బిగ్ న్యూస్: గ్రీన్‌కార్డు కోటా ఎత్తివేత‌

బిగ్ న్యూస్: గ్రీన్‌కార్డు కోటా ఎత్తివేత‌

అమెరికాలోని ఎన్నారైల‌కు తీపిక‌బురు. సుదీర్ఘ‌కాల నిరీక్ష‌ణ‌కు తెర‌ప‌డింది. కీలకమైన ‘గ్రీన్‌కార్డు’ జారీపై విధించిన పరిమితి రద్దుకు సంబంధించిన బిల్లుపై అమెరికన్‌ కాంగ్రెస్‌లో ఓటింగ్ జరిగి ఈ బిల్లుకు ఆమోదం ద‌క్కింది. గ్రీన్ కార్డు కేటాయింపుల‌లో ప్ర‌స్తుత 7 శాతాన్ని 15 శాతానికి పెంచేందుకు వీలు కల్పించే ఈ బిల్లుకు అమెరికా కాంగ్రెస్ బుధవారం ఆమోదించింది. దీంతో వేలాది భారతీయ ఐటీరంగ నిపుణులకు ప్రయోజనం చేకూరనుంది.

గ‌త ఏడాది నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం హెచ్‌ 1బీ ఉద్యోగులు 151 ఏళ్లుగా అమెరికాలో గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్నట్లు తేలింది. ప్రస్తుతం ఉద్యోగ ఆధారిత వలసదారులకు ఏడాదికి 140000 గ్రీన్‌ కార్డులను ఇస్తున్నారు. మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత అనే సూత్రాన్ని పాటిస్తున్నారు. అమెరికా ఇచ్చే గ్రీన్‌ కార్డులు ఒక దేశానికి 7 శాతం కంటే మించకూడదని ప్రస్తుత చట్టాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అమెరికా ఏటా 1,40,000 గ్రీన్‌కార్డులను జారీ చేస్తోంది. దేశ జనాభాతో సంబంధం లేకుండా ప్రతి దేశానికి 7 శాతం కోటా పరిమితి అమలు చేయ‌డం వ‌ల్ల భారత్, చైనాలకు చెందినవారికి నష్టం కలుగుతోంది. భారత్‌- చైనా లాంటి దేశాల పోస్ట్‌ గ్రాడ్యూయేట్లు గ్రీన్‌కార్డు పొందాలంటే కనీసం 50 ఏళ్లు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. తక్కువ జనాభా కలిగిన దేశాల వాళ్లకు మాత్రం కొన్నేళ్లలోనే శాశ్వత నివాస అనుమతి లభిస్తోంది.

దీంతో ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డుల జారీలో దేశాలకు కేటాయించే 7 శాతం కోటా పరిమితిని ఎత్తివేసేందుకు ఉద్దేశించిన ఫెయిర్‌నెస్ ఫర్ హై స్కిల్డ్ ఇమ్మిగ్రెంట్స్ యాక్ట్‌ను రిపబ్లిక్ సభ్యుడు మైక్ లీ, డెమోక్రటిక్ సభ్యులు కమలా హ్యారిస్ సెనేట్‌లో ప్రవేశపెట్టారు. ఇలాంటిదే మరో బిల్లును కాంగ్రెస్ సభ్యులు జో లోఫ్‌గ్రెన్, కెన్ బక్‌లు ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. సెనెట్‌లో హెచ్ఆర్‌ 1044 బిల్లు ఆమోదం పొందిన‌ సందర్భంగా భారతీయ అమెరికన్‌ కమలా హ్యారీస్‌ మాట్లాడుతూ మా దేశం వలసదారులది. భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదంతో ఉద్యోగార్థులు, విద్యార్థులు అమెరికా వస్తున్నారు అని అన్నారు.

ఈ బిల్లుపై తాజాగా జ‌రిగిన ఓటింగ్‌లో 435 మంది సభ్యులున్న ప్రతినిధుల సభలో ఈ బిల్లును 365 మంది సమర్థించగా.. 65 మంది వ్యతిరేకించారు. 112 మంది కాంగ్రెస్ సభ్యుల మద్దతుతో ఇదే తరహా బిల్లును జో లాఫెన్, కెన్ బక్ ప్రతిపాదించారు. గూగుల్, వాల్ మార్ట్ వంటి సంస్థలు కూడా ఈ బిల్లుకు సుముఖత వ్యక్తం చేశాయి. దీంతో బిల్లు ఆమోదం పొందింది. కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ, వాషింగ్టన్ లోని సీటెల్ ఏరియా, న్యూయార్క్ లోని ట్రై స్టేట్ ఏరియా, న్యూజెర్సీ, కనెక్టికట్ వంటి ప్రాంతాలవారంతా ఈ బిల్లు పట్ల హర్షం వ్యక్తం చేశారు. హిందూ అమెరికన్ ఫౌండేషన్ పూర్తి సంతృప్తిని ప్రకటించింది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English