ఫారిన్ టూరు.. సీఎం సీటుకు ఎసరు

ఫారిన్ టూరు.. సీఎం సీటుకు ఎసరు

కర్ణాటక రాజకీయం ఇప్పుడు దేశమంతా కాక పుట్టిస్తోంది. 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేయడంతో అక్కడి కుమారస్వామి ప్రభుత్వం ఇప్పుడు కష్టాల్లో పడింది.  కర్ణాటక అసెంబ్లీలో మొత్తం స్థానాలు 224. బీజేపీకి 105 మంది, కాంగ్రెస్ పార్టీకి 78 మంది, జేడీఎస్ కు 37 మంది సభ్యులు, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. సాధారణ మెజార్టీకి 113 మంది సభ్యుల మద్దతు అవసరం. రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు పలికినా.. లేదంటే కుమారస్వామి బల నిరూపణ సమయంలో అసెంబ్లీకి హాజరు కాకపోయినా కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. అయితే.. ఇంత రాజకీయం జరుగుతున్న వేళ కుమారస్వామి కర్నాటకలో లేరు.. అమెరికాలో ఉన్నారు. కాదు.. కాదు..

కుమారస్వామి లేని వేళలోనే ఈ రాజకీయం జరుగుతోంది. అవును.. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రి కుమారస్వామి రాష్ట్రంలో లేనప్పుడు రాజకీయం ఒక్కసారిగా మలుపు తీసుకుంది. పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. దీంతో కుమారస్వామి హుటాహుటిన అమెరికా నుంచి బెంగళూరుకు బయలుదేరారు.
దేశ రాజకీయాల్లో.. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, వాటి పొరుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులు కొత్తేమీ కాదు. ఇంతకుముందూ ముఖ్యమంత్రులు విదేశాలకు వెళ్లినప్పుడు నమ్మిన బంటుల్లాంటి నేతలే కొంప ముంచారు. తిరుగుబాటు చేశారు. ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుని ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నాలు చేశారు.. ఆ ప్రయత్నాల్లో కొందరు తాత్కాలికంగా సక్సెస్ అయినా, మరికొందరు సక్సెస్ కాలేకపోయారు. ఇప్పుడు కుమారస్వామి రాష్ట్రంలో లేనప్పుడు జరుగుతున్న రాజకీయం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

ఎన్టీఆర్ అమెరికా వెళ్లినప్పుడు నాదెండ్ల ఏం చేశారో తెలుసా?

ముఖ్యమంత్రులు రాష్ట్రాల్లో లేనప్పుడు జరిగిన రాజకీయ తిరుగుబాటుల గురించి చెప్పుకోవాలంటే 1984లో ఎన్టీఆర్‌పై నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి అవడం గురించి తొలుత చెప్పుకోవాలి. 1984లో ఎన్టీ రామారావు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నాదెండ్ల భాస్కర్ రావు ఆర్థిక మంత్రి. అప్పుడు ఎన్టీఆర్ గుండెకు బైపాస్ సర్జరీ కోసం అమెరికా వెళ్లారు. అలా ఆయన రాష్ట్రంలో లేనప్పుడు నాదెండ్ల తిరుగుబాటుకు పథక రచన చేశారు. ఈ సంగతి అమెరికాలో ఉన్న ఎన్టీఆర్‌కు సమాచారం అందింది. దీంతో ఆయన అమెరికా నుంచి రాగానే నాదెండ్లను ఆర్థిక మంత్రి పదవి నుంచి తొలగించారు. అదే అదనుగా నాదెండ్ల కేంద్రంలోని కాంగ్రెస్ ప్రధాని ఇందిరాగాంధీ అండతో, గవర్నరు రాంలాల్ సహకారంతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 1984 ఆగస్టు 16 నుండి సెప్టెంబర్ 16 వరకు 30 రోజుల పాటు నాదెండ్ల భాస్కర్ రావు ముఖ్యమంత్రిగా ఉన్నారు.

దీన్ని సవాల్ చేసిన ఎన్టీఆర్ బలపరీక్ష ఎదుర్కొన్నారు. బల పరీక్ష సమయంలో ఎన్టీఆర్ తనకు 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ గవర్నరుకు లేఖ ఇవ్వడంతో పాటు ఆ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వారందరినీ  కర్ణాటకకు తరలించారు. కర్ణాటక నుండి నేరుగా అసెంబ్లీకి ఎంఏల్ఏలతో వచ్చి బలపరీక్షలో విజయం సాధించి మళ్లీ ముఖ్యమంత్రయ్యారు ఎన్టీఆర్.

ఆ సమయంలో ఎంతో డ్రామా నడిచింది. కర్నాటకలోని క్యాంప్ నుంచి  164 మందికి పైగా టిడిపి ఎంఏల్ఏలను ఎన్టీఆర్ నేరుగా రామకృష్ణ స్టూడియోకు తీసుకువచ్చారు. అయితే నాదెండ్ల భాస్కర్ రావు అప్పటికి సీఎంగా ఉండడంతో తన అధికారాన్ని ఉపయోగించి వారిలో కొందరిని తిప్పుకోవాలని ట్రై చేశారు. అప్పటికి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా ఉన్న విజయరామారావు, ఈస్ట్ జోన్ డీసీగా ఉన్న అరవిందరావులను పిలిచి రామకృష్ణ స్టూడియోలో క్యాంపులో ఉన్న ఎంఏల్ఏలను బయటకు తీసుకురావాలని ఆదేశించాడు. రామకృష్ణ స్టూడియో వద్దకు వెళ్ళిన అరవింద్ రావు ఎంఏల్ఏలను అడిగారు. అయితే తామంతా స్వచ్ఛందంగానే ఎన్టీఆర్‌కు మద్దతు పలుకుతున్నట్లు చెప్పగానే ఆయన వెనుదిరిగారు. దాంతో విజయరామారావు, అరవింద్ రావులను నాదెండ్ల బదిలీ చేశారు. విజయరామారావు రిటైరైన తరువాత టీడీపీలో చేరి కీలక పదవులు పొందారు. కాగా... నాదెండ్ల తిరుగుబాటు సమయంలో ఎన్టీఆర్‌ను మళ్లీ అధికారంలోకి తేవడంతో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని చెబుతారు. ముఖ్యంగా కర్ణాటకలో క్యాంప్ నిర్వహించి ఎమ్మెల్యేలు చేజారకుండా కాపాడింది ఆయనే.

నవీన్ పట్నాయక్ కూ ఫారిన్ థ్రెట్

ఆంధ్రప్రదేశ్‌ పొరుగు రాష్ట్రమైన ఒడిశాలోనూ ఇలాగే సీఎం స్టేట్లో లేనప్పుడు ఆయన్ను పదవీచ్యుతుడిని చేసే ప్రయత్నం జరిగింది. ఒడిశా మాజీ సీఎం, జనతాదళ్ నేత బిజూ పట్నాయిక్ మరణం తరువాత రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కుమారుడు నవీన్ పట్నాయిక్ బిజూ జనతాదళ్ పార్టీని స్థాపించి 2000 సంవత్సరంలో సీఎం అయ్యారు. రాజకీయాల్లోకి రాకముందు దిల్లీ, విదేశాల్లో హైఫై జీవితం గడిపిన నవీన్ ఒడిశాకు సీఎం అయిన తరువాత పూర్తిగా రాష్ట్రానికే అంకితమయ్యారు. రాష్ట్ర అవసరాల కోసం దిల్లీ వెళ్లడం మినహా రాష్ట్రాన్ని విడిచి వెళ్లకుండా పాలన సాగించారు. వరుసగా పార్టీని గెలిపిస్తూ సీఎం అవుతూ వచ్చిన ఆయన.. సీఎం అయిన 12 ఏళ్ల తరువాత బ్రిటన్ పర్యటనకు వెళ్లారు. అయితే.. ఆయన అలా వెళ్లారో లేదో.. ఆయనకు నమ్మిన బంటు, బీజేడీ రాజ్యసభ సభ్యుడు ప్యారీ మోహన్ మహాపాత్రో తిరుగుబాటుకు యత్నించారు. మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టి సీఎం కావాలని ప్రయత్నించారు.

ఈ సంగతి పసిగట్టిన నవీన్ పట్నాయక్ హుటాహుటిన లండన్ నుంచి భువనేశ్వర్ చేరుకుని తిరుగుబాటు నేతలందరిపైనా వేటు వేశారు. నవీన్ రావడం, తిరుగుబాటుదారులపై వేటు వేయడంతో.. అప్పటివరకు ప్యారీ పక్షం వహించిన వారు కూడా నవీన్‌ వద్దకు వచ్చి శరణు వేడుకున్నారు. అలాంటివారిలో కొందరిని క్షమించి.. మరికొందరిపై వేటు వేసి నవీన్ పార్టీపై తన పట్టు నిలుపుకొన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు నవీన్‌పై తిరుగుబాటు చేయడానికి ఇంకెవరూ సాహసించలేదు.

ఈ తిరుగుబాటు తరువాత మరో రెండుసార్లు ఎన్నికల్లో విజయం సాధించి సీఎంగా కొనసాగుతున్నారు నవీన్. ఇంకో విషయం ఏంటంటే... 51 ఏళ్ల వయసులో 1997లో రాజకీయాల్లోకి వచ్చిన నవీన్ అప్పటివరకు అమెరికాలో ఉండేవారు.. అక్కడి ప్రఖ్యాత సంగీతకారులు, మాజీ అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ భార్య జాక్వలిన్ వంటివారు ఆయన సన్నిహిత మిత్రులు. ఓ హాలీవుడ్ సినిమాలోనూ నవీన్ నటించారు. అలాంటి నవీన్.. ఒడిశా రాజకీయాల్లోకి వచ్చిన తరువాత 2012 వరకు మళ్లీ దేశం వదిలి వెళ్లలేదు. 2012లో జరిగిన తిరుగుబాటు ఘటనతో మళ్లీ ఇప్పటికీ ఆయన విదేశీ గడప తొక్కలేదు. మొన్నటి ఎన్నికల ముందు ఆయన చికిత్స కోసం అమెరికా వెళ్తారన్న ప్రచారం జరిగింది. కానీ, ఆయన భారత్‌ను విడిచి వెళ్లలేదు. అంతేకాదు.. అసలు నవీన్ పట్నాయిక్‌కు ఇప్పుడు పాస్‌పోర్ట్ కూడా లేదన్నది ఆయన సన్నిహితులు చెబుతున్నమాట.

ఇప్పుడు కుమారస్వామి వంతు..

యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్ గా పిలవబడుతున్న కుమారస్వామీ లక్కీయెస్ట్ అనే చెప్పాలి. ముక్కుతూ మూల్గుతూ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతూ వస్తున్న కర్ణాటక సీఎం కుమారస్వామి సీటు మొదటి రోజు నుంచే రేపోమాపో అన్నట్లే ఉంది. పాపం అలా అమెరికా వెళ్లారో లేదో ఇలా ఇక్కడ ఎమ్మెల్యేలు టపీటపీమని రాజీనామాలు చేశారు. పాపం ఎన్నో కోట్లు ఖర్చు చేసి ఎమ్మెల్యేలతో క్యాంప్ ఏర్పాటు చేసి కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆయన ఇప్పుడు సీఎం సీటు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. సీఎం అయినప్పటి నుంచి తిరుగుబాట్లు ఎదుర్కొంటున్నా బతిమాలో బెదిరించో ఏదోరకంగా సీటు పోకుండా కాపాడుకుంటూ వస్తున్న కుమారస్వామి అమెరికా వెళ్లగానే సంక్షోభం ముదిరిపోయింది. ఇపుుడు ఆయన అమెరికా నుంచి ఆల్రెడీ రిటర్న్ ఫ్లైట్ ఎక్కేశారు. ప్రభుత్వం ఉంటుందన్న నమ్మకం చాలామందిలో లేదు. ప్రజలు కూడా విసిగిపోయారు. అందుకే మిగతా రాష్ట్రాల్లో ఫిరాయింపులను ప్రోత్సహించిన బీజేపీ కర్ణాటకలో మాత్రం మళ్లీ ఎన్నకలకే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

సీఎం అవగానే సరిపోదు.. సీటు కాపాడుకోవాలి
రాజకీయాలు చాలా విచిత్రమైనవి. మంచి మెజారిటీ ఉన్న ప్రభుత్వాలు కూడా కూలిపోతుంటాయి.. మైనారిటీ ప్రభుత్వాలు కూడా అయిదేళ్లు పూర్తికాలం మనగలుగుతాయి. ఇదంతా పదవిని కాపాడుకోవడంలో ఆ సీఎం లేదా పీఎం టాలెంట్‌పై ఆధారపడి ఉంటుంది. కేంద్రంలో వాజపేయి ప్రభుత్వం ఒక్క ఓటుతో పడిపోయింది. సొంత పార్టీ అధిష్ఠానానికి ఇష్టం లేకపోయినా కూడా పీవీ నరసింహరావు అయిదేళ్ల పాటు మైనారిటీ ప్రభుత్వాన్ని అద్భుతంగా నడిపించారు. కర్నాటకలో అత్యధిక స్థానాలు గెలుచుకున్నా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. ఇలా.. ఎన్నో ఉదాహరణలు. అంతెందుకు.. ఎన్టీఆర్‌పై నాదెండ్ల తిరుగుబాటు చేసేటప్పటికి ఎన్టీఆర్‌కు తిరుగులేని మెజారిటీ ఉంది. నవీన్ విషయం కూడా అంతే. ఇప్పుడు కుమారస్వామి పరిస్థితే వేరు.

అందుకే కేసీఆర్ ఫాంహౌస్‌కి తప్ప ఫారిన్ వెళ్లరా?
ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా జాగ్రత్తపరుడని చెప్తారు. ఆయన మంచి మెజారిటీతో ప్రభుత్వాన్ని నడుపుతున్నా కూడా తన జాగ్రత్తలో తాను ఉంటారని.. నీడను కూడా నమ్మరని చెబుతారు. 88 మంది గెలిచి కూడా ఫిరాయింపులను ప్రోత్సహించారు. పైగా ఎంఐఎం మద్దతు ఆయనకు గట్టిగా ఉంది. అయినా కాలాన్ని కేసీఆర్ నమ్మరు. అందుకే..‌ ఫాం హౌస్‌కు తప్ప ఫారిన్ టూర్‌కి వెళ్లరని అంటారు. కుటుంబంలోని వ్యక్తులే పార్టీ నేతలను తిప్పుకుని అధికారం తన నుంచి లాగేసుకుంటారేమో అన్న భయం ఆయనకు ఉందని ప్రచారం జరుగుతోంది.

ఈ విషయంలో చంద్రబాబు ధైర్యవంతుడే..

దేశంలోని పాలకుల్లో విదేశీ పర్యటనలు ఎక్కువగా చేసే నేతగా ప్రధాని మోదీ పేరు ముందు ఉంటే ఏపీ మాజీ సీఎం చంద్రబాబు పేరు ఆ వెంటనే ఉంది. గత అయిదేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు సింగపూర్, స్విట్జర్లాండ్, అమెరికా, బ్రిటన్.. ఒకటేమిటి చాలా దేశాలు అనేక సార్లు వెళ్లారు. సీఎంగా ఉన్న కాలంలో ఆయన పెట్టుబడుల ఆకర్షణకు, సదస్సులకు ప్రతి ఏటా ఎన్నో విదేశీ పర్యటనలు చేసేవారు.  అంతకుముందు ఆయన రెండు సార్లు సీఎంగా ఉన్నప్పుడు కూడా అలాగే విదేశాలకు వెళ్లేవారు. కానీ, ఆయన సీఎంగా ఉంటూ విదేశాలకు వెళ్లినప్పుడు ఎన్నడూ తిరుగుబాటు జరగలేదు. అలా జరగకుండా చంద్రబాబు ఓ ప్రత్యేక ఎత్తుగడ వేసేవారని.. అందుకే ఆయన ఎన్నిసార్లు విదేశాలకు వెళ్లినా తిరుగుబాటు ప్రయత్నం అనేది జరగలేదని చెప్తారు. అదేంటంటే.. పార్టీలో తన తరువాత బలమైన నేతలు, ఎమ్మెల్యేల మద్దతు ఉన్న నేతలను తనతో పాటు విదేశీ పర్యటనకు తీసుకుపోయేవారు చంద్రబాబు. దాంతో చంద్రబాబుతో పాటు వారు కూడా రాష్ట్రంలో ఉండే పరిస్థితి లేక తిరుగుబాట్లకు అవకాశం లేకపోయిందనేది ఓ వాదన.

మొత్తానికి చంద్రబాబు, కేసీఆర్‌లు తీసుకున్న జాగ్రత్తలు, వారికి తెలిసిన కిటుకులు కుమారస్వామికి తెలిసినట్లుగా లేవు. అందుకే పాపం.. అసలే కష్టాల్లో ఉన్నప్పుడు విదేశాలకు వెళ్లి మరిన్ని కష్టాలు కొని తెచ్చుకున్నారు.

కొసమెరుపు:


సీఎంగా విదేశీ పర్యటనల్లో ఏ ఇబ్బందులు ఎదుర్కోకుండా మేనేజ్ చేయగలిగిన చంద్రబాబు  ప్రతిపక్ష నేతగా ఎదుర్కొన్నారు. మొన్నటి ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తరువాత విదేశీ పర్యటనకు వెళ్లగా ఆ సమయంలో నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరిపోయారు. కానీ ఆయన మధ్యలో పర్యటన ముగించుకుని రాలేదు. ఆ అవసరం కూడా పడలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English