టీడీపీలో కాపుల డామినేష‌న్ మొద‌లైందా...

టీడీపీలో కాపుల డామినేష‌న్ మొద‌లైందా...

తెలుగుదేశంలో కాపుల క‌ద‌లిక‌లు.. ఎందుకు..? ఎటువైపు..? ఎవ‌రికోసం..? ఇప్పుడు ఇవే ప్ర‌శ్న‌లు పార్టీశ్రేణుల‌తోపాటు రాజ‌కీయవ‌ర్గాల మెద‌ళ్ల‌ను తొలుస్తున్నాయి. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ఇప్పుడే ఎందుకు కాపునేత‌లు హ‌డావుడి చేస్తుండ‌డం ఆస‌క్తిరేపుతోంది. తెలుగుదేశం పార్టీలో ఏదో జ‌రుగుతోంద‌ని, మ‌రేదో మార్పు  కోరుతున్నార‌నే సంకేతాలు మాత్రం స్ప‌ష్టంగానే క‌నిపిస్తున్నాయి. 2109 ఎన్నిక‌ల్లో దారుణ ప‌రాజ‌యం త‌ర్వాత‌నే ఈ ప‌రిణామాలు, సామాజిక స‌మీక‌ర‌ణాలు వేగంగా త‌రుముకొస్తున్నాయి. ఇవి పార్టీలో ఎలాంటి కీల‌క మార్పుల‌కు దారితీస్తాయో, చంద్ర‌బాబులో ఎలాంటి గుణాత్మ‌క మార్పున‌కు కార‌ణ‌మ‌వుతాయో ఇప్పుడే చెప్ప‌డం క‌ష్టం. కానీ.. తొంద‌రగానే ఈ విష‌యంలో స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

నిజానికి తెలుగుదేశం పార్టీ అంటేనే.. బీసీలు, బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ అనే గుర్తింపు ఉంది. బీసీల‌ను ప‌క్క‌న పెడితే టీడీపీలో ఎప్పుడూ క‌మ్మ‌ల హ‌వానే న‌డుస్తూ ఉంటుంది. ఎన్టీఆర్ బీసీల‌కు ప్రాధాన్యం ఇచ్చాక ఆ వ‌ర్గాల్లో మెజార్టీ టీడీపీకి వెన్నుద‌న్నుగా ఉన్నారు. పార్టీలో బీసీల‌కు చంద్ర‌బాబు బాగానే ప్రాధాన్యం ఇచ్చారు. 2014 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన త‌ర్వాత పార్టీలో, ప్ర‌భుత్వంలో కాస్తంత కాపుల ఆధిప‌త్యం పెరిగింది. బాబు కాపుల‌కు ప్రాధాన్యం ఇచ్చారు. అయినా.. 2019 ఎన్నిక‌ల్లో కాపులు పార్టీకి అండ‌గా నిల‌వ‌లేదు. దాదాపుగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌కే కాపు ఓట‌ర్లు అండ‌గా నిలిచారు. కేవ‌లం నేత‌లు మాత్ర‌మే బాబుకు మిగిలారు.

ఇదే స‌మ‌యంలో బాబు కాపుల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డంతో బీసీలు కూడా దూర‌మ‌య్యారు. మ‌రోవైపు వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌క‌టించిన బీసీ డిక్ల‌రేష‌న్‌తో కూడా బీసీ వ‌ర్గాలు మొత్తం వైసీపీకి జైకొట్టారు. దీంతో అటు బీసీవ‌ర్గాలు, కాపులు తెలుగుదేశం పార్టీకి దూర‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో తెలుగుదేశం కాపు నేత‌లు ఈ మ‌ధ్య తెగ‌హ‌డావుడి చేస్తున్నారు. వ‌రుస స‌మీక్ష‌ల‌తో బిజీబిజీగా ఉంటున్నారు. దీంతో రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌ళ్లీ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌కు ద‌గ్గ‌ర‌కు తీసుకోవాలంటూ బాబుపై కాపునేత‌లు ఒత్తిడి చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇదే స‌మ‌యంలో పార్టీలో కీల‌క స్థానం కోసం కూడా వారు ప‌ట్టుబ‌డుతున్న‌ట్లు స‌మాచారం.

అంటే... మొత్తంగా పార్టీపై ప‌ట్టుకోసం కాపు నేత‌లు బాగానే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌న్న మాట‌. ఒక‌వేళ‌.. అదే జ‌రిగితే.. తెలుగుదేశం పార్టీకి మిగిలిన బీసీవ‌ర్గాలు కూడా దూర‌మ‌య్యే అవ‌కాశం ఉంది. ఉభ‌య‌గోదావ‌రి, ఉత్త‌రాంధ్ర‌, త‌దిత‌ర ప్రాంతాల్లో టీడీపీని కాపాడుకుంటూ వ‌స్తున్న బీసీవ‌ర్గాలు.. మొత్తంగా పార్టీని వ‌దిలేసే ప్ర‌మాదం ఉంద‌ని చంద్ర‌బాబు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్న‌ట్లు తెలుస్తోంది.

ఇప్ప‌టివ‌ర‌కు పార్టీలో క‌మ్మ కుల‌స్తుల ఆధిప‌త్యం కొన‌సాగ‌గా.. ఇక నుంచి కాపుల పెత్త‌నం కూడా పెరుగుతుంద‌నే టాక్ వినిపిస్తోంది. ఈ సంక్లిష్ట ప‌రిస్థితుల్లో కాపు నేత‌ల ఒత్తిడికి చంద్ర‌బాబు త‌లొగ్గుతారా..?  లేక త‌న రాజ‌కీయ అనుభ‌వంతో మ‌రేదైనా ఉపాయం ఆలోచిస్తారా..?

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో కాపు నేత‌లు కూడా ప‌వ‌న్‌ను న‌మ్మే ప‌రిస్థితి లేదు. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు తీవ్ర‌మైన సంక‌ట స్థితిలో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే కాపు నేత‌లంతా ఒకేతాటిమీద‌కు వ‌చ్చి త‌మ మాట‌ను నెగ్గించుకునేలా చేయ‌డంతో పాటు పార్టీలో త‌మ ఆధిప‌త్యానికి బీజం వేసే ప‌నిలో ఉన్న‌ట్టు ఆ పార్టీలో ప‌రిణామాలు స్ప‌ష్టం చేస్తున్నాయ్‌. ఏపీలో మెజార్టీ జిల్లాల్లో వారి డామినేష‌న్ ఉండ‌డంతో చంద్ర‌బాబు కూడా త‌లొగ్గ‌క త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితే ప్ర‌స్తుతం ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English