క‌న్నా ప‌ద‌వి ఊస్ట్‌...ఢిల్లీకి వెళ్లిన రిపోర్ట్ కార‌ణ‌మా?

క‌న్నా ప‌ద‌వి ఊస్ట్‌...ఢిల్లీకి వెళ్లిన రిపోర్ట్ కార‌ణ‌మా?

ఏపీ రాజ‌కీయాల‌పై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టిన బీజేపీ ఈ క్ర‌మంలో ఇందుకోసం ప‌క‌డ్బందీ ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగుతోంది. కేంద్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ దూకుడు పెంచింది. ముఖ్యంగా దక్షిణాదిన బలహీనంగా రాష్ట్రాల్లో, మరింత ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల నాటికి ఎంతో కొంత ప్రభావం చూపించాలని గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్ప‌టికే, ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉన్న సమయంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి నేతృత్వంలో నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జిలను పార్టీలోకి ఆహ్వానించేందుకు బీజేపీ మంతనాలు జరుపుతోంది. ఇదే స‌మ‌యంలో, పార్టీ అధ్య‌క్షుడిగా ఉన్న క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ప‌ద‌వికి ఎస‌రుపెట్టిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

టీడీపీలోని కీలక నేతలను తమ పార్టీలోకి లాగేసుకుని ప్రతిపక్ష హోదాను అనుభవించాలని ఉవ్విళ్లూరుతోంది. చరిత్రలో ఎన్నడూ లేనంత ఘోర ఓటమిని ఎదుర్కొన్న టీడీపీ ఓటమికి గల కారణాలను వెతుక్కునే పనిలో ఉండగానే ఆ పార్టీలోని కీలక నేతలను కండువా క‌ప్పిన‌ బీజేపీ వచ్చే ఎన్నికల నాటికి ప్రతిపక్ష హోదాను సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేస్తోంది. ఇందుకోసం ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను తొలగిస్తుందనే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎన్నికల అనంతరం ఏపీ నాయకులు బీజేపీలో చేరుతున్న సమయంలో కన్నా లక్ష్మీనారాయణ లేకపోవడంతో ఈ చ‌ర్చ మొద‌లైంది.

కన్నా లక్ష్మినారాయణ వైపు చోటుచేసుకుంటున్న ప‌లు ప‌రిణామాలు సైతం ఇందుకు ఊత‌మిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న‌ క‌న్నా తనతో పాటు బీజేపీలో చేరిన తన అనుచరులు, నేతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు బీజేపీలోని కొందరు నేతలే జాతీయస్థాయి నాయకత్వం వద్దకు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే, జాతీయస్థాయిలోని నాయకత్వం కన్నాకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని అందుకే చేరికల అంశాల్లో ఆయనను దూరం పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. త్వ‌ర‌లో ఆయ‌న్ను ప‌ద‌వి నుంచి సైతం త‌ప్పిస్తార‌ని ప‌లువురు నెటిజ‌న్లు అంచ‌నా వేస్తున్నారు.
 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English