ఏపీలో మ‌రో ఇంట్ర‌స్టింగ్ ఎన్నిక‌... జ‌గ‌న్‌కు స‌వాలే...

ఏపీలో మ‌రో ఇంట్ర‌స్టింగ్ ఎన్నిక‌... జ‌గ‌న్‌కు స‌వాలే...

ఏపీలో మ‌రో స‌మరానికి స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతోంది. విశాఖ మేయ‌ర్‌ పీఠాన్ని ద‌క్కించుకునేందుకు అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్ష టీడీపీలు వ్యూహాలు ర‌చిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌డాఖా చూపించిన వైసీపీ.. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లోనూ అదే హ‌వాను కొన‌సాగించేందుకు సిద్ధ‌మ‌వుతోంది.

ఇక ప‌రువు కాపాడుకునేందుకు ప్ర‌తిప‌క్ష టీడీపీ అష్ట‌క‌ష్టాలు ప‌డుతోంది. అయితే.. ఇప్ప‌టివ‌ర‌కూ టీడీపీ ఒక్క‌సారి మాత్ర‌మే ఆ న‌గ‌ర మేయ‌ర్ పీఠాన్ని అందుకుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచితీరాల‌న్న క‌సితో వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. అధికారంలో ఉన్న వైసీపీ అడ్డుకోవ‌డం టీడీపీకి అంత సులువుకాద‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

నిజానికి.. ఏపీలోనే అతిపెద్ద న‌గ‌రం విశాఖప‌ట్నం. గ్రేట‌ర్ విశాఖ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో 2012 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌లేదు. అప్ప‌టి నుంచి పాల‌క‌వ‌ర్గం లేదు. ప్ర‌స్తుతం దానిని 81 వార్డుల‌తో ఏర్పాటు చేస్తున్నారు. అయితే.. ఈ మధ్యలో భీమునిపట్నం, అనకాపల్లి మునిసిపాలిటీలను కూడా జీవీఎంసీలో చేర్చారు. తాజాగా కొత్త జిల్లాలను ఏర్పాటు వార్త‌ల‌తో అనకాపల్లిని జీవీఎంసీ నుంచి పక్కన పెట్టారు.

అయితే.. గతంలో 72 వార్డులు ఉన్న జీవీఎంసీకి భీమిలీతో కలుపుకుంటే 81 వార్డులు అవుతాయి. చివ‌ర‌గా.. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఇక వార్డులలో జనాభా ప్రతిపదికన రిజర్వేషన్లు పూర్తి చేసేందుకు అధికార‌యంత్రాంగం సిద్ధంగా ఉంది.

అయితే.. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. విశాఖ మేయ‌ర్ పీఠం.. అన్ని పార్టీల‌కూ అత్యంత కీల‌కం కానున్న‌ది. అతిపెద్ద న‌గ‌రంలో అధికారం చేజిక్కిచుకుంటే.. అన్నిర‌కాలుగా బాగుంటుంద‌న్న ఆలోచ‌న‌లో వైసీపీ, టీడీపీ, బీజేపీలు ఉన్నాయి.

1981లో మేయ‌ర్ పీఠాన్ని బీజేపీ గెలుచుకుంది. ఇక‌ టీడీపీ 1987లో మొదటిసారి విశాఖ మేయర్ పదవిని అందుకుంది. ఆ త‌ర్వాత‌ మాత్రం వరుసగా కాంగ్రెస్ గెలిచింది. అత్యంత కీల‌కమైన న‌గ‌ర మేయ‌ర్ పీఠాన్ని అందుకోవ‌డమే ల‌క్ష్యంగా పార్టీలు క‌స‌ర‌త్తు చేస్తున్నాయి. ప్ర‌స్తుతం.. విశాఖ జిల్లాలో టీడీపీకి న‌లుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ప‌ట్టుతో గెలుపు రుచి చూడాల‌ని టీడీపీ అనుకుంటోంది.

ఇక అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పెను తుఫాన్ సృష్టించిన వైసీపీని అడ్డుకోవ‌డం ఇటు బీజేపీకి, అటు టీడీపీకి అంత సులువు కాద‌న్న‌ది విశ్లేష‌కుల అంచ‌నా. ప్ర‌స్తుతం వైసీపీకి అర్బన్ జిల్లాలో ఎంపీ ఉన్నారు. ఇంత ఘ‌న‌విజ‌యం సాధించినా న‌గ‌రంలో ఉన్న నాలుగు సీట్ల‌లో వైసీపీ అభ్య‌ర్థులు ఓడిపోవ‌డం జ‌గ‌న్‌కు రుచించ‌లేదు. దీంతో న‌గ‌రంపై ప్ర‌త్యేకంగా దృష్టి సారించాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను జ‌గ‌న్ గుర్తించారు. ఈ క్ర‌మంలోనే గ్రేట‌ర్ ఎన్నిక‌లు ప్ర‌తిష్టాత్మకంగా తీసుకోవాల‌ని ఇప్ప‌టికే పార్టీ నేత‌ల‌కు ఆదేశాలు జారీ చేశారు.

ఎంపీ ఎంవీవీ.స‌త్య‌నారాయ‌ణ‌తో పాటు మంత్రి అవంతి శ్రీనివాసరావుకు కూడా జిల్లాలో మంచి ప‌ట్టుంది. వీరిద్ద‌రితో పాటు తాజాగా విశాఖ అర్బ‌న్ డ‌వ‌ల‌ప్‌మెంట్ అథారిటీ చైర్మ‌న్ ఎంపికైన మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్‌కు జ‌గ‌న్ ఈ ఎన్నిక‌ల్లో పార్టీ గెలిపించే బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. అసెంబ్లీ గెలుపు ఊపులోనే మున్సిప‌ల్ ఎన్నికలు కూడా నిర్వ‌హించి, సునామి సృష్టించాల‌న్న వ్యూహంతో వైసీపీ ఉంది.

ఈ నేప‌థ్యంలోనే మ‌రో రెండు నెల‌ల్లో ఎన్నిక‌లుల నిర్వ‌హించేందుకు అధికార వైసీపీ సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా.. ఎలాగైనా ఏపీలో పాగా వేయాల‌ని చూస్తున్న బీజేపీ.. మేయ‌ర్ పీఠాన్ని అందుకునేందుకు ఎలాంటి వ్యూహం ర‌చిస్తుందో ? చూడాలి మ‌రి. ఏదేమైనా ఏపీలోనే కీల‌క న‌గ‌రంగా ఉన్న విశాఖ మేయ‌ర్ పీఠం గెలుచుకోవ‌డం సీఎంగా జ‌గ‌న్‌కు తొలి స‌వాల్ కానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English