అసెంబ్లీలో ఈ రోజు జగన్ మార్కులు 0/100

అసెంబ్లీలో ఈ రోజు జగన్ మార్కులు 0/100

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజునే రసాభాస చోటుచేసుకుంది. పాలక, విపక్షాలు గతాన్ని తవ్వుకుంటూ ఒకరిపై ఒకరు ఘాటైన విమర్శలు చేసుకున్నారు. ప్రధానంగా నీటిపారుదల ప్రాజెక్టులు కేంద్రంగా సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబు మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఆరోపణలు, విమర్శలతో సభ దద్దరిల్లింది. ఈ క్రమంలో సీఎం జగన్ నదీ జలాల విషయంలో పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వెనకేసుకు వస్తూ విపక్షాల సూచనలను పెడచెవిన పెట్టారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నదీ జలాల విషయంలో ఎగువ రాష్ట్రాలను ఏమాత్రం అడ్డుకోలేమని, న్యాయపోరాటాల వల్ల కాలయాపనే తప్ప పరిష్కారం లభించదన్నట్లుగా ఆయన మాట్లాడడం.. పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సయోధ్యతోనే సాధించుకోవాలని చెప్పడం వివాదాస్పదమైంది.

జగన్ వ్యాఖ్యలు విమర్శలకు అవకాశమివ్వడానికి కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. న్యాయపోరాటాల వల్ల ప్రయోజనాలు రావనడం శుద్ధ తప్పని గతంలో నిరూపణైంది. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో అప్పట్లో వేసిన కేసుల ఫలితంగానే మహారాష్ట్ర ఏటా జులై 1 నుంచి అక్టోబరు 29 వరకు  నాలుగు నెలల పాటు గేట్లు ఎత్తక తప్పని పరిస్థితి ఏర్పడింది.

మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టుపై గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. జులై ఒకటి నుంచి అక్టోబరు 28 వరకు నాలుగు నెలలపాటు గేట్లు తెరిచి ఉంచాలని అప్పట్లో  ఆదేసించింది. బాబ్లీ ప్రాజెక్టుల గేట్లు ఎత్తడం ద్వారా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలలోని ఆయుకట్టుకు సాగునీరు అందుతుంది.  కోర్టుల్లో కనుక పోరాడకుంటే బాబ్లీ ప్రాజెక్టుతో మహారాష్ట్ర దిగువకు చుక్క నీరు కూడా రాకుండా చేసి ఉండేది.. తెలంగాణలో గోదావరి ఎండిపోయేది.

అంతేకాదు.. జగన్ చెబుతున్న ఈ పొరుగు రాష్ట్రాలతో సయోధ్య మార్గం కేవలం కేసీఆర్ వరకే పరిమితం కావడాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. ఏపీకి మరో పొరుగు రాష్ట్రమైన ఒడిశా కూడా పోలవరాన్ని అడ్డుకునేందుకు కేసులు వేసింది. కానీ... జగన్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో ఎందుకు ఈ సయోధ్య మార్గం అనుసరించడం లేదు? సమస్యను పరిష్కరించుకోవడం లేదు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

ఇదే కాళేశ్వరం ప్రాజెక్టుపై గతంలో జగన్ విమర్శలు చేయడం.. ఆ ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్‌కు నష్టం వాటిల్లుతుందని చెప్పడాన్ని కూడా తెలుగుదేశం నేతలు గుర్తు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కడితే.. ఏపీ తెలంగాణ రాష్ట్రాలు భారత్- పాక్ లా మారిపోతాయని జగన్ గతంలో అన్నారని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అంతేకాదు.. పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు వెళ్లిన విషయాన్నీ ప్రస్తావిస్తున్నారు.

అంతేకాదు...2016 మే 2వ తేదీన సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టు కోసం శంకుస్థాపన చేయగా, అదే ఏడాది మే 16, 17, 18 తేదీల్లో జగన్ కర్నూలులో జలదీక్ష పేరిట 3 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టారు. ఆ సమయంలో జగన్ కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏపీకి అన్యాయం చేస్తున్నారంటూ కేసీఆర్‌పై మండిపడ్డారు కూడా. తెలంగాణ ప్రాజెక్టుల వల్ల ఏపీ, తెలంగాణలు ఇండియా, పాకిస్థాన్ అయిపోతాయని.. తాగేందుకు నీళ్లు లేకపోతే ఎలా బతకాలని ప్రశ్నించారు. భూపాలపల్లి థర్మల్ ప్రాజెక్ట్‌తో కలిపి గోదావరి జలాల ట్రిబ్యునల్ గతంలో ఏపీకి 1480 టీఎంసీలను కేటాయించగా, అందులో 954 టీఎంసీల నీటిని తాము తీసుకుని, ఏపీకి 530 టీఎంసీల నీటిని ఇస్తానని కేసీఆర్ అనడం సమంజసం కాదని అన్నారు. ‘‘అది ఎవడబ్బ సొత్తు..’’ అంటూ అప్పట్లో జగన్ కేసీఆర్‌పై జగన్ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. కేసీఆర్ తనకు ఇష్టం వచ్చినట్లుగా ప్రాజెక్టులు కడుతున్నారని, వాటికి అనుగుణంగా లెక్కలు కడుతున్న కేసీఆర్ తీరు సరైందేనా అని ప్రశ్నించారు.  కృష్ణా, గోదావరి నదీ జలాల్లో ఎవరి వాటా ఎంత అనే విషయం తేలకుండా ఎగువన ఉన్నాం కదా అని మీరు ప్రాజెక్టులు కట్టుకుని మీ నీటి అవసరం తీరాక మాకు నీళ్లను పంపిస్తామనడం.. సరికాదన్నారు. కేసీఆర్‌ను ఆ సందర్భంలో ఆయన హిట్లర్‌తో పోల్చారు.

శ్రీశైలానికి నీరు రాకముందే తెలంగాణ ప్రభుత్వం ఏకంగా 120 టీఎంసీల నీటిని మహబూబ్‌నగర్ నుంచి దిండి, పాలమూరు, కల్వకుర్తి ప్రాజెక్టులతో తరలించుకుపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు అదే జగన్.. కేసీఆర్ శ్రీశైలానికి నీళ్లిస్తున్నారని చెప్పడం.. మూడేళ్ల కిందట తన జలదీక్ష సందర్భంగా సంధించిన ప్రశ్నలన్నిటినీ మర్చిపోవడం విమర్శలకు తావిస్తోంది.

పొరుగు రాష్ట్రాలతో సయోధ్యను ఎవరూ తప్పుపట్టకపోయినా ఆ మైత్రి ముసుగులో వారు ప్రయోజనాలు పొంది ఆంధ్రప్రదేశ్‌కు నష్టం కలిగించకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. జగన్ ఈ రోజు అసెంబ్లీ చేసిన వ్యాఖ్యలు, తన విధానాన్ని బయటపెట్టుకోవడాన్ని చూసిన నీటిపారుదల రంగ నిపుణులు సైతం ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

మొత్తంగా జగన్‌ను రాష్ట్ర ప్రయోజనాలు పట్టని సీఎంగా టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అదేసమయంలో జలవనరుల నిపుణులు.. గోదావరి, కృష్ణా ఆయకట్టు రైతులు కూడా అసెంబ్లీలో ఈ రోజు జగన్ వైఖరికి సున్నా మార్కులేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English