ఇదేం స్ట్రాట‌జీ జ‌క్క‌న్నా?

రాజ‌మౌళి మేటి ద‌ర్శ‌కుడే కాదు.. తిరుగులేని మార్కెటింగ్ మాస్ట‌ర్ కూడా. త‌న సినిమాల‌ను ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం ఆయ‌న ప్ర‌మోట్ చేసే తీరు గొప్ప‌గా ఉంటుంది. ఒక తెలుగు సినిమాగా మొద‌లైన‌ బాహుబ‌లి దేశ‌వ్యాప్తంగా ఇర‌గాడేసింద‌న్నా.. ప్ర‌పంచ స్థాయికి చేరింద‌న్నా అందులో రాజ‌మౌళి మార్కెటింగ్ స్కిల్స్ కూడా కీల‌క‌మే. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విష‌యంలోనూ జ‌క్క‌న్న త‌న‌దైన ప్ర‌మోష‌న‌ల్ ప్లానింగ్‌తో దూసుకెళ్తున్నాడు.

పీవీఆర్ వాళ్ల‌తో డీల్ చేసుకున్నా.. వేర్వేరు న‌గ‌రాల్లో వ‌రుస‌బెట్టి ట్రైలర్ లాంచ్ కార్య‌క్ర‌మాలు, ప్రెస్ మీట్లు పెట్టినా.. ముంబ‌యిలో స్పెష‌ల్ ఈవెంట్ చేసినా, ఇప్పుడు ప్రొ క‌బ‌డ్డీతో టై అప్ అయి సినిమాను ప్ర‌మోట్ చేసుకున్నా.. అందులో రాజ‌మౌళి ముద్ర స్ప‌ష్టం. అయితే ఇవ‌న్నీ బాగున్నాయి కానీ.. ముంబ‌యిలో జ‌రిగిన ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్ లైవ్ ఇవ్వ‌కుండా దాన్ని ఆదాయ మార్గంగా మ‌లుచుకోవ‌డ‌మే ఇటు ఇండ‌స్ట్రీ జ‌నాల‌కు, అటు ప్రేక్ష‌కుల‌కు రుచించ‌డం లేదు.

లైవ్ ఇవ్వ‌లేదంటే.. కొంచెం లేటుగా చిత్ర బృందం వీడియోలు రిలీజ్ చేస్తుందేమో అనుకున్నారు. కానీ ఈ ఈవెంట్ కవ‌రేజ్ హ‌క్కుల‌ను భారీ మొత్తానికి హాట్ స్టార్ వాళ్ల‌కు అమ్మేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఐతే చేసిందేమో ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్, జ‌నాల‌కు సినిమాను చేరువ చేయ‌డం దీని ఉద్దేశం.

అలాంట‌పుడు సోష‌ల్ మీడియాలో, టీవీ ఛానెళ్ల‌లో ఈవెంట్ లైవ్ ఇచ్చి ప్ర‌మోట్ చేయాలి కానీ.. ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్ హ‌క్కుల‌ను ఓటీటీకి అమ్మి సొమ్ము చేసుకోవ‌డం ఏంటో అర్థం కావ‌డం లేదు. అస‌లిది సినిమా ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్ ఎలా అవుతుంది.. ఇదేం స్ట్రాట‌జీ అని ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు ప్రేక్ష‌కులు. ఈ విష‌యంలో ముంబ‌యి మీడియా వాళ్లు కూడా ఆగ్ర‌హంగానే ఉన్నారట‌. మ‌న‌తో కావాల్సినంత క‌వ‌రేజీ ఇప్పించుకుని.. ఈ ఈవెంట్‌కు మీడియాను దూరం పెట్టి డ‌బ్బు చేసుకోవ‌డం ఏంటి అని అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నార‌ట‌.