బీజీపీలోకి ధోనీ.. జార్ఖండ్ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్?

బీజీపీలోకి ధోనీ.. జార్ఖండ్ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్?

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ ప్రపంచ కప్ తర్వాత రిటైర్ అవుతున్నారా? నిన్నటి సెమీఫైనల్లో ఇండియా ఓటమిపాలై ఫైనలుకు చేరుకోలేక ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన నేపథ్యంలో ధోనీ భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. ధోనీ తన రిటైర్మెంట్ ప్రకటిస్తే ... ఆ తరువాత ఏం చేస్తారో అని అభిమానులు చర్చించుకుంటున్నారు. బీసీసీఐ, ఐసీసీలో ధోనీకి కీలక పదవులు దక్కొచ్చన్నది చాలామంది అంచనా. అదేసమయంలో దిల్లీ క్రికెట్ వర్గాల్లో కొత్త చర్చ ఒకటి మొదలైంది. ధోనీ తన రిటైర్మెంట్ తరువాత రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం జరుగుతోంది.

ధోనీ త్వరలో రాజకీయాల్లోకి వస్తున్నారని ఆయన బిజెపిలో చేరబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. కొన్నాళ్లుగా సాగుతున్న ఈ ప్రచారం ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో ఇండియా ఓటమి తర్వాత మరింత పెరిగింది. దీనికి కారణాలు కనిపిస్తున్నాయి. ధోని స్వరాష్ట్రం జార్ఖండ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. జార్ఖండ్ లో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఉంది. అయితే అక్కడి బీజేపీ ప్రభుత్వం పై తీవ్రమైన వ్యతిరేకత ఉందని... ఆ వ్యతిరేకత నుంచి గట్టెక్కాలంటే తిరుగులేని ప్రజాదరణ ఉన్న ఫేస్ ఒకటి కావాలన్నది బీజేపీ వ్యూహం. కానీ, జార్ఖండ్‌లో అలాంటి ఫేస్ బీజేపీకి లేదు. దీంతో బీజేపీ కన్ను ఇప్పుడు ధోనీపై పడినట్లుగా తెలుస్తోంది.

దీనిపై ఇప్పటికే ధోనీకి బీజేపీ నుంచి ప్రతిపాదన అందినట్లుగా తెలుస్తోంది. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత కొంత విరామం తీసుకొని ధోని రాజకీయ కార్యాచరణలో దిగుతారని, జార్ఖండ్ ఎన్నికల్లో ప్రచార బాధ్యతలు తీసుకుంటారని వినిపిస్తోంది. జార్ఖండ్ ఎన్నికల్లో ధోనీని బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా వాడుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. జార్ఖండ్‌తో పాటు భవిష్యత్తులో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ధోనీని వాడుకోవాలన్నది బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఆ రాష్ట్రంలో అన్నివర్గాల మధ్య మంచి ఆదరణ పొందిన ధోనీ అక్కడా ఉపయోగడపతారని బీజేపీ భావిస్తోందట. ఐపీఎల్ కారణంగా ధోనీని తమిళ ప్రజలు ఓన్ చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే.. ధోనీ కేవలం ప్రచారానికే పరిమితం అవుతారా లేదంటే అంతకుమించి రాజకీయాల్లో ముందుకెళ్తారా అన్నది చూడాలి. నాయకత్వ లక్షణాలు, తెలివైన నిర్ణయాలు తీసుకునే సత్తా ఉన్న ధోనీ కేవలం బీజేపీలో ప్రచారానికి మాత్రమే పరిమితం కారన్న వాదనా వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English