తెలుగు బ్ర‌ద‌ర్స్‌ను చీల్చిన మోదీ రాజ‌కీయం

తెలుగు బ్ర‌ద‌ర్స్‌ను చీల్చిన మోదీ రాజ‌కీయం

ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో తెలంగాణలో అనూహ్యంగా బీజేపీ ఏకంగా నాలుగు ఎంపీ స్థానాల్ని సొంతం చేసుకోవటంతో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారుతున్నాయి. ఈ గెలుపుతో కమలనాథుల్లో ఆశలు చిగురించి తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని ఆరాటపడుతున్నారు.  ప్రయత్నిస్తే పోయేదేమీ లేదని, పుంజుకునేందుకు ఇదే సరైన మార్గమని కాషాయ నేతలు భావిస్తున్నారట. అందుకు తగ్గట్టే ఆపరేషన్ ఆకర్ష్‌తో ఇతర పార్టీ నేతలకు గాలం విసురుతున్నారు.

అయితే, ఇలా విసిరిన వ‌ల ఫ‌లితంగా ఫైర్‌బ్రాండ్ నేత‌లుగా ముద్ర‌ప‌డిన సోద‌రుల మ‌ధ్య చీలిక వచ్చిందంటున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలోకి చేరడానికి సై అనడంతో ఆయ‌న అన్న వెంక‌ట్‌రెడ్డికి దక్కుతుందనుకున్న పీసీసీ పదవికి అధిష్టానం నో చెప్పేసిందని పెద్ద ఎత్తున  టాక్ వినిపిస్తోంది.

తెలంగాణ రాజ‌కీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్‌ది ఇటీవ‌లి వరకు ఒకటే మాట. బ్రదర్స్ ఇన్నేళ్లుగా కలిసి రాజకీయం చేశారు. కాంగ్రెస్ త‌ర‌ఫున ఎమ్మెల్యేగా గెలిచిన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీకి సై అనేశారు. తమకు పీసీసీ పీఠం కావాలని...లేదంటే కాంగ్రెస్‌ను వీడుతామంటూ ఆయన ప్రకటనలు చేశారు. దీంతో తమ్ముడితో కాంగ్రెస్ అధిష్టానాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి బెదిరిస్తున్నారని కాంగ్రెస్ ఓ అంచనాకు వచ్చేసింది.

దీంతోపాటుగా, కాంగ్రెస్ లో పీసీసీ పీఠం దక్కకపోతే బీజేపీలో చేరడానికి కోమటిరెడ్డి బ్రదర్స్ రెడీ అయ్యారని కాంగ్రెస్ అధిష్టానం అనుమానిస్తోంది. బీజేపీతో, కేంద్రమంత్రితో సాన్నిహిత్యాన్ని కాంగ్రెస్ అనుమానంగా చూస్తోంది. ముందు రాజగోపాల్ రెడ్డి వెళ్లి ఆ తర్వాత వెంకటరెడ్డి వెళ్లడానికి రెడీ అయినట్టు సమాచారం అందిందట.. అందుకే కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పీసీసీ అధ్యక్ష పదవికి దూరం పెట్టిందని అంటున్నారు.

ఈ అనుమానంలో భాగంగానే, పార్లమెంట్ లో ఎంపీగా వెంకటరెడ్డి ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ తోటి ఎంపీలు ఎవరూ బల్లలు చరచలేదని అంటున్నారు. ఇదే స‌మ‌యంలో సికింద్రాబాద్ ఎంపీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చప్పట్లతో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అభినందనలు తెలప‌డం గ‌మ‌నార్హం. అన్నయ్యను ముంచేసిన తమ్ముడి వైఖరి చూసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు తలపట్టుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాత్రం తాను పార్టీ మారే ప్రసక్తే లేదంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English