జగన్ ముందుకెళితే... వారంతా ఆర్థికంగా గుల్లే

జగన్ ముందుకెళితే... వారంతా ఆర్థికంగా గుల్లే

విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ)పై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాను అనుకున్నట్లుగా ముందుకు సాగితే... ఏం జరుగుతుంది? టీడీపీకి ప్రత్యేకించి ఆ పార్టీ అధినేత, ఈ ఒప్పందాలన్నింటికీ ఆద్యుడిగా నిలుస్తున్న నారా చంద్రబాబునాయుడికి చుక్కలు కనిపించడం ఖయమనే వరకే మనకు తెలుసు. జగన్ భావన కూడా అదే. తన పాలనలో తనకు ఇష్టమైన వారికి అడిగినంత మేర ధరలు పెంచేసి రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ కొనుగోలు చేశారన్నది బాబుపై జగన్ ఆరోపణ. ఆ వరకైతే... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు కూడా జగన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేదే కదా.

మరి తనను ఓడించేందుకు కంకణం కట్టుకుని మరీ పనిచేసిన చంద్రబాబుకు ఇబ్బంది కలిగే ఈ పనిని మోదీ సర్కారు ఎందుకు వద్దంటోంది? పీపీఏలపై పున:సమీక్ష జరిపితే దాని దుష్ప్రభావాలు ఒక్క ఏపీకే కాకుండా దేశంలోని చాలా రాష్ట్రాలపై పడుతుందని జగన్ ను వారిస్తుంది? నిజమే... తనకు శత్రువైన చంద్రబాబును ఇబ్బంది పెట్టడానికి సిద్దమైన జగన్ ను నిలువరించదు కదా? మరి ఈ అడ్డగింతల వెనుక ఉన్న అసలు కారణమేమిటి? ఆ కారణాన్ని ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ చాలా క్లియర్ గానే చెప్పేసింది. పీపీఏలను పున:సమీక్షిస్తే... చంద్రబాబుకు ఇబ్బందుల మాటేమో తెలియదు గానీ... విద్యుదుత్పత్తి సంస్థలన్నీ కుదేలవుతాయని ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

పీపీఏలను పున:సమీక్షిస్తే... ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు తక్కువ ధరలకు విద్యుత్ అందడం మాట అటుంచి విద్యుదుత్పత్తి రంగంలోని సంస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతాయట. ఇదే జరిగితే... ఇప్పుడు పుష్కలంగా అందుతున్న విద్యుత్... ఇకపై అరకొరగానే సరఫరా అయ్యే ప్రమాదం లేకపోలేదని ఆ సంస్థ వాదిస్తోంది. జగన్ పున:సమీక్షించాలనుకుంటున్న పీపీఏలన్నీ కూడా సౌర, పవన విద్యుదుత్పత్తి సంస్థలతో జరిగిన ఒప్పందాలే. దీంతో జగన్ పున:సమీక్షకే ముందుకెళితే... ఈ రంగంలోకి దాదాపుగా అన్ని విద్యుదుత్పత్తి సంస్థలపై ప్రభావం పడటం గ్యారెంటీనే.

వెరసి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ఆ సంస్థలు తమ కార్యకలాపాలు సాగించడం కష్టమే. ఇదే జరిగితే... సౌర, పవన విద్యుదుత్పత్తి క్రమంగా నిలిచిపోయే ప్రమాదం లేకపోలేదు. దీంతో కేవలం జలవిద్యుత్ పై ఆధారపడే నెట్టుకురావాల్సిన పరిస్థితి. మరి దేశ అవసరాలకు సరిపడ జల విద్యుత్ ఉత్పత్తి కావడం లేదు కదా. వెరసి అటు విద్యుదుత్పత్తి సంస్థలు గుల్ల అయిపోవడంతో పాటుగా దేశానికి సరిపడ విద్యుదుత్పత్తి కూడా నిలిచిపోతుందన్నమాట. ఈ భావన మేరకే... పీపీఏలను పున:సమీక్షపై మరోమారు ఆలోచించాలని కేంద్రం జగన్ ను కోరిందన్న మాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English