జగనొచ్చాడు... అమరావతికి వరల్డ్ బ్యాంకు రుణం రద్దైంది

జగనొచ్చాడు... అమరావతికి వరల్డ్ బ్యాంకు రుణం రద్దైంది

అన్నొచ్చాడు అంటూ  సంబరాలు  చేసుకున్న వైసీపీ శ్రేణులు ఇప్పుడు ఏమంటాయో చూడాలి. జగనన్న వస్తే... రాజన్న రాజ్యం వచ్చినట్టేనని ఆ పార్టీ శ్రేణులతో పాటు పార్టీ కీలక నేతలు, స్వయంగా జగనే స్వయంగా ఘనంగా చెప్పుకున్నారు. తాజా ఎన్నికల్లో జగన్ మాటలు నమ్మి జనం వైసీపీకి ఓట్లేస్తే... ఇప్పుడు ప్రపంచ బ్యాంకు మాత్రం ఏపీ ప్రజలకు చేదు వార్తను వినిపించింది. ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి తానిస్తానన్న 300 మిలియన్ డాలర్ల రుణాన్ని నిలిపివేస్తున్నట్లుగా వరల్డ్ బ్యాంకు ఇప్పుడు బాంబు లాంటి వార్తను వినిపించింది.

చంద్రబాబు పాలనలో ఏపీకి నూతన రాజధానిగా నిర్మిస్తున్న అమరావతిని తామెలా అభివృద్ధి చేస్తామన్న విషయంపై టీడీపీ సర్కారు ఇచ్చిన ప్రజెంటేషన్ కు మెచ్చిన ప్రపంచ బ్యాంకు... ఏపీ రాజధాని అమరావతికి 300 మిలియన్ డాలర్ల మేర రుణాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు చంద్రబాబు సర్కారుకు సమాచారం కూడా చేరవేసింది. అయితే ఆ రుణం ఏపీకి విడుదలయ్యేలోగానే ఎన్నికలు జరగడం, ఏపీ ప్రజల తీర్పు మేరకు చంద్రబాబు పదవి నుంచి దిగిపోవడం, చంద్రబాబు స్థానంలో వైఎస్ జగన్ కొత్త సీఎంగా పాలనా పగ్గాలు చేపట్టడం జరిగిపోయాయి.

ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కారు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని పున:సమీక్ష చేస్తామని జగన్ చేసిన ప్రకటన పెట్టుబడిదారులను, ఆర్థిక సంస్థలను భయాందోళనలకు గురి చేసిందన్న వాదన వినిపించింది. ఆ వాదన నిజమేనన్నట్లుగా ఇప్పుడు ప్రపంచ బ్యాంకు ఇదివరకే ఏపీకి ప్రకటించిన రుణాన్ని రద్దు చేస్తున్నట్లుగా తన వెబ్ సైట్ లో చాలా స్పష్టంగానే ప్రకటించేసింది. ఏపీ రాజధాని అమరావతికి మంజూరు చేసిన రుణాన్ని రద్దు చేస్తున్నట్లుగా పేర్కొన్న వరల్డ్ బ్యాంక్... అందుకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.

అయితే గత సర్కారు తీసుకున్న నిర్ణయాలన్నింటినీ పున:సమీక్షిస్తామని జగన్ ప్రభుత్వం చేసిన ప్రకటన ఇతర ఆర్ధిక సంస్థలను, పెట్టుబడిదారులను ఏ విధంగా అయితే భయపెట్టిందో... అదే భయంతోనే ప్రపంచ బ్యాంకు కూడా ఇప్పుడు తాను అమరావతికి మంజూరు చేసిన రుణాన్ని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించిందన్న వాదన వినిపిస్తోంది. ఈ విషయంపై ఏపీసీఆర్డీఏ అదికారుల వద్ద ప్రస్తావిస్తే.. తమకు వరల్డ్ బ్యాంకు నుంచి ఇప్పటిదాకా ఎలాంటి సమాచారం రాలేదని, మంజూరైన రుణాన్ని సాధించేందుకే యత్నిస్తామని చెప్పుకొచ్చారు. మొత్తంగా చూస్తుంటే... జగన్ వచ్చిన తర్వాత నెలకొన్న భయాందోళనలతోనే వరల్డ్ బ్యాంకు ఈ రుణాన్ని రద్దు చేసిందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. జగన్ సీఎం అయి ఇంకా రెండు నెలలు కూడా గడవక ముందే వరల్డ్ బ్యాంకు బాంబు లాంటి వార్తను వినిపిస్తే... ఇక మున్ముందు ఎన్ని చేదు వార్తలను వినాల్సి వస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English