపాటు, ఇటు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు విస్మ‌యానికి గుర‌వుతున్నారు. అస‌లు ఆయ‌న ఏ ఉద్దేశ్యంతో  అంత‌లా అధికార పార్టీని వెన‌కేసుకొస్తున్నారో తెలియ‌డం లేదంటూ చెవులు కొరుక్కుంటున్నారు. ఇటీవ‌ల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహ‌ర్ లాంటి  కీల‌క నేత‌లు ఓట‌మిపాల‌య్యారు. కాగా రాజోలు నుంచి పార్టీ అభ్య‌ర్థి రాపాక వ‌ర‌ప్ర‌సాద్ ఎమ్మెల్యే గా విజ‌యం సాధించి, ఒకే ఒక్క‌డుగా రాష్ట్ర వ్యాప్తంగా పాపుల‌ర్ అయ్యారు.

జ‌న‌సేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా సంచ‌ల‌నం సృష్టించిన రాపాక వ‌ర‌ప్ర‌సాద్ అధికార పార్టీని ప్ర‌శ్నిస్తార‌ని, అసెంబ్లీలో పార్టీ గ‌ళాన్ని బ‌లంగా వినిపిస్తార‌ని అంతా భావించారు. కానీ ఇటీవ‌ల ఆయ‌న వ్య‌వ‌హార శైలి తీవ్ర చర్చ‌నీయాంశ‌మైంది. అయితే, అసెంబ్లీలో రాజోలు ఎమ్మెల్యే ప్రసంగాలు ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌పై, విపక్షం కారాలు మిరియాలు నూరుతోంది. జన సేన కూడా విపక్షమే కాబట్టి, రాపాక వరప్రసాద్ తప్పొప్పులు ఎత్తిచూపుతారని, అంతా  భావించారు. అయితే వైసీపీ బడ్జెట్‌ అద్బుతంగా ఉందంటూ, రాపాక వరప్రసాద్ ప్రశంసించడం, జనసేన కార్యకర్తలను ఆశ్చర్యానికి గురి చేసింది. అభివృద్ది, సంక్షేమం రెండింటికీ సమానమైన ప్రాధాన్యత చేస్తూ సీఎం జగన్ సారథ్యంలోని ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టిందని కొనియాడారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి బాటలోనే ఆయన కుమారుడు జగన్ కూడా నడుస్తున్నారని వ్యాఖ్యానించ‌డంపై అంతా విస్మ‌యానికి గుర‌య్యారు.

అంతేగాక రైతులు జగన్ ప్రభుత్వం కోసం ఎదురు చూశారని, మత్సకారులు కూడా జగన్ పై నమ్మకం పెట్టుకున్నారని, వారు కోరుకోకుండానే వారికి వరాలు తీర్చే వ్యక్తిగా జగన్‌ను చూస్తున్నారని రాపాక అన్నారు. ఇవే వ్యాఖ్యలు ఇప్పుడు జనసేనలో కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. ఒకవైపేమో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ సర్కారు  తప్పొప్పులను ఎత్తిచూపిస్తామని అంటున్నారు. ఇటు అసెంబ్లీలో బడ్జెట్‌పై టీడీపీ ఘాటైన వ్యాఖ్యలు చేస్తోంది. జనసేన ఎమ్మెల్యే కూడా విపక్షంలా విమర్శిస్తారనే భావిస్తే, ఎమ్మెల్యే వ‌ర‌ప్ర‌సాద్ మాత్రం అందర్నీ ఆశ్చర్యపరుస్తూ, జగన్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. రాపాక వ్య‌వ‌హారంతో జనసేన కార్యకర్తలు అసంతృప్తికి గుర‌వుతున్న‌ట్లు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English