ఆ ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు షాక్ ఇవ్వబోతున్నారా..?

ఆ ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు షాక్ ఇవ్వబోతున్నారా..?

తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికార పార్టీలో ఆందోళన కనిపిస్తోంది. ఆ ఎన్నికల్లో రాష్టంలోని 16 సీట్లను దక్కించుకోవాలనుకున్న టీఆర్ఎస్‌కు ఓటర్లు షాకిచ్చారు. దీంతో ఆ పార్టీ కేవలం తొమ్మిది స్థానాల్లోనే విజయం సాధించడానికి తోడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమార్తె కవిత ఓడిపోవడంతో టీఆర్ఎస్‌లో అలజడి మొదలైంది. దీని తర్వాత కేసీఆర్ ప్రభుత్వ కార్యక్రమాల వైపు దృష్టి సారించడంతో రాజకీయాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే, భారతీయ జనతా పార్టీ రూపంలో గులాబీ దళానికి కష్టాలు మొదలయ్యాయి.

 ముందస్తు ఎన్నికల్లో 117 స్థానాలకు గానూ ఆ పార్టీ ఒకే ఒక్క చోట విజయం సాధించగా.. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఊహించని విధంగా నాలుగు స్థానాలకు దక్కించుకుంది. దీంతో కాషాయ పార్టీలో ఉత్సాహం రెట్టింపైంది. దీనికితోడు, ఈ ఎన్నికల్లో గెలిచిన కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి దక్కడం ఆ పార్టీ నేతలను మానసికంగానూ దృఢంగా చేసింది. అప్పటి నుంచి బీజేపీ నేతలు అధికార పార్టీపై పోరాటాన్ని ఉదృతం చేశారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బలపడడంతో పాటు అధికారాన్ని చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో ఆ పార్టీ నేతలు తీవ్రంగా కష్ట పడుతున్నారు.

 ఇప్పుడిదే టీఆర్ఎస్‌కు గుదిబండగా మారిందని తెలుస్తోంది. ముందస్తు ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేపట్టిన తర్వాత ఆ పార్టీలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరారు. వీరిలో చాలా మంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని సమాచారం. ఇటీవల ఈ 12 మంది ఎమ్మెల్యేలు తమ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేశారు. దీన్ని స్పీకర్ కూడా ఆమోదించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయింది. ఇప్పుడు వీరిలో కొందరు బీజేపీ నేతలతో మంతనాలు జరుపుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
 
 టీఆర్ఎస్‌ను దెబ్బకొట్టాలనుకుంటున్న బీజేపీ.. ఆ పార్టీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తుందని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలతోనూ చర్చలు జరుపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అన్నీ ఓకే అయితే వీరిలో సగం మంది త్వరలోనే కారు దిగిపోయి.. కాషాయ కండువా కప్పుకుంటారని రాజకీయ వర్గాల్లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ఇదిలాఉండగా, కేసీఆర్ త్వరలోనే మంత్రివర్గాన్ని విస్తరిస్తారని, ఈ సారి కేబినెట్‌లో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కూడా చోటు దక్కబోతుందని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English