డీకే డేరింగ్.... గాలి అనుచరుడికే గాలమేసేశారు

డీకే డేరింగ్.... గాలి అనుచరుడికే గాలమేసేశారు

కన్నడనాట రాజకీయాల్లో రోజుకో మలుపు అన్న చందంగా సాగుతున్న పరిణామాల్లో... సంకీర్ణ సర్కారును ఎలాగైనా కూల్చేద్దామని చూస్తున్న కమల దళానికి హస్తం పార్టీ కూడా ఏమాత్రం తీసిపోని రీతిగానే వ్యవహారం నడిపిస్తోంది. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ సర్కారును ఉన్న పళంగానే కూల్చేసేందుకు బీజేపీ తహతహలాడుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏకంగా 16 మంది సంకీర్ణ కూటమిలోని ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించిన బీజేపీ... కుమార సర్కారుకు డేంజర్ బెల్స్ మోగించింది. అంతేకాకుండా కుమార సర్కారుకు ఏమాత్రం గాలి పీల్చుకోని అవకాశం ఇవ్వరాదన్న ప్లాన్ తో సాగుతున్న బీజేపీ... నిన్నటికి నిన్న మరో ఎమ్మెల్యేను సంకీర్ణానికి దూరం చేసేసింది.

అంతటితో ఆగకుండా గురువారం నాడే కుమార బల నిరూపణ పూర్తయ్యేలా వ్యూహం అమలు చేసింది. అయితే బీజేపీ వ్యూహాన్ని కుమార సమర్థంగానే అడ్డుకోగా... బీజేపీకి ఊహించని షాకిచ్చిన కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్... ఏకంగా మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి అనుంగు అనుచరుడైన ఎమ్మెల్యే శ్రీరాములకే గాలం వేసేశారు. ఇది ఎక్కడో బయట అనుకుంటే పొరబడినట్టే. నిండు సభలో ఓ పక్క బల నిరూపణకు బీజేపీ పట్టుబడుతున్న సమయంలోనే శ్రీరాములుకు డీకే గాలం విసిరారు.

బీజేపీ శిబిరంలోకి వస్తే... ఏకంగా డిప్యూటీ సీఎం పోస్టు ఇస్తామంటూ డీకే శివకుమార్... శ్రీరాములుకు బంపర్ ఆపర్ ఇచ్చారు. ఈ సంప్రదింపుల సందర్భంగా డీకే, శ్రీరాములు సభలోనే... అది కూడా ముందు వరుసలోనే నిలబడి మాట్లాడుకున్న దృశ్యం పెను సంచలనంగా మారింది. గాలికి గట్టి మద్దతుదారుడిగానే కాకుండా తనకంటూ ఓ సొంత ఇమేజీని సంపాదించుకున్న శ్రీరాములు... డీకే ఆపర్ కు పడిపోతారా? లేదా? అన్న విషయాన్ని పక్కనపెడితే... నిండు సభలో బీజేపీ ఎమ్మెల్యేకు డీకే బంపర్ ఆపర్ ఇస్తూ ఆయనను లాగేసేందుకు చేసిన యత్నం మాత్రం వైరల్ గా మారిపోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English