గందరగోళంగా గ్రామ వలంటీర్ల వ్యవస్థ?

గందరగోళంగా గ్రామ వలంటీర్ల వ్యవస్థ?

ఏపీ ప్రభుత్వం నియమించబోతున్న గ్రామ వలంటీర్ల జీతభత్యాలపై అనేక సందేహాలు ముసురుకుంటున్నాయి. వీరికి జీతాలు ఎవరు చెల్లిస్తారు ? ఏ పద్దు క్రింద చెల్లిస్తారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

అంతేకాదు.. బడ్జెట్‌లో వీరి జీతాల కోసం కేటాయించిన మొత్తం ఆర్నెళ్లకే సరిపోయేలా ఉండడంతో తరువాత సంగతి ఏం చేస్తారన్న ప్రశ్న వినిపిస్తోంది. సకలంలో జీతాలు రాకపోతే ఈ వ్యవస్థ వసూళ్ల వ్యవస్థగా మారిపోయే ప్రమాదముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇప్పటికే గ్రామ వలంటీర్లకు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. త్వరలో ఊరూరా వారు జాయిన్ కాబోతున్నారు. సుమారు 2,50,000 మంది ఈ విధుల్లో చేరబోతున్నారు. ఒక్కొక్కరికి నెలకు రూ.5 వేలు జీతం. అంటే... 2.5 లక్షల మందికి లెక్కేస్తే నెలకు రూ.125 కోట్లు జీతాలు అవుతాయి. ఏడాదికి .. రూ.1500 కోట్లవుతుంది. కానీ.. 2019 - 20 బడ్జెట్ లో గ్రామ వాలంటిరూ కోసం కేటాయించిన మొత్తం 720 కోట్లే. ఇది సుమారు ఆర్నెళ్ల కాలానికి సరిపోతుంది.

ఆ తరువాత కొత్తగా నిధులు విడుదల చేస్తేనే వారికి జీతాలు అందుతాయి. ప్రభుత్వం ఏమాత్రం నిధుల విడుదలలో ఆలస్యం చేసినా.. అసలే అప్పుల్లో ఉన్న ఏపీ ఖజానా నుంచి వీరి జీతభత్యాలకు నిధులివ్వలేకపోయినా కూడా ఇబ్బందులు మొదలవుతాయి. ప్రజల నుంచి ప్రతి పనికీ వసూళ్లు మొదలుపెట్టే ప్రమాదముంటుంది.

మరోవైపు గ్రామ వలంటీర్లకు ప్రభుత్వమే జీతాలిస్తాని చెబుతుండడం.. వీరిని జగన్ గవర్నమెంటు ఉద్యోగులుగా చెబుతుండడంతో ప్రభుత్వ ఉద్యోగికి రూ.5 వేల జీతం ఎలా ఇస్తారన్న ప్రశ్న వినిపిస్తోంది. ప్రభుత్వమైనా, ప్రయివేటయినా కనీస వేతనం కంటే ఇది తక్కువే. అలాంటప్పుడు గ్రామ వలంటీర్ల విషయంలో కార్మిక చట్టాలను ప్రభుత్వం కాలరాస్తోందనే అనుకోవాలి.

ఇది భవిష్యత్తులో రచ్చకు దారి తీస్తుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. కార్మిక సంఘాలు దీన్ని ప్రభుత్వంపై అస్త్రంగా వాడుకోవడం ఖాయమని తెలుస్తోంది. ఇన్ని చిక్కుముడులున్న గ్రామ వలంటీర్ వ్యవస్థను జగన్ ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుందా అన్నది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English