మోడీ సీరియ‌స్ అయ్యే నిర్ణ‌యాన్ని తీసుకున్న జ‌గ‌న్‌!

 మోడీ సీరియ‌స్ అయ్యే నిర్ణ‌యాన్ని తీసుకున్న జ‌గ‌న్‌!

సామాన్యుడి నుంచి స‌ర్కారు వ‌ర‌కు అంద‌రూ క్యాష్ లెస్ మంత్రాన్ని ప‌ఠించాలంటూ ప్ర‌ధాని మోడీ కోరుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఇందుకోసం ఆయ‌న భారీగానే చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల్ని త‌ప్ప‌నిస‌రిగా బ్యాంకు ఖాతాల్లోనే వేయాల‌ని ఆయ‌న కోరుకుంటున్నారు.ఇందులో భాగంగా తాను ప్ర‌ధాని అయిన తొలి ట‌ర్మ్ లోనే దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున బ్యాంకు అకౌంట్ల‌ను తెరిపించి.. ప‌థ‌కాల ల‌బ్థిని బ్యాంకు అకౌంట్లలో వేయ‌టం మొద‌లు పెట్టారు.

నిజానికి.. ఇలాంటి తీరుతో ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ప‌క్క‌దారి ప‌ట్ట‌కుండా ఉంటాయి. కానీ.. ఈ విష‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీరు భిన్నంగా ఉంద‌ని చెప్పాలి. న‌గ‌దు ర‌హితంగా ప‌థ‌కాల్ని అమ‌లు చేయాల్సిన స్థానే న‌గ‌దును నేరుగా ల‌బ్థిదారుల‌కు అందేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని జ‌గ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పాలి.

రైతు భ‌రోసా ప‌థ‌కం కింద వేలాది కోట్ల రూపాయిల్ని రైతు కుటుంబాల‌కు షెడ్యూల్ కంటే ముందుగా అమ‌లు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌.. తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. ప్ర‌భుత్వం ఇచ్చే రైతు భ‌రోసా మొత్తం న‌గ‌దు రూపంలో ల‌బ్థిదారుల‌కు నేరుగా ఇవ్వ‌నున్న‌ట్లు చెప్పారు. ప్ర‌తి రైతుకు రూ.12,500చొప్పున మొత్తాన్ని ల‌బ్థిదారుల బ్యాంకు అకౌంట్లో కాకుండా.. నేరుగా వారి చేతికే ఇవ్వ‌నున్న‌ట్లు చెబుతున్నారు.

అదే జ‌రిగితే న‌గ‌దు ర‌హిత విధానానికి భారీగా గండి ప‌డిన‌ట్లుగా చెప్పాలి. ఏపీలో అమ‌లు చేయ‌నున్న రైతు భ‌రోసా ప‌థ‌కంలో ల‌బ్థిదారులు 54 ల‌క్ష‌ల మంది. ఇంత మందికి నేరుగా న‌గ‌దు అంద‌జేయ‌టంలో లోటుపాట్ల‌కు ఎక్కువ అవ‌కాశం ఉంటుంది. బ్యాంకు అకౌంట్లో డ‌బ్బులు వేయ‌టం కంటే.. చేతికి నేరుగా డ‌బ్బులు ఇవ్వ‌టం ద్వారా.. మేం మీకు డ‌బ్బులిస్తున్నామ‌న్న భావ‌న‌కు వీలుంటుంది.

ఇలాంటివి పొలిటిక‌ల్ మైలేజీకి కీల‌క‌మ‌వుతాయ‌న్న భావ‌న‌తోనే క్యాష్ లెస్ విధానానికి భిన్నమైన ప‌ద్ద‌తిని ఫాలో కావాల‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. అయితే.. ఈ విధానాన్ని ప్ర‌ధాని మోడీ ఏ మాత్రం మెచ్చ‌ర‌ని.. ఓప‌క్క క్యాష్ లెస్ సంస్కృతిని దేశ ప్ర‌జ‌ల్లో పెంచేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్న వేళ‌.. ప‌థ‌కాల మొత్తాన్ని న‌గ‌దు రూపంలో నేరుగా ల‌బ్థిదారుల‌కు చేర్చే విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీరుపై మోడీ స‌ర్కారు  సీరియ‌స్ కావ‌టం ఖాయ‌మంటున్నారు. రాజ‌కీయ ల‌బ్థిలో భాగంగా మోడీకి న‌చ్చ‌ని ప‌ని చేస్తున్న జ‌గ‌న్ తీరుపై ఆయ‌న ఎలా రియాక్ట్ అవుతారన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English