సాయిరెడ్డికి జగన్ షాక్... రీజనేంటంటే?

సాయిరెడ్డికి జగన్ షాక్... రీజనేంటంటే?

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ తరఫున తొలి రాజ్యసభ సభ్యత్వాన్ని దక్కించుకున్న వేణుంబాక విజయసాయిరెడ్డిలను వేర్వేరుగా చూడలేం. జగన్ రాజకీయాల్లోకి రాకముందే... సాయిరెడ్డితో ఆయనకు అనుబంధం ఉంది. జగన్ వ్యాపారాలన్నింటికీ సాయిరెడ్డే ఆడిటర్. జగన్ అక్రమాస్తుల కేసులోనూ జగన్ తో పాటు ఆయన ఆర్థిక వ్యవహారాలన్నింటినీ చక్కదిద్దిన సాయిరెడ్డి కూడా ప్రధాన నిందితుడే. జగన్ వైసీపీ పెట్టిన తర్వాతే... సాయిరెడ్డి రాజకీయాల్లోకి రావడం, వైసీపీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించడం, వైరివర్గాలపై తనదైన శైలిలో విరుచుకుపడటం జరిగింది. ఈ క్రమంలోనే పార్టీ తరఫున తొలి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సాయిరెడ్డి... ఢిల్లీలోనూ చక్రం తిప్పేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే సాయిరెడ్డిని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తూ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఏమైందో తెలియదు గానీ... ఆ పదవి నుంచి సాయిరెడ్డిని తప్పిస్తూ జగన్ గురువారం సాయంత్రం సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఈ నిర్ణయం అటు వైసీపీలోనే కాకుండా ఇటు దాదాపుగా అన్ని రాజకీయ పార్టీల్లోనూ పెద్ద చర్చకే తెర తీసింది. అదేంటీ... పార్టీలో తన తర్వాత స్థానంలో ఉన్నారని భావిస్తున్న సాయిరెడ్డికి జగన్ ఇలా ఝలక్ ఇచ్చారేమిటా? అని అంతా షాక్ తిన్నారు. వైసీపీ నేతలకు కూడా జగన్ నిర్ణయంలోని అసలు కారణం బోధపడటలేదట. అయితే ఈ విషయంపై కాస్తంత లోతుగా ఆరా తీయగా... ఎలాగూ రాజ్యసభ సభ్యుడిగా, పార్టీ పార్లమెంటరీ నేతగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న సాయిరెడ్డికి ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిగా కూడా బాధ్యతలు అప్పగిస్తే.. కాస్తంత ఇబ్బందే కదా అని జగన్ భావించారట. అంతేకాకుండా ఇప్పటికే పార్టీలోనే కాకుండా పార్లమెంటరీ పార్టీ నేతగానూ కీలక బాధ్యతల్లో ఉన్న సాయిరెడ్డిని ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిగా తొలగిస్తే... ఆ పదవిని ఇంకో కీలక నేతకు అప్పగించి కాస్తంత సంతృప్తి పరచవచ్చు కదా అని జగన్ భావించారట. ఈ క్రమంలోనే సాయిరెడ్డిని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి పదవి నుంచి తొలగించినట్టుగా ప్రచారం జరుగుతోంది. మరి సాయిరెడ్డి పోస్టును జగన్ ఎవరికి కట్టబెడతారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English