ఆర్కే సవాల్... లోకేశ్ సై అంటే కథ కంచికే

ఆర్కే సవాల్... లోకేశ్ సై అంటే కథ కంచికే

గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చాలా డేరింగేనని చెప్పాలి. తాజా ఎన్నికల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానే కాకుండా ఓ సీఎం కుమారుడిగా తనపై నిలబడ్డ నారా లోకేశ్ ను ఓడించిన ఆర్కే... ఆ తర్వాత కూడా తనదైన శైలిలో టీడీపీని టార్గెట్ చేస్తున్నారు. అయితే ఆర్కేకు కౌంటర్లకు సరైన సమాధానాలు ఇచ్చే విషయంలో టీడీపీ కాస్తంత వెనుకబడే ఉందన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో టీడీపీకి, ప్రత్యేకించి నారా లోకేశ్ కు ఆర్కే ఓ బంపర్ ఆపర్ ఇచ్చారు. తనపై టీడీపీ నేతలు చేసిన ఏ ఒక్క ఆరోపణ అయినా నిజమని తేలిస్తే... తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆర్కే సంచలన కామెంట్ చేశారు.

ఎమ్మెల్యేగా ఉన్నా తనదైన శైలి సాధారణ జీవితానికే ప్రాధాన్యం ఇస్తున్న మంగళగిరి ప్రజలకు ఎన్నో సరికొత్త సంక్షేమ కార్యక్రమాలను రుచి చూపించారు. ఈ కారణంగానే మంగళగిరిలో ఆళ్లను ఢీకొట్టడం అంత ఈజీ కాదన్న భావనను కూడా ఆయన తన ప్రత్యర్థులకు పంపారు. తాజా ఎన్నికల్లో మంగళగిరిలో తాను లోకేశ్ ను ఓడించడం, రాష్ట్రంలో తన పార్టీ వైసీపీ బంపర్ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో... రాజధాని పరిధిలో టీడీపీ హయాంలో జరిగిన అక్రమాలపై తనదైన శైలిలో పోరాటాన్ని పెంచేసిన ఆళ్ల... చంద్రబాబు, లోకేశ్ లతో పాటు టీడీపీ నేతలపైనా విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో ఉండవల్లి ప్రజావేదిక కూల్చివేత, చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ సహా కరకట్ట వెంట వెలసిన అన్ని నిర్మాణాలకు నోటీసులు వెళ్లడంతో ఆర్కే మరింత స్పీడు పెంచారు.

ఈ క్రమంలో ఆళ్లను నిలువరించేదెలాగన్న కోణంలో ఆలోచన చేస్తున్న టీడీపీ నేతలు... ఓ మోస్తరు ఆరోపణలు చేసి ఆర్కేకు ఝలక్ ఇస్తున్నారు. ఈ ఆరోపణలపై సైలెంట్ గా ఉంటే అవే నిజమని జనం నమ్ముతారని ఆర్కే భయపడ్డారో, ఏమో తెలియదు గానీ... తనపై ఆరోపణలు చేసే ఆలోచన కూడా టీడీపీ నేతలకు రాకూడదన్న భావనతో ఆర్కే ఓ సంచలన సవాల్ ను సంధించారు. తనపై ఇప్పటిదాకా టీడీపీ నేతలు చేసిన ఆరోపణలన్నింటిలో ఏ ఒక్క దానినైనా నిరూపిస్తే... తాను రాజకీయాల్లో నుంచి పూర్తిగా తప్పుకుంటానని ఆర్కే సవాల్ విసిరారు. అంటే... ఆర్కేపై వచ్చిన ఒక్క ఆరోపణనను నిరూపించినా... ఆయనను పూర్తిగా రాజకీయాల్లో నుంచి తప్పించేయొచ్చు. మరి ఇంతటి బ్రహ్మాండమైన అవకాశాన్ని లోకేశ్ ఎలా ఉపయోగించుకుంటారన్న అంశంపై ఆసక్తికర చర్చ మొదలైపోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English