కేబినెట్ విస్తరణకు డేట్ ఫిక్స్.. వాళ్లకే అవకాశం

కేబినెట్ విస్తరణకు డేట్ ఫిక్స్.. వాళ్లకే అవకాశం

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కేబినెట్ విస్తరణ చేయబోతున్నారని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కేబినెట్ విస్తరణ జరిగేది నిజమే అయినా.. అది ఎప్పుడు ఉండబోతుంది అన్న దానిపై మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. దీనికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక కార్యక్రమాలపై దృష్టి సారించడమే. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరపడం.. తాజాగా సచివాలయ భవనానికి శంకుస్థాపన చేయడం వంటి పనుల వల్లే విస్తరణ ఆలస్యమైందని తెలిసింది.

 ఈ కార్యక్రమాలు పూర్తవడంతో కేసీఆర్ కేబినెట్ విస్తరణపై దృష్టి సారించనున్నారని తెలిసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతోందని సమాచారం. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా ముగించుకుని జూలై మొదటి వారంలో కేబినెట్ విస్తరణ చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. జూలై ఆరున తెలంగాణ కేబినెట్ విస్తరణ చేయడానికి కేసీఆర్ ముహూర్తం ఫిక్స్ చేశారట. ఆరు ఆయన లక్కీ నెంబర్ కావడంతో ఇదే ఈరోజును ఫైనల్ చేశారని తెలిసింది. దీనిపై రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన చేయనున్నారని సమాచారం.

 ప్రస్తుతం తెలంగాణ కేబినెట్‌లో కేసీఆర్‌తో కలిపి 12 మంది మంత్రులు ఉన్నారు. రాష్ట్రంలోని అసెంబ్లీ సీట్ల ప్రకారం మొత్తం 18 మంది మంత్రులు ఉండవచ్చు. దీంతో కొత్తగా మరో ఆరుగురికి అవకాశం దక్కనుంది. ఇందులో ముఖ్యమంత్రి కుమారుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు మేనల్లుడు హరీశ్ రావు పేర్లు ఉంటాయని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, గత మంత్రివర్గ ఏర్పాటులో కేసీఆర్ మహిళలను కేబినెట్‌లోకి తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అందుకే ఈసారి మహిళలకు కూడా చోటు దక్కుతుందనే టాక్ వినిపిస్తోంది.

 ఈ సారి విస్తరించనున్న కేబినెట్‌లో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కూడా చోటు దక్కబోతుందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా మహిళల కోటాలో మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని తీసుకుంటారని అంటున్నారు. ఆమెతో పాటు కాంగ్రెస్ నుంచి వచ్చిన మరో సీనియర్ నేతకు కూడా చోటు ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు, ప్రస్తుత కేబినెట్ నుంచి కొందరిని తొలగిస్తారు అన్న ప్రచారమూ జరుగుతోంది. అయితే, ఆ మంత్రులు ఎవరన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. మొత్తానికి కేసీఆర్ చేయబోయే కేబినెట్ విస్తరణ పలు సంచలనాలకు కేంద్ర బిందువు కానుందన్న మాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English