బాధ పడ్డ అంబటి రాయుడు.. నిష్క్రమించాడు

బాధ పడ్డ అంబటి రాయుడు.. నిష్క్రమించాడు

అంబటి రాయుడు.. భారత క్రికెట్‌పై తనదైన ముద్ర వేసిన ఆటగాడు. మహ్మద్ అజహరుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్‌ల తర్వాత తెలుగు గడ్డ నుంచి అత్యున్నత స్థాయి క్రికెట్ ఆడిన కుర్రాడు. ఈ టాలెంటెడ్ క్రికెటర్ హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. తాను అన్ని రకాల క్రికెట్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు బుధవారం అతను ప్రకటించాడు.

రాయుడి వయసు 33 ఏళ్లే కావడం గమనార్హం. మామూలుగా క్రికెటర్లు 36-37 ఏళ్ల వయసొస్తే కానీ.. రిటైరవ్వరు. ఆ వయసును మించి కూడా ఆటలో కొనసాగుతుంటారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ ఐపీఎల్, దేశవాళీ క్రికెట్లో కొనసాగుతుంటారు. కానీ రాయుడు మాత్రం తక్కువ వయసులోనే ఆట నుంచి తప్పుకోవడం షాకింగే. అతనీ నిర్ణయాన్ని ఆవేదనతోనే తీసుకున్నట్లు అర్థమవుతోంది.

గత ఏడాది చివరి వరకు ఉన్న పరిస్థితి చూస్తే ఇప్పటికి రాయుడు ప్రపంచకప్ ఆడుతుండాలి. బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగో స్థానంలో అతను బాగా కుదురుకున్నట్లే కనిపించాడు. కానీ కొన్ని మ్యాచ్‌ల్లో విఫలమవగానే రాయుడిని పక్కన పెట్టి తమిళనాడు ఆల్‌రౌండర్ విజయ్‌శంకర్‌ను ప్రపంచకప్ జట్టులోకి ఎంపిక చేశారు సెలక్టర్లు. ఈ నిర్ణయం రాయుడిని తీవ్ర ఆవేదనకు గురి చేసింది. ఆ ప్రభావం ఐపీఎల్‌లోనూ అతడి ఆటపై పడింది. సరిగా రాణించలేదు.

రాయుడిని కాకుండా శంకర్‌ను ప్రపంచకప్‌కు ఎంపిక చేయడంపై విలేకరులు చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌ను అడిగితే.. శంకర్ బ్యాటింగ్, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ల్లో ఉపయోగపడే త్రీడైమన్షన్స్‌లో ఉపయోగపడే ఆటగాడని అన్నాడు. దీన్ని ఎద్దేవా చేస్తూ.. తాను ప్రపంచకప్ చూడటం కోసం ‘త్రీడీ’ గ్లాసులు కొన్నానని అన్నాడు రాయుడు. ఆ కామెంటే అతడికి చేటు చేసిందో ఏమో కానీ.. ధావన్, శంకర్ ఒకరి తర్వాత ఒకరు గాయపడ్డా.. స్టాండ్‌బైల్లో ఒకడైన రాయుడిని కాదని.. పంత్, మయాంక్‌లను జట్టులోకి తీసుకున్నారు.

దీంతో రాయుడు బాగానే హర్టయినట్లున్నాడు. హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. కెరీర్లో రాయుడు 55 వన్డేలు, 6 టీ20లు ఆడాడు. కుర్రాడిగా మంచి ఊపుమీదున్న దశలో ఐసీఎల్ వైపు వెళ్లడం రాయుడి కెరీర్‌కు పెద్ద దెబ్బ. దాని వల్ల నిషేధం ఎదుర్కొని మళ్లీ దేశవాళీ క్రికెట్లో అడుగుపెట్టిన అతను.. ఐపీఎల్‌లో సత్తా చాటి భారత జట్టులో అవకాశం దక్కించుకున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English