JD vs JP: ఇలా మిగిలిపోవాల్సిందేనా…?


తాజాగా సోష‌ల్ మీడియాలో ఈ త‌ర‌హా చ‌ర్చ ఆస‌క్తిగా మారింది. జేడీ వ‌ర్సెస్ జేపీ ఇద్ద‌రికీ పెద్ద‌గా తేడా లేద‌ని అంటున్నారు. జేడీ అంటే.. సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ రాజ‌కీయాలు పెద్ద‌గా పుంజుకున్న దాఖలా క‌నిపించ‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన త‌ర‌ఫున విశాఖ నుంచి పోటీ చేసిన‌.. ఆయ‌న‌.. ఓడి పోయారు. త‌ర్వాత‌.. పార్టీకి దూర‌మ‌య్యారు. అయితే.. ఇప్పుడు ఆయ‌న ఊసుఎక్కడా వినిపించ‌డం లేదు. పైగా.. విశాఖ‌లోనూ ప‌ట్టు ద‌క్కించుకునేందుకు ఆయ‌న చేస్తున్న ప్ర‌య‌త్నాలు కూడా క‌నిపించ‌డం లేదు.

దీంతో జేడీ రాజ‌కీయాలు చేస్తారా?  మానుకుంటారా? అనే సందేహం వ‌స్తోంది. మాజీ ఐపీఎస్ అయిన జేడీ.. అనుకున్న విధంగా పాలిటిక్స్ చేయ‌లేక పోతే.. రెంటికీ చెడ్డ రేవ‌డి అయిపోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నా రు. ఎందుకంటే.. గెలుస్తార‌నే న‌మ్మ‌కం.. పార్టీని బ‌ట్టి కాకుండా.. ఇప్పుడు వ్య‌క్తిగ‌తంగా ఇమేజ్ పెరిగింది. పార్టీని న‌మ్ముకుని.. లేదా.. పార్టీ జెండాపై గెలిచేవారి కంటే.. త‌మ సొంత అజెండాతో గెలుస్తు.. పార్టీని గెలిపించే నాయ‌కులు ఇప్పుడు రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌కు అత్యంత కీల‌కం. అందుకే.. ఇప్పుడు జేడీ ప‌రిస్థితి మ‌రో జేపీగా మారిపోయిందా? అనే ప్ర‌శ్న వ‌స్తోంది.

ఇక‌, జేపీగురించి చూద్దాం. లోక్‌స‌త్తా పేరుతో .. రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ‌.. ఒక్క‌ద‌ఫా కూక‌ట్‌ప‌ల్లి ఎమ్మెల్యేగా విజ‌యం ద‌క్కించుకున్నారు. త‌ర్వాత‌.. ఆయ‌న రాజ‌కీయాలు క‌నుమ‌రుగ‌య్యాయి. ప్ర‌స్తుతం ఆయ‌న ఎక్క‌డ ఉన్నారో.. కూడా తెలియ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. పైగా.. ఆ పార్టీని స్వ‌చ్ఛంద సంస్థ‌గా కూడా మార్చేశారు. అంటే.. దాదాపు మాజీ ఐఏఎస్ అయిన‌.. జేపీ.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చి. క‌నీసం ఒక ద‌ఫా అయినా.. గెలిచి.. త‌ర్వాత త‌ప్పుకొన్నారు. కానీ, ఇప్పుడు జేడీ ప‌రిస్థితి ఒక్క‌సారి కూడా స‌ఫ‌లీకృతం అయ్యేలా లేదు.

తాజాగా ఆయ‌న స్వ‌చ్ఛంద సంస్థ‌లు ఏర్పాటు చేసుకుని స‌ర్వేలు చేస్తున్నారు. రైతుల‌ను క‌లుస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఇక‌, జేడీ రాజ‌కీయాలు కూడా స్వ‌చ్ఛంద సంస్థ‌గానే మారిపోతుందా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వాస్త‌వానికి ఇప్ప‌టికే గ‌ట్టిగా నిల‌బ‌డి ఉంటే బాగుండేద‌ని.. ఎన్నిక‌ల త‌ర్వాత‌.. యాక్టివ్ అయితే.. ఆ మ‌జానే వేరుగా ఉండేద‌ని అంటున్నారు. కానీ, జేడీ వేసిన అడుగులు ఆయ‌న‌ను రాజ‌కీయంగా ఇర‌కాటంలోకి నెట్టాయ‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు. ఈక్ర‌మంలోనే జేడీ వ‌ర్సెస్ జేపీ.. రాజ‌కీయాలపై కామెంట్లు ప‌డుతున్నాయి.