అత్యంత ఖరీదైన విడాకుల కేసు.. భారణం ఎంతంటే?

సంచలనంగా మారిన దుబాయ్ రాజు ఆరో భార్య విడాకుల ఎపిసోడ్ లో ఇవ్వాల్సిన భరణం లెక్కను తాజాగా బ్రిటన్ హైకోర్టు తీర్పును ఇచ్చింది. ఈ వ్యవహారంలో ఆయనకు ఎదురుదెబ్బ తప్పలేదు. మాజీ భార్య కమ్ జోర్డాన్ మాజీ రాజ కుమార్తె 47 ఏళ్ల హయా బింట్ అల్ హుస్సేన్ తో విడాకుల సెటిల్మెంట్ వ్యవహారం అత్యంత ఖరీదైనదిగా చెబుతున్నారు. దుబాయ్ రాజు షేక్ మహ్మమద్ బిన్ రషీద్ అల్ మక్తూం తన మాజీ భార్యకు.. ఆమె పిల్లలకు కలిపి మొత్తంగా రూ.5555 కోట్లు ఇవ్వాలని తేల్చటమే కాదు.. దానికి గడువుగా మూడు నెలల కాల వ్యవధిని విధించారు.

బ్రిటిష్ చరిత్రలో అత్యంత ఖరీదైన విడాకుల కేసుగా దీన్ని పలువురు అభివర్ణిస్తున్నారు. కోర్టు పేర్కొన్న మొత్తంలో రూ.2521 కోట్లను మూడు నెలల్లోపు మాజీ భార్యకు చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని పిల్లలకు ఇవ్వాల్సి ఉంటుందని.. అందుకు తండ్రితో వారికున్న రిలేషన్ ఆధారంగా ఉంటుందని కోర్టు పేర్కొంది. మాజీ భార్య.. పిల్లలకు మైనార్టీ తీరే వరకు రక్షణ వ్యయం కింద ఏటా రూ.110 కోట్లు.. పిల్లల చదువుకు మరికొంత మొత్తాన్ని ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

వీరిద్దరికి ఇద్దరు ఆడపిల్లలుకాగా.. వారిలో ఒకరికి పద్నాలుగేళ్లు.. మరొకరికి తొమ్మిదేళ్లు. రాజకుమారి హయాకు.. ఆమె పిల్లలకు బయటి శక్తుల కంటే కూడా ఆమె మాజీ భర్త మహమ్మద్ నుంచే ఎక్కువ ముప్పు ఉన్నందున.. తగినంత రక్షణ అవసరమని అభిప్రాయపడ్డారు. ఇంతకూ వీరిద్దరి మధ్య విభేదాలకు కారణం.. రాకుమారి హయాకు ఆమె అంగరక్షకులతో ఒకరితో సన్నిహిత సంబంధం ఉందన్న విషయాన్ని భర్త గుర్తించటమేనని చెబుతారు. అయితే.. ఈ వాదనను ఖండించే వారు లేకపోలేదు. దీంతో.. తనకు ఇబ్బందులు తప్పవన్న విషయాన్ని గుర్తించిన హయా.. దుబాయ్ ను వదిలేసి బ్రిటన్  కు చేరుకున్నారు. అనంతరం విడాకులకు అప్లై చేసి.. తన పిల్లలు తన మాజీ భర్త వద్ద ఉన్నారని.. వారిని తనకు అప్పగించాలని పేర్కొన్నారు.

డెబ్బై ప్లస్ వయసులో ఉన్న షేక్ మహమ్మద్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు ఉపాధ్యక్షుడు మాత్రమే కాదు.. ప్రధానిగా వ్యవహరిస్తున్నారు. గుర్రాల పెంపకందారుగా మంచి పేరున్న ఆయనకు.. బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2తో కూడా చక్కటి సంబంధాలు ఉన్నట్లు చెబుతారు. ఈ హైప్రొఫైల్ విడాకుల కేసు కోర్టులో నడుస్తున్న వేళ.. పెగాసస్ స్పై వేర్ సాయంతో తన ఫోన్ తో పాటు తన న్యాయవాది ఫోన్ ను హ్యాక్ చేసినట్లుగా హయా పేర్కొనటం.. దాన్ని కోర్టు నిర్దారించింది. తనపై వచ్చిన ఆరోపణల్ని షేక్ మహమ్మద్ ఖండించారు. ఏమైనా.. వీరిద్దరి విడాకుల వ్యవహారంలో రానున్న రోజుల్లో మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉందంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.