కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ దారిద్ర్యం

 కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ దారిద్ర్యం

రాహుల్ గాంధీ అస్త్ర సన్యాసంతో కాంగ్రెస్ పార్టీ మరోసారి సంక్షోభంలో పడింది. ఎన్నికల రాజకీయాల్లో సత్తా చూపలేకపోవడం, ప్రజల్లో ఆదరణ కోల్పోవడమే కాదు... పార్టీలో నాయకులు లేకపోవడం కూడా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అతి పెద్ద సమస్యగా మారింది. సుదీర్ఘ కాలం సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా ఉండడం.. ఆమె తరువాత కుమారుడు రాహుల్ గాంధీ కూడా పార్టీ పగ్గాలు చేపట్టడంతో పార్టీలోని మిగతా నేతలంతా ఎవరికి అప్పగించిన పనులు వారు చూసుకోవడానికే పరిమితయ్యారు. సోనియా, రాహుల్‌కు విధేయులుగా ఉన్నవారు పార్టీలో కీలకంగా వ్యవహరించేవారు. అంతేకానీ.. పార్టీని నడిపించే స్థాయి నాయకులు మాత్రం ఎవరూ తయారు కాలేదు. ఉన్న కొద్దిమందీ రకరకాల కారణాలతో తెరమరుగవడం.. ప్రభ కోల్పోవడంతో ఇప్పడు రాహుల్ స్థానంలో పార్టీ అధ్యక్ష స్థానంలో ఎవరిని కూర్చోబెట్టాలన్నా సరైన పర్సన్ కనిపించడం లేదట.

ఒకటిన్నర శతాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్..  స్వాతంత్ర్య ఉద్యమాన్ని నడిపించడంలో వందలాది  మంది కాంగ్రెస్ నాయకులు కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత కూడా స్వతంత్ర భారతావని.. దేశాన్ని నడిపించడంలో, వివిధ రాష్ట్రాల్లో పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించడంలో ఎంతోమంది నాయకులు ముందు నిలిచారు. కానీ, ఇప్పుడు ఆ పార్టీలో నాయకత్వ కొరత స్పష్టంగా కనిపిస్తోంది.

పార్టీలో సోనియా కంటే సీనియర్లు, రాహుల్ కంటే చురుకైనవారు, మన్మోహన్ సింగ్‌కు సాటి రాగల మేధావులు ఇప్పటికీ ఉన్నారు. కానీ, వారిలో పార్టీకి విధేయులు కానివారు... ఇప్పటికే అగ్రనాయకత్వంతో తొక్కివేయబడినవారు కొందరున్నారు. మరికొందరు స్వయంకృతాపరాధాలతో ఫేడవుటయ్యారు. ఇంకొందరు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి సూటయ్యే నాయకుడే కరవయ్యారు.

కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా కనిపించే, వినిపించే పాత్రలను చూస్తే సోనియా, రాహుల్, మన్మోహన్, ప్రణబ్ ముఖర్జీ, దిగ్విజయ్ సింగ్, కమల్ నాథ్, అశోక్ గహ్లోత్, శశి థరూర్, చిదంబరం వంటివారు ప్రధానంగా గుర్తుకొస్తారు. వీరిలో మంచి నాయకులుగా నిరూపించుకున్నవారు, నాయకత్వ పటిమ ఉన్నవారు ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి సరిపోయేవారు మాత్రం నూటికి నూరు శాతం లేరు.

సోనియా గాంధీ:
రాజీవ్ మరణం తరువాత ప్రధాని పీఠంపై కూర్చునేందుకు సిద్ధమై ఇంటాబయటా వ్యతిరేకత రావడంతో ప్రధాని పదవిని వదులుకుని త్యాగశీలి ట్యాగ్ తగిలించుకున్న నేత. కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ కాలం అధ్యక్షురాలిగా పనిచేసి పార్టీని విజయ పథంలో నడిపించారు. ప్రధాని పదవి చేపట్టకపోయినా మన్మోహన్ సింగ్‌ను రెండు పర్యాయాలు ప్రధానిని చేసి అంతా తానై నడిపించిన నేత. కానీ.. ఏడాదిన్నర కిందటే పార్టీ పగ్గాలు కుమారుడు రాహుల్‌కు అప్పగించడంతో ఇప్పుడు మరోసారి ఆమె పార్టీ పగ్గాలు చేపట్టే పరిస్థితి లేదు.

రాహుల్ గాంధీ:
వారసత్వం తప్ప జవసత్వం లేదని ఇప్పటికే ముద్ర పడిపోయింది. పైగా... వరుస పరాజయాలతో పార్టీ పరిస్థితి రోజురోజుకీ క్షీణించడంతో పార్టీ పగ్గాలు వదిలేసి రథం నుంచి ఇప్పటికే కిందకు దూకేశారు. పార్టీ నేతలు అరిచి గగ్గోలు పెట్టినా కూడా ఆయన తన రాజీనామా లేఖను వెనక్కు తీసుకోలేదు. రాహుల్ రాజీనామాతోనే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

మన్మోహన్ సింగ్:
రెండు సార్లు దేశ ప్రధానిగా పనిచేశారు. గొప్ప ఆర్థికవేత్తగా, సంస్కరణవాదిగా పేరున్నా సొంత నిర్ణయాలు తీసుకోలేని.. రాజకీయం చేయలేని నేతని దేశానికి ఇప్పటికే తెలుసు. రెండు సార్లు ప్రధానిగా పనిచేసినా నడిపించిందంతా సోనియానే. మన్మోహన్ మేధావే కానీ నాయకుడు కారు. అసలే కాంగ్రెస్ పార్టీ.. ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ.. అలాంటి పార్టీ పగ్గాలు ఈ మెతక మనిషికి అప్పగిస్తే చాలా కష్టమే. కానీ, వేరే అవకాశమేమీ లేకపోతే మన్మోహన్ ఈసారి ‘ది యాక్సిడెంటల్ పార్టీ ప్రెసిడెంట్’ అయ్యే అవకాశముంది.

ప్రణబ్ ముఖర్జీ:
మేధస్సు, నాయకత్వ లక్షణాలు, రాజకీయం, చాణక్యం అన్నీ తెలిసిన నేత ప్రణబ్ ముఖర్జీ. కానీ.. ఇప్పటికే దేశానికి రాష్ట్రపతిగా పనిచేశారు. దేశ ప్రథమ పౌరుడిగా పనిచేసిన తరువాత పార్టీ అధ్యక్షుడిగా ఏమాత్రం ఉండలేరు. అంతేకాదు.. సోనియాకు కూడా ప్రణబ్‌పై అంతగా మొగ్గు లేదు. ఆయన ఆరెస్సెస్ కార్యక్రమాలకు వెళ్లడం వంటివి మైనస్‌గా మారాయి. పైగా పార్టీతోనూ ప్రణబ్ ఇప్పుడు ఎలాంటి సంబంధాలు నెరపడం లేదు. కేవలం ఒక గొప్ప నాయకుడిగా ఆయన పేరు ప్రస్తావించడానికి మాత్రమే ప్రణబ్ గురించి మాట్లాడుకోవాలి.

చిదంబరం:
ఈయనకు మేధస్సు, నాయకత్వ లక్షణాలు రెండూ ఉన్నాయి. కానీ, వీటితో పాటు ఆర్థిక నేరాల ఆరోపణలు.. మరెన్నో వివాదాలు ఉన్నాయి. పైగా చాలాకాలంగా పార్టీకి పనికొచ్చేలా ఏమాత్రం వ్యవహరించడం లేదు. రాహుల్ ఎప్పుడు పక్కకు తప్పుకుంటారా అని చూసే వ్యక్తుల్లో చిదంబరం ముందు వరుసలో ఉండే వ్యక్తని సోనియాకు తెలుసు. కాబట్టి ఈయన్ను అధ్యక్షుడిని చేస్తే రాహుల్ భవిష్యత్తుకు పూర్తిగా శుభం కార్డు పడుతుందన్నది సోనియా భయం.

శశి థరూర్:
కాంగ్రెస్ పార్టీలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ ఛరిష్మా ఉన్న నేతల్లో శశి థరూర్ ఒకరు. కానీ.. ప్లేబాయ్ ఇమేజ్.. నాన్ సీరియస్ పర్సన్ అన్న ఇమేజ్‌తో పాటు అనేక వివాదాలు కూడా ఆయనకు మైనస్. కేరళకు చెందిన ఈయన్ను పార్టీ అధ్యక్షుడిని చేస్తే ఉత్తరాదిలో పార్టీ పరిస్థితులను ఎంతవరకు మార్చగలరన్నది ప్రశ్న.

కమల్ నాథ్:
నిజానికి పార్టీ అధ్యక్ష పదవికి కమల్ నాథ్ కూడా మంచి ఆప్షన్ అని చెప్పుకోవాలి. కానీ... చచ్చీచెడీ 15 ఏళ్ల తరువాత అధికారంలోకి వచ్చిన మధ్యప్రదేశ్‌కు ఆయన సీఎంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే అక్కడ పరిస్థితులను గాడిలో పెడుతూ బీజేపీ మళ్లీ అధికారం లాక్కోకుండా నిత్యం కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన్ను కదిపితే చేజేతులా నాశనం చేసుకున్నట్లే.

అశోక్ గెహ్లోత్:
అధిష్ఠానం దృష్టిలో ఉన్న పేర్లలో గహ్లోత్ పేరు కూడా ఒకటి. సీనియర్ నాయకుడు, ట్రబుల్ షూటర్ కూడా. అయితే.. ప్రస్తుతం రాజస్థాన్ సీఎంగా ఉన్నారు. గత ఏడాది కర్నాటకలో తక్కువ సీట్లు గెలిచినా కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంచడానికి అన్ని ప్రయత్నాలు చేసిన నేత.. బీజేపీ కర్నాటకలో అధికారం హస్తగతం కాకుండా పక్కా వ్యూహాలతో అడ్డుకున్నారు. రాజస్తాన్లో పార్టీలో ఎన్నో వర్గ విభేదాలున్నా కూడా అన్నిటినీ నెగ్గుతూ సీఎంగా సాగుతున్నారు. సోనియా, రాహుల్ ఇద్దరి వద్దా మంచి ఇమేజ్ ఉన్న నేత. అయితే.. రాజస్థాన్‌లో సచిన్ పైలట్‌కు సీఎం పదవి ఇచ్చి గహ్లోత్‌ను అధ్యక్ష స్థానంలోకి తెస్తారా.. లేదా అన్నది చూడాలి.

దిగ్విజయ్ సింగ్:
పార్టీ సీనియర్ నేతల్లో దిగ్విజయ్ కూడా ఒకరు. మధ్యప్రదేశ్‌కు చాలాకాలం సీఎంగా పనిచేసి మంచి అడ్మినిస్ట్రేటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగున్నప్పుడు రాష్ట్రాల వ్యవహారాలను చూస్తూ కూడా సక్సెస్ ఫుల్ నేతగా పేరు తెచ్చుకున్నారు. కానీ, పార్టీకి కష్టాలు వచ్చిన తరువాత మాత్రం ఆయన మ్యాజిక్కులేవీ పనిచేయడం లేదు. పైగా వ్యక్తిగత జీవితమూ వివాదాలమయమైంది. దిగ్విజయ్‌ను చూసినవారంతా ‘ముసలాడే కానీ మహానుభావుడు’ అంటూ సెటైర్లు వేసే పరిస్థితి.

అందుకే మోతీలాల్ వోరా
...ఈ పరిస్థితుల్లో తాత్కాలిక అధ్యక్షుడిగా మోతీలాల్ వోరాను నియమించారు. వోరా సీనియర్ నేతే అయినప్పటికీ ఫేడవుట్ అయిపోయిన వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లేమిని ఎదుర్కొంటుందనడానికి కచ్చితమైన ఉదాహరణ వోరా నియామకంగా చెప్పొచ్చు.

ఇంతకాలం జ్యోతిరాదిత్య సింథియా, సచిన్ పైలట్ వంటివారు యువనేతలుగా.. కాంగ్రెస్ పార్టీకి ఆశాకిరణాలుగా చాలామంది భావించేవారు. వారి ప్రభావమూ ఏమీ లేదని మొన్నటి ఎన్నికల్లో తేలిపోయింది. అలాగే... సోనియా కుమార్తె ప్రియాంక తన నాయనమ్మ ఇందిరాగాంధీ ప్రతిరూపమని.. ఆమె వస్తే పార్టీకి తిరుగుండదని అంటుండేవారు. మొన్నటి ఎన్నికలతో ఆ భ్రమలూ తొలగిపోయాయి. దీంతో కాంగ్రెస్ పార్టీలో దుర్భిణి వేసి వెతికినా నాయకులన్నవారే కనిపించడం లేదు.

బీజేపీలో నాయకులే నాయకులు
కాంగ్రెస్ పార్టీకి భిన్నంగా బీజేపీ నాయకులతో కళకళలాడుతోంది. నాయకత్వ లక్షణాలు, నిర్వహణా సామర్థ్యాలు పుష్కలంగా ఉన్న నేతలు ఆ పార్టీలో చాలామంది కనిపిస్తున్నారు. మోదీ, షా ద్వయం గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. వీరికి తోడు రాంమాధవ్ వంటి చాణక్యుడు... జేపీ నడ్డా వంటి సైలెంట్ కిల్లర్లు, సునీల్ దియోధర్ వంటి కొత్త నాయకత్వం అడుగడుగునా కనిపిస్తోంది. దీంతో భవిష్యత్తులో బీజేపీకి ఎలాంటి నాయకత్వ సమస్యా లేదని అర్థమవుతోంది. కానీ.. కాంగ్రెస్ మాత్రం నాయకత్వ కొరతతో కొట్టుమిట్టాడుతోంది.

అయితే... కుటుంబం కాకుంటే ఎవరో ఒక డమ్మీ అనే తమకు అలవాటైన పద్ధతిలో ఇప్పుడు కూడా ఒక నాయకుడిని పార్టీకి అద్యక్షుడిని చేయడం కాంగ్రెస్‌కు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. కానీ, ఆ విధేయ నాయకుడు ఎవరన్నదే తేలాల్సి ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English