ఓట్లు వేయరు కానీ... బాబు ఇంటికి స్థలమిస్తారట

ఓట్లు వేయరు కానీ... బాబు ఇంటికి స్థలమిస్తారట

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనంత ఘోర పరాభవం ఎదుర్కొన్నారు ఇటీవలి ఎన్నికల్లో. 2004లో కంటే ఇది ఘోరమైన ఓటమి. ఆ ఎన్నికలకు ముందు ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉన్న సంగతి ముందే అర్థమైంది. కానీ ఇటీవలి ఎన్నికలకు ముందు అంత వ్యతిరేకతే లేదనే అనిపించింది. ఎన్నికలు హోరాహోరీగా సాగి ఉంటాయని.. ఫలితాలు కూడా అలాగే వస్తాయని అనుకున్నారు.

ముఖ్యంగా చంద్రబాబు బాగా ఫోకస్ చేసిన రాజధాని ప్రాంతంతో ముడిపడ్డ కృష్ణా, గుంటూరు జిల్లాలు ఆయనకు మద్దతుగా నిలుస్తాయని అనుకున్నారు. కానీ ఈ ప్రాంత ప్రజలు కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగానే ఓట్లేశారని ఫలితాల్ని బట్టి అర్థమైంది. ఇది చంద్రబాబును హతాశుడిని చేసి ఉంటుందనడంలో సందేహం లేదు. ఐతే ఎన్నికల్లో ఓట్లు వేయని రాజధాని ప్రాంత ప్రజలు.. ఓటమి అనంతరం చంద్రబాబుకు మద్దతుగా నిలిచే ప్రయత్నం చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

జగన్ సర్కారు అమరావతిలోని తన నివాసాన్ని ఖాళీ చేయమన్న నేపథ్యంలో చంద్రబాబు రాజధాని ప్రాంతాన్ని విడిచి వెళ్లడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఐతే ఆయన ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదని.. అమరావతిలో చంద్రబాబు నివాసానికి అవసరమైన స్థలాన్ని ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రాజధాని రైతులు చెబుతుండటం విశేషం. ప్రజావేదిక కూల్చివేతను వారు తప్పుపట్టారు.

చంద్రబాబును కలిసేందుకు రాజధాని నుంచి పెద్ద ఎత్తున రైతులు, మహిళలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా రైతులు ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ.. చంద్రబాబుపై కక్షకట్టి ఇక్కడి నుంచి పంపించేయాలని  చూస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అక్రమ కట్టడాలు కట్టలేదని, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కట్టినవేనని వారన్నారు. అమరావతితో పాటు రాష్ట్రంలో అక్రమకట్టడాలు చాలా ఉన్నాయని, వాటిని ఎందుకు కూల్చలేదని రైతులు ప్రశ్నించారు. చంద్రబాబు తన నివాసాన్ని ఖాళీ చేయవలసి వస్తే.. వెలగపూడిలోగానీ, రావిపూడి, తుళ్లూరు గ్రామం.. చుట్టుపక్కల చంద్రబాబు నివాసానికి అనువైన స్థలం ఇచ్చేందుకు తాము సిద్దంగా ఉన్నామని రైతులు స్పష్టం చేశారు. చంద్రబాబు ఎక్కడకు వెళ్లకుండా తమ మధ్యే ఉండాలని కోరుతున్నారు. ఐతే రైతుల నుంచి ఈ స్పందన చూశాక ఓట్లు వేయకుండా బాబు ఇంటికి స్థలం ఇస్తామని ముందుకు రావడమేంటి అని  తెలుగుదేశం వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English