బీజేపీ నేత‌ల‌కు టార్గెట్‌...చేరిక‌ల‌పై ఆ ఇద్ద‌రి మ‌ధ్య పోటీ

బీజేపీ నేత‌ల‌కు టార్గెట్‌...చేరిక‌ల‌పై ఆ ఇద్ద‌రి మ‌ధ్య పోటీ

ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో రికార్డు స్థాయి గెలుపుతో భార‌తీయ జ‌న‌తాపార్టీ తిరిగి అధికారం కైవ‌సం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఫ‌లితాలు వెలువ‌డింది మొద‌లు ఆ పార్టీ జంపింగ్‌ల‌పై దృష్టిపెట్టింది. ఆయారాష్ట్రాల‌లో పెద్ద ఎ్త‌తున చేరిక‌ల‌ను ప్రోత్స‌హిస్తోంది. ఇతర పార్టీల నాయకులకు పెద్ద ఎత్తున కండువాలు కప్పుతోంది. అయితే ఇందులో ఇద్దరు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు పోటీ పడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర పార్టీల నేతలను లాగడమే లక్ష్యంగా వీరు ఇరువురు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. ఆ పార్టీ నాయకత్వం వీరి మధ్య పరుగుపందెం నిర్వహిస్తుందన్న వార్తలు మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

తెలుగునేల‌కు చెందిన రాంమాధవ్‌, మురళీధర్‌రావు  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శుల హోదాలో ఉన్న సంగ‌తి తెలిసిందే. జాతీయ స్థాయిలో రాజ‌కీయాలు చేస్తున్న ఈ నేత‌లు ఇప్పుడు టార్గెట్ పెట్టుకొని మ‌రీ చేరిక‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నారు. తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్‌, గరికపాటి రాంమోహన్‌ తదితరులు రాంమాధవ్ నేతృత్వంలో ఇటీవల బీజేపీలో చేరారు. మ‌రో టీడీపీ నేత లంక దినకర్‌ని రాంమాధ‌వ్ పార్టీలోకి తీసుకొచ్చారు.

దీంతో తెలంగాణకు చెందిన మరొక జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావుపై పార్టీలోని కొందరు సీనియర్‌ నాయకులు ఒత్తిడి చేసినట్టు తెలిసింది. దీంతో తేరుకున్న ఆయన పార్టీలోకి మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు ఇనుగాల పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ చాడ సురేష్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలను నేరుగా ఢిల్లీకి పిలిపించి మరీ పార్టీలో చేర్చారు. సదరు నాయకుల్లో ఒకరిద్దరు ఇప్పుడు రాలేమని, చెప్పినా.... వారిని హుటాహుటినా దేశ రాజధానికి రప్పించి పార్టీలో చేర్చారని బీజేపీవర్గాలు గుసగుసలాడుతున్నాయి.

ఇలా ప‌ర‌స్ప‌రం పోటాపోటీతో తెలుగు రాష్ట్రాల్లో 2024 వరకు పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ఇతర పార్టీల్లో నేతలను జమ చేసే పనిలో పడ్డారు. బలమైన కులాలకు చెందినవారు, సంబంధిత ప్రాంతం, నియోజకవర్గ కేంద్రాల్లో కీలకమైన నాయకులను తమ పార్టీలోకి తీసుకువచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు సామ,దాన,ధన,దండోపాయాలన్న సూత్రం అన్వయిస్తూ ముందుకు వెళుతున్నారు.

దేశమంతా మోడీ గాలి ఉందని... సాధారణంగానే తాము పార్టీలోకి వస్తున్నామని చేరుతున్నవారు చెబుతున్నప్పటికీ, పార్టీలో చేరేవారికి ఏదో ఒక విధంగా సాయం చేస్తామని ప్రధాన కార్యదర్శులు అధిష్టానంతో చెప్పిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంకా కుదరకపోతే, ఆయా నాయకులపై ఉన్నటువంటి కేసులను తిరగదోడతామని బెదిరిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై తెలుగు రాష్ట్రాల‌కు చెందిన కేసుల్లో ఉన్న టీడీపీ, కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌ నేతల వివరాలు తయారు చేయాలని ఆర్డర్స్‌ వచ్చినట్టు తెలిసింది. ఈ విషయం తెలుసుకుంటున్న నేతలంతా తమకు వేరే ఇతర దారిలేక బీజేపీలోకి వెళుతున్నట్టు సమాచారం. దాంతోపాటు, ఓడిపోయిన బలమైన నేతలు, పార్టీపై అసంతృప్తితో ఉన్నటువంటి నేతలను సైతం గుర్తించి వారితో వీరు ఇరువురు సంప్రదింపులు జరుపుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English