ముంబై మునిగిపోవ‌డం వెనుక‌..మోదీ క‌ల ఉందా?

ముంబై మునిగిపోవ‌డం వెనుక‌..మోదీ క‌ల ఉందా?

ముంబై గురించి ప్ర‌స్తుతం ప‌రిచ‌యం చేయాలంటే..కేవ‌లం భార‌త‌దేశ ఆర్థిక రాజ‌ధాని అని మాత్ర‌మే చెప్తే ఖ‌చ్చితంగా ముంబై గురించి స్ప‌ష్టంగా తెలియ‌న‌ట్లే. ఎందుకంటే...ఈ వ‌ర్షాక‌లం ప్రారంభ‌మైన నాటి నుంచి...ముంబై ప్ర‌జ‌లు వ‌ర‌ద నీటిలో మునుగుతూ..తేలుతూ త‌మ జీవితాన్ని సాగిస్తున్నారు. ఆ న‌గ‌రంలో భారీ వర్షాలతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై.. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనదారుల ఇక్కట్లు సరేసరి! సుమారు వారం రోజుల క్రితమే వర్షాలు వరదలతో సిటీ సతమతమయింది. ఇప్పుడిప్పుడే తేరుకొంటోందని అనుకుంటే తిరిగి అదే పరిస్థితి పునరావృతమయింది. అయితే, ఇలా జ‌ర‌గ‌డం వెనుక‌...ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ క‌ల పాత్ర కూడా ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఔను. విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉన్నా...ప్ర‌ధాని మోదీ క‌ల‌కు ముంబైలో భారీ వ‌ర‌ద‌లు, వ‌ర్షాల‌కు లింక్ ఉందంటున్నారు. ముంబై స‌మీపంలోని తడి ప్రాంతాల్లోనూ, కోస్తా తీరా ప్రాంతాల్లోనూ పెరిగే చిన్న, చిన్న చెట్లు, పొదలు (మడలను) ఉన్నాయి. ముంబై నగరం ఏర్పడక ముందే కోస్తా తీరా ప్రాంతంలో చెట్లు, పొదలు విస్తారంగా పుట్టుకొచ్చాయి. వర్షాల బారి నుంచి సిటీని ఇవి కాపాడుకుంటూ వచ్చాయి. వీటి వల్ల నీరు రోడ్లపైకి ప్రవహించకుండా ఉండేది. వీటి పరిరక్షణ కోసం కోస్టల్ రెగ్యులేషన్ చట్టం, మహారాష్ట్ర ప్రయివేట్ ఫారెస్ట్ యాక్ట్ , వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వంటివి ఉన్నాయి. అయితే ఈ చట్టాల్లోని నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయి.  శతాబ్దాలుగా ముంబైని కాపాడుకుంటూ వస్తున్న వీటిని ఎప్పుడు పడితే అప్పుడు నరికివేస్తున్నారు. ‘ మడ‘ల నరికివేత సాగిపోతూ వచ్చింది. 1972-75 మధ్య కాలంలో మహారాష్ట్ర కోస్టల్ లైన్ లో దాదాపు 200 కి.మీ. మేర చెట్లు, చేమలు విస్తరించి ఉండేవి. కానీ 1997 నాటికి ఇవి 108 కి.మీ. కు తగ్గిపోయాయి.

మ‌డ వృక్షాల‌ను నిర్దాక్షిణ్యంగా నరికివేయడంలో ముంబై-అహ్మదాబాద్-బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టుది ప్ర‌ధాన పాత్ర‌. ఈ ప్రాజెక్టు కోసం ఇలా వీటిని నరికివేస్తున్న కారణంగా వర్షపు నీరు సిటీలోకి పోటెత్తుతోంది. ముంబై కార్పొరేషన్ అనాలోచిత చర్యల వల్ల పర్యావరణం కూడా దెబ్బ తింటోంది. బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టు కోసం మొత్తం 13. 36 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ చెట్లను తప్పనిసరిగానిర్మూలించవలసి వస్తోందని రాష్ట్ర శాసన మండలిలో ఇటీవల రవాణా శాఖ మంత్రి దివాకర్ రౌటే..శివసేన సభ్యుడొకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. అయితే ఇంతకూ రెట్టింపు హెక్టార్లలో మొక్కలు నాటాలన్నది ప్రభుత్వ ధ్యేయమన్నారు. హాలోఫైట్స్ అనే పొదలు నీటిలోని ఉప్పు శాతాన్ని తగ్గిస్తాయని, అలాగే చెట్లు కార్బన్ డై ఆక్సైడ్ ని పీల్చుకుంటూ పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడేవని, కానీ బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టు కోసం వీటిని నరికివేయడం దారుణమని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టుపై పెట్టిన దృష్టి వీటి నాశనానికి కారణమవుతోందని వీరు దుయ్యబడుతున్నారు. దేశంలోని మొద‌టి బుల్లెట్ ట్రైన్ త‌న హ‌యాంలోనే...రూపొందించ‌బ‌డాల‌ని భావిస్తున్న మోదీ క‌ల ఈ ర‌కంగా మ‌హాన‌గ‌రాన్ని వ‌ణికిస్తోంద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English