ఆయ‌న కోసం కేసీఆర్ రిస్క్ తీసుకుంటారా..?

ఆయ‌న కోసం కేసీఆర్ రిస్క్ తీసుకుంటారా..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌ను ఒంటిచేత్తో మ‌ళ్లీ అధికారంలోకి తెచ్చిన ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ను కొన్ని అంశాలు, మ‌రికొన్ని స‌మీక‌ర‌ణాలు ఇబ్బందికి గురిచేస్తున్నాయి. పార్టీ అంత‌ర్గ‌త విష‌యాలే ఆయ‌న‌ను అంత‌ర్మ‌థ‌నంలో ప‌డేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తిరుగులేని విజ‌యాన్ని అందుకున్న కేసీఆర్‌కు.. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ఫ‌లితాలు మాత్రం కంటిమీద కునుకులేకుండా చేశాయి. ఈ ఎన్నిక‌ల్లో ప‌లువురు కీల‌క నేత‌లు ఓట‌మిపాల‌య్యారు. ఇందులో కేసీఆర్ కూతురు క‌ల్వ‌కుంట్ల క‌విత నిజామాబాద్‌లో బీజేపీ అభ్య‌ర్థి చేతిలో,  బోయిన‌ప‌ల్లి వినోద్‌కుమార్ క‌రీంన‌గ‌ర్‌లో బీజేపీ అభ్య‌ర్థి బండి సంజ‌య్ చేతిలో ఓడిపోయారు.

ఈ రెండు ఓట‌ములు కేసీఆర్‌ను తీవ్ర నిరాశ‌కు గురిచేశాయి. అయితే.. పార్టీ ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి తెలంగాణ రాష్ట్ర సాధ‌న ఉద్య‌మంలో కేసీఆర్‌తో క‌లిసి న‌డిచిన సీనియ‌ర్ నేత వినోద్‌కుమార్‌. ఎంపీగా ఉన్న‌ప్పుడు ఢిల్లీలో అనేక ప‌నులు చ‌క్క‌బెట్టిన నాయ‌కుడు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితుడు. అందులోనూ ఒక‌టే సామాజిక‌వ‌ర్గం.. వెల‌మ‌. ఈ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో వినోద్‌కుమార్ ఓడిపోవ‌డాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేక‌పోతున్నారు. అనుభ‌వం, నిజాయితీ ఉన్న వినోద్‌కు రాష్ట్ర ప్ర‌భుత్వంలో స‌ముచిత స్థానం క‌ల్పించాల‌నే యోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లు కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే.. ఇక్క‌డ కేసీఆర్‌కు అనేక చిక్కులు ఎదుర‌వుతున్నాయి.

ఇప్ప‌టికే టీఆర్ఎస్ పార్టీలో వెల‌మ‌ల ఆధిప‌త్యంలో ఉంద‌నే టాక్ పార్టీ శ్రేణుల్లోనే వినిపిస్తోంది. ఇప్ప‌టికే మంత్రివ‌ర్గంలో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ నుంచి వెల‌మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన ఎర్ర‌బెల్లికి అవ‌కాశం ఇచ్చారు. ఉమ్మ‌డి జిల్లా పార్టీ పుట్టిన‌ప్ప‌టి నుంచి ప‌నిచేస్తున్న వారిని కాద‌ని.. మొన్న‌మొన్న టీడీపీ నుంచి వ‌చ్చిన ఎర్ర‌బెల్లికి ప‌ద‌వి ఇవ్వ‌డంపై ఇప్ప‌టికే జిల్లా శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. మ‌రోవైపు కుమారుడు కేటీఆర్‌కు పార్టీవ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. ఇక మేన‌ల్లుడు హ‌రీశ్‌రావుకు ప్ర‌స్తుతం ఎలాంటి ప‌ద‌వి లేకుండా ఎమ్మెల్యేగానే కొన‌సాగుతున్నారు. ప్ర‌స్తుత కేబినెట్‌లో వీరిద్ద‌రికీ అవ‌కాశం ఇవ్వ‌లేదు కేసీఆర్‌.

అయితే.. కేబినెట్ విస్త‌ర‌ణ‌లో వీరిద్ద‌రితోపాటు బోయిన‌ప‌ల్లి వినోద్‌కుమార్‌కు కూడా అవ‌కాశం క‌ల్పిస్తే.. పార్టీశ్రేణుల‌తోపాటు సామాన్య ప్ర‌జ‌ల్లోనూ వ్య‌తిరేక‌త వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. ప‌ద‌వుల‌న్నీ వెల‌మ‌ల‌కేన‌న్న భావ‌న ప్ర‌జ‌ల్లో వ‌స్తే.. పార్టీకి ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ బోయిన‌ప‌ల్లి వినోద్‌కుమార్‌ను ఎమ్మెల్సీగా తీసుకుని, మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టే సాహ‌సం చేస్తారా..? అంత రిస్క్ తీసుకుంటారా..? అనే చ‌ర్చ కూడా న‌డుస్తోంది. ఈ విష‌యంలో తొంద‌ర‌లోనే క్లారిటీ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో...

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English