ధోనీ ఫ్యాన్స్.. ఏమిటమ్మా ఈ అతి?

ధోనీ ఫ్యాన్స్.. ఏమిటమ్మా ఈ అతి?

మైదానం లోపల, బయట మహేంద్రసింగ్ ధోని ఎంత హుందాగా నడుచుకుంటాడో తెలిసిందే. ఒకప్పుడు ధోని అభిమానులు సైతం ఇలాగే హుందాతనం ప్రదర్శించేవాళ్లు. కానీ ఈ మధ్య వాళ్లు శ్రుతి మించిపోతున్నారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ధోని ఒకప్పటితో పోలిస్తే గత రెండు మూడేళ్లలో అంత వేగంగా ఆడట్లేదు. అతడి బ్యాటింగ్‌లో ఊపు తగ్గింది.

వికెట్ కీపింగ్, డీఆర్ఎస్‌‌పై నిర్ణయం తీసుకోవడం, వ్యూహాలు.. ఇలా అన్నింట్లోనూ ధోనికి ముందులా కలిసి రావడం లేదు. దీంతో సహజంగానే అతడిపై విమర్శలు రావడం సహజం. ధోనీని అందరూ తెగ పొగిడినప్పుడు స్వీకరించిన వాళ్లు.. విమర్శల్ని కూడా తీసుకోవాల్సిందే. కానీ ధోని ఫ్యాన్స్ అలా చేయట్లేదు. ఎదురుదాడికి దిగుతున్నారు.

ఎన్నడూ లేని విధంగా సచిన్ టెండూల్కర్ అభిమానులకు, ధోని అభిమానులకు మధ్య కొంత కాలంగా ట్విట్టర్లో పెద్ద వార్ నడుస్తోంది. ధోని.. సచిన్‌ను ఎంతగా గౌరవిస్తాడో తెలిసిందే. కానీ సచిన్‌ కంటే ధోని గొప్పోడంటూ అతడి అభిమానులు సచిన్ ఫ్యాన్స్‌తో వాదోపవాదాలు చేస్తున్నారు. మాస్టర్‌ను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు. సచిన్ అభిమానులు కూడా కొంత అతి చేస్తున్నారు కానీ.. ధోని ఫ్యాన్స్‌తో పోలిస్తే తక్కువే.

ప్రపంచకప్‌లో ఓ మ్యాచ్ సందర్భంగా ధోని బ్యాటింగ్ వేగం గురించి చిన్న విమర్శ చేసినందుకు ధోని ఫ్యాన్స్ ఇదంతా చేయడం గమనార్హం. ఇంగ్లాండ్ మ్యాచ్‌లో ధోని ధాటిగా ఆడలేక చేతులెత్తేయడం వాస్తవం. ఓటమి ఖరారయ్యాక ఒకట్రెండు షాట్లు ఆడాడు. దీంతో స్ట్రైక్ రేట్ 100 దాటింది. అతడి కంటే ముందు వచ్చిన కోహ్లి, రోహిత్‌ల స్ట్రైక్ రేట్‌లతో పోల్చి ధోని ఏం తక్కువ ఆడాడంటూ చెత్త లాజిక్ తీయడం అతడి అభిమానులకే చెల్లింది.

ఇదంతా పక్కన పెడితే.. సెమీ ఫైనల్లో ధోని బ్యాటింగ్ మీద మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ ఆ రోజు పరిస్థితులకు తగ్గట్లే ఆడాడు కాబట్టి అతడినేమీ తప్పుబట్టడానికి లేదు. ఐతే గప్తిల్ రనౌట్ వల్ల ధోని ఔటైన సంగతి తెలిసిందే. ఫైనల్లో గప్తిల్ కూడా రనౌటవడంతోనే న్యూజిలాండ్‌కు కప్పు చేజారిన నేపథ్యంతో ‘కర్మ ఈజ్ ఎ బిచ్’ అంటూ మీమ్స్ పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు ధోని ఫ్యాన్స్. నిజానికి న్యూజిలాండ్ ఆటతీరుకు ఫిదా అవ్వని, వాళ్లు ప్రపంచకప్ గెలవనందకు బాధపడటి క్రికెట్ అభిమాని లేడు. ఇంగ్లాండ్ వాళ్లు సైతం వాళ్లను చూసి అయ్యో అనుకున్నారు.

భారత్‌ను ఓడించినప్పటికీ.. మన అభిమానుల్లో న్యూజిలాండ్ మీద ధ్వేష భావం కనిపించలేదు. జెంటిల్మన్‌ల్లా జెంటిల్మన్ గేమ్ ఆడే న్యూజిలాండ్ ఆటగాళ్లను అందరూ అభిమానిస్తారు. కానీ ధోని అభిమానులు మాత్రం సెమీఫైనల్ ఉదంతాన్ని గుర్తుపెట్టుకుని గప్తిల్‌ను ట్రోల్ చేయాలని చూస్తున్నారు. గప్తిల్ ఏమీ నిబంధనలకు విరుద్ధంగా, వక్రమార్గంలో ధోనీని ఔట్ చేయలేదు కదా? ఫైనల్లో అయితే వాళ్లు ఎంత గొప్పగా ఆడినా అదృష్టం కలిసిరాక విజయానికి దూరమయ్యారు. అలాంటపుడు వాళ్లను చూసి జాలి పడకుండా ఇలా ద్వేష భావం చూపించడం సబబా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English