వైసీపీకి షాక్.. రాజీనామా యోచనలో కీలక నేత..!

వైసీపీకి షాక్.. రాజీనామా యోచనలో కీలక నేత..!

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వలసల పరంపర కొనసాగుతోంది. ఎక్కడైనా అధికార పార్టీలోకి వలసలు ఉంటాయి. కానీ, ఇక్కడ పరిస్థితి పూర్తి భిన్నంగా తయారైంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూట గట్టుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీలోకి వెళ్లిపోతున్నారు. మరికొందరు కూడా వారి బాటలోనే పయనించేందుకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తమ పార్టీలోకి చేరికలను ప్రోత్సహించకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. అయితే, తాజాగా ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

 ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీకి రాజీనామాలు చేయడం సహజం. కానీ, అధికార పార్టీకి గుడ్‌బై చెప్పిన సందర్భాలు మాత్రం చాలా తక్కువ. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి నెల రోజులు మాత్రమే అయినా.. ఆ పార్టీకి ఓ కీలక నేత రాజీనామా చేయబోతున్నారట. ఆయనే మాజీ మంత్రి, సీనియర్ నాయకులు దగ్గుబాటి వెంకటేశ్వర్రావు. తన భార్య, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి కోరిక మేరకు ఆయన భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అవును.. ప్రస్తుతం ఈ వార్త ఏపీ రాజకీయాల్లో హల్‌చల్ చేస్తోంది.

 అంతేకాదు, ఆయనతో పాటు కుమారుడు హితేష్ చెంచురామ్ కూడా బీజేపీ కండువా కప్పుకోనున్నారని అంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే మంతనాలు కూడా జరిపారని తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలుగా గెలిచినా ప‌ర్చూరులో మాత్రం ఆయ‌న స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు. ఆయనపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విజయం సాధించారు. వాస్తవానికి ప్రకాశం జిల్లాలో వైసీపీకి మంచి పట్టుంది. దీనికితోడు జగన్ వేవ్ భారీగా ఉంది. అయినా.. సీనియర్ నేత ఓడిపోవడంతో ముఖ్యమంత్రి అసంతృప్తిగా ఉన్నారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది.

 అలాగే, భార్య ఒక పార్టీలో ఉండ‌డం.. భ‌ర్త మ‌రో పార్టీలో ఉండ‌డాన్ని కూడా చాలా మంది సామాన్య ఓట‌ర్లు జీర్ణించుకోలేకపోయారు. ఇది కూడా ద‌గ్గుపాటి ఓట‌మి ప్ర‌ధాన కార‌ణాల్లో ఒక‌టి అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వేరు వేరు పార్టీల్లో ఉండి చెడ్డ పేరు తెచ్చుకోవడం కంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరడమే మేలని దగ్గుబాటి భావిస్తున్నట్లు సమాచారం. దీనికితోడు, కుమారుడు రాజకీయ భవిష్యత్ కూడా బాగుంటుందనే ఉద్దేశ్యంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ దగ్గుబాటి బీజేపీలో చేరితే ఆ పార్టీ బలం భారీగా పెరుగుతుందనే టాక్ వినిపిస్తోంది. 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English