చంద్రబాబు టార్గెట్‌గా చతుర్ముఖ వ్యూహం

చంద్రబాబు టార్గెట్‌గా చతుర్ముఖ వ్యూహం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరుగుతున్న పరిణమాలు చూస్తుంటే పైకి వాదప్రతివాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలే కదా అన్నట్లుగా ఉన్నా అందులో వైసీపీ చతుర్ముఖ వ్యూహం కూడా స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

వైసీపీ అమలు చేస్తున్న ఈ చతుర్ముఖ వ్యూహాన్ని ఎవరు రచించారో కానీ నలభయ్యేళ్ల అనుభవం ఉన్న చంద్రబాబును ఎదుర్కోవడంలో జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా ఇంత పకడ్బందీ వ్యూహం రచించలేదంటున్నారు. ఈ చతుర్ముఖ వ్యూహం అమలవుతున్న ప్రారంభంలోనే చంద్రబాబును ముప్పతిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగించడం చూస్తుంటే ముందుముందు చంద్రబాబుకు మరిన్ని ఇబ్బందులు తప్పవని అర్థమవుతోంది.

వైసీపీ ఏ వ్యూహం రచించినా దానికి ప్రధాన టార్గెట్ చంద్రబాబే. అసెంబ్లీకి రావాలంటేనే చంద్రబాబు భయపడేలా చేయడం వైసీపీ లక్ష్యమని విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రబాబును వైసీపీ ఇంతగా టార్గెట్ చేయడానికి కారణం ఉంది. గత ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు కావచ్చు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కావొచ్చు అసెంబ్లీలో ప్రధానంగా జగన్‌ను టార్గెట్ చేశారు అనే భావన బలంగా ఉంది.

దానికి బదులు తీర్చుకోవాలని ఉద్దేశంతోనే అసెంబ్లీ సాక్షిగా ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా గత శాసనసభలో వైసీపీ నుంచి గెలిచిన వారిలో 23 మందిని టిడిపి తమ పార్టీలోకి తీసుకుని తర్వాత రెండు పార్టీల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇది అసెంబ్లీలో కూడా కనిపించింది. ఆ సమయంలో అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు.. తెలుగుదేశం పార్టీ తమ సభ్యులను ఎంతమంది తీసుకున్నా కూడా తాము ఐదుగురు ఉంటే చాలు పాండవుల్లా పోరాటం చేస్తాం అని పదేపదే చెబుతుండేవారు. ఆ ఫిరాయింపులకు, జగన్‌ను బచ్చాను చేసి మాట్లాడడానికి ప్రతీకారమే ప్రస్తుత అసెంబ్లీలో జరుగుతున్న పరినామాలని చెబుతున్నారు.

వ్యూహం 1

చంద్రబాబు పై ప్రతీకారం లో భాగంగా వైసీపీ చాలా పక్కా వ్యూహంతో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇందులో మొదటి దశలో.. చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో కొత్త రాష్ట్రానికి చేసిందేమీ లేదని.. ప్రజలు ఆయన చేసిందేమీ లేదనేది  ఎస్టాబ్లిష్ చేయటం వైసిపి లక్ష్యంగా తెలుస్తోంది. దీని కోసం ఒకటి తరువాత ఒకటి ఆరోపణలు చేస్తూ, ఇష్యూస్ తీసుకొస్తూ కంటిన్యుయస్‌గా చంద్రబాబును టార్గెట్ చేయడం.. చంద్రబాబు వాటికి సమాధానం చెప్పుకునేలా చేయడం.

ఈ వ్యూహం వెనుక ఉన్న ప్రధాన ఆలోచన ఏమిటంటే చంద్రబాబు లేదా టిడిపి ఇప్పుడు ప్రతి రోజు డిఫెన్స్ లో ఉండేటట్లయితే తమ పాలనపై ఏమాత్రం విమర్శలు చేసే పరిస్థితి ఉండదన్నది వైసీపీ వ్యూహంగా చెబుతున్నారు. ఇది నిజంగా అసాధారణ వ్యూహమే. అసెంబ్లీలో ఎప్పుడూ విపక్షాలు విమర్శలు చేస్తుంటే ప్రభుత్వం దాన్ని కాస్కుంటూ సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ.. ఏపీ అసెంబ్లీలో విపక్ష నేత చంద్రబాబుపై విమర్శలు, ప్రశ్నలతో అధికారపక్షం దాడి చేస్తుంటే ఆయన తన హయాంలో జరిగినవాటికి సమాధానం చెప్పుకొంటున్నారు.

వ్యూహం 2
ఇక రెండోది అవినీతి ముద్ర. చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులు, టీడీపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు నిత్యం చేస్తుంటే ఆ బురదను కడుక్కోవడానికే చంద్రబాబుకు సమయం సరిపోతుంది. అంతేకాదు.. జగన్‌పై చంద్రబాబు వేసిన అవినీతి ముద్రకు సమానంగా చంద్రబాబుపైనా అవినీతి బురద చల్లడం వైసీపీ వ్యూహంగా తోస్తోంది.  

వ్యూహం 3
ఇక మూడోది తమిళనాడు ఫార్ములా. తమిళనాడులో  ఎవరు అధికారంలో ఉంటే వారు ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని తీవ్రమైన అవమానాలు, పరాభవాలకు గురి చేయడం. కరుణానిధి, జయలలితల  అక్కడ జరిగిన రాజకీయం.. అవమానాలు ఇవన్నీ కూడా దేశం చూసింది.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా దాదాపు అదే పరిస్థితులు కనిపిస్తున్నాయి . చంద్రబాబుని అవమానించడం వైసిపి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

వ్యూహం 4
నాలుగోది పూర్తిగా భిన్నమైన వ్యూహం. అసెంబ్లీలో చంద్రబాబును కార్నర్ చేస్తున్నారు అని ప్రజలు అనుకోకుండా ఆయనకు ప్రాధాన్యం ఇవ్వడం. అందుకు ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం.  ఆయన మాట్లాడేటప్పుడు వైసిపి సభ్యులంతా మౌనంగా ఉండడం అనేది ఒక వ్యూహంగా కనిపిస్తుంది. కానీ చంద్రబాబు మాట్లాడటం పూర్తయిన తర్వాత ఆయన పై ఎటాక్ మొదలుపెడుతున్నారు.  ఈ రకంగా చతుర్ముఖ వ్యూహంతో వైసిపి చంద్రబాబుని నిత్యం డిఫెన్స్ లో ఉంచుతూ చంద్రబాబు తనను తాను రక్షించుకునేలా చేస్తూ.. చంద్రబాబును రక్షించే అవసరం మిగతా ఎమ్మెల్యేలకు కలిగేలా చేస్తూ టీడీపీ టీంకు ఏమాత్రం ఖాళీ లేకుండా చేస్తోంది వైసీపీ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English