వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ మధ్య వార్.. జగన్‌ వద్దకు పంచాయితీ

వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ మధ్య వార్.. జగన్‌ వద్దకు పంచాయితీ

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో వైసీపీ నేతల మధ్య కుమ్ములాటలు ఆ పార్టీ పెద్దలను చికాకు పెడుతున్నాయి. అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాక ముందే అధికార పార్టీ నేతల్లో వర్గపోరులు, విభేదాలు బయటపడుతుండడంతో ఆ విషయాలు బయటకు పొక్కకుండా ఉండేందుకు పార్టీ పెద్దలు నానా తిప్పలు పడుతున్నారట. అందులోనూ... ఏకంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత ఇష్టుడుగా చెప్పుకొనే ఎంపీ... అలాగే రాజధాని ప్రాంతంలో వైసీపీకి ప్రధాన గొంతుక.. జగన్ పాదయాత్రలో ఆయన వెంటన నడిచిన యువ మహిళా నేతగా గుర్తింపు ఉన్న ఎమ్మెల్యే మధ్య వివాదం ఇప్పుడు వైసీపీకి తలనొప్పి తెస్తోంది. కొద్దిరోజులుగా సాగుతున్న గొడవలకు ముగింపు పడకపోవడంతో చివరకు ఇప్పుడు వివాదం జగన్ వద్దకు చేరిందట.

బాపట్ల ఎంపీ నందిగం సురేష్-తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మధ్య నడుస్తున్న వార్ సీఎం జగన్మోహన్ రెడ్డి వద్దకు చేరింది. కొద్దిరోజులుగా ఈ ఇద్దరి నేతల మధ్య తీవ్ర విబేధాలు తెలెత్తాయి. మూడు రోజుల క్రితం ఈ ఇద్దరి అనుచరులు ఓ ఫ్లెక్సీ వివాదంలో దాడులు చేసుకొని ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే శ్రీదేవి ఏకంగా సీఎం జగన్ కు ఫిర్యాదు చేశారు. బాపట్ల ఎంపీగా ఉంటూ తమ నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్నారని, అక్రమ ఇసుక తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారని శ్రీదేవి నందిగం సురేష్ మీద ఫిర్యాదు చేశారు.

నిజానికి ఎన్నికల సమయంలో శ్రీదేవి, సురేశ్ కలిసిమెలసి ప్రచారం చేశారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరిద్దరూ ఒకరి విజయం కోసం మరొకరు కృషి చేశారు. ఇద్దరినీ విజయం వరించాక వర్గ పోరు మొదలైంది. ఇటీవలే ఫ్లెక్సీ వివాదంలో ఇద్దరు నేతల అనుచరులు ఘర్షణకు దిగారు. ఫ్లెక్సీల్లో ఎంపీ ఫోటో చిన్నదిగా, ఎమ్మెల్యే ఫోటో పెద్దదిగా వేశారని నందిగం వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఫోటో వేసిన వ్యక్తిని బెదిరించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఎమ్మెల్యే అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఇసుక వ్యవహారంలోనూ ఈ ఇద్దరి అనుచరుల మధ్య గొడవలు మొదలయ్యాయి. గుంటూరు లోక్‌సభ స్థానం పరిధిలోకి వచ్చే తన నియోజకవర్గ వ్యవహారాల్లో బాపట్ల ఎంపీ తలదూరుస్తున్నారని, ఇసుక అక్రమ తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే సీఎం జగన్‌కు ఫిర్యాదు చేశారు.

రాజధాని భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో నందిగం సురేశ్ కీలక పాత్ర పోషించారు. రాజధానిలో వైఎస్ఆర్సీపీ తరఫున గళం వినిపించిన సురేశ్.. జగన్‌ అభిమానం చురగొన్నారు. దీంతో పార్టీలోని ఇతర నేతలు వారించినప్పటికీ.. ఏరికోరి మరీ జగన్ సురేశ్‌కు ఎంపీ టికెట్ ఇచ్చారు. ఎన్నికల్లో ఆయన ఖర్చంతా పార్టీనే భరించింది. అలాగే ఉండవల్లి శ్రీదేవిని కూడా జగన్ ప్రోత్సహించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English