రైలు ప్రయాణికులకు శుభవార్త

రైలు ప్రయాణికులకు శుభవార్త

రద్దీకి తగ్గట్లు రైళ్లను నడపడంలో భారతీయ రైల్వేది ఎప్పుడూ వెనుకబాటే. ఏ ట్రైన్ చూసినా బుకింగ్స్ ఓపెన్ అయిన రెండు రోజులకే బెర్తులు ఫుల్ అయిపోతాయి. వెయిటింగ్ లిస్ట్ పడిపోతుంది. రైళ్ల సంఖ్య పెంచరు.. ఉన్న రైళ్లలో కోచ్‌లనూ పెంచలేరు. ఐతే టెక్నాలజీలో మార్పు వల్ల ఇప్పుడు అదనపు రైళ్లు వేయకుండానే, రైళ్ల పొడవు పెంచకుండానే అదనపు బెర్తులు అందుబాటులోకి వస్తుండటం విశేషం.

దేశవ్యాప్తంగా రైళ్లలో రోజుకు అదనంగా నాలుగు లక్షల బెర్తులు అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు రైళ్లలో లైట్లు, ఏసీలు పనిచేయడానికి పవర్‌ కార్లు ఉపయోగిస్తున్నారు. త్వరలో అందుబాటులోకి వచ్చే కొత్త టెక్నాలజీ వల్ల వీటి అవసరం ఉండదు. దీంతో వాటి స్థానంలో అదనపు కోచ్‌లను ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల ఇటు ప్రయాణికులకు అదనపు బెర్తులు అందుబాటులోకి వస్తాయి. అదే సమయంలో ఈ టెక్నాలజీ వల్ల రైల్వేకి విద్యుత్‌ బిల్లు మిగులు కారణంగా ప్రయోజనం కలగనుంది.

అక్టోబర్‌ నుంచి ఈ టెక్నాలజీ అమల్లోకి వచ్చే అవకాశం ఉందని రైల్వే శాఖ చెబుతోంది. ప్రస్తుతం ప్రతి రైలులోనూ రెండు లేదా రెండు పవర్‌ కార్స్‌ చివర్లో ఉంటాయి. అవి రైలుకు కావాల్సిన విద్యుత్‌ అందిస్తాయి. త్వరలో హెడ్‌ ఆన్‌ జనరేషన్‌ అనే కొత్త టెక్నాలజీ ద్వారా రైలు ఇంజిన్‌ నుంచే విద్యుత్‌ సరఫరా చేయబోతున్నారు. ఇప్పటికే పలు దేశాల్లో ఈ వ్యవస్థ అందుబాటులో ఉంది. అక్టోబర్‌ నాటికి 5వేల రైళ్లలో ఈ కొత్త సాంకేతికతను తీసుకురాన్నున్నారు. దీనివల్ల అదనపు కోచ్‌ల ఏర్పాటుకు వీలు కలుగుతుంది. రైల్వేకి ఏటా రూ.6 వేల కోట్లు ఇంధన బిల్లుల రూపంలో మిగలనుందని సమాచారం.

 కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తే డీజిల్ వినియోగం గణనీయంగా తగ్గుతుంది కాబట్టి పర్యావరణానికి మంచి జరుగుతుంది. ఐతే టెక్నాలజీ మారాక కూడా అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం కోసం ఒక పవర్ కార్ మాత్రం రైళ్లలో కొనసాగిస్తారు. రైలు పొడవు పెంచే అవసరం లేకుండానే తొలగించిన పవర్‌ కార్‌ స్థానంలో ఒక కోచ్‌ను ఏర్పాటు చేయడం వల్ల కొత్తగా రోజుకు 4లక్షల బెర్తులు అందుబాటులోకి రానున్నాయి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English