చంద్రబాబుకు చెప్పే వచ్చాను.. ఇంకా పార్టీ మారలేదు

చంద్రబాబుకు చెప్పే వచ్చాను.. ఇంకా పార్టీ మారలేదు

ఏపీ టీడీపీలో ఎవరు ఎప్పుడు బీజీపీలోకి చేరిపోతారన్నది ఆ పార్టీ నేతల ఊహలకే అందడం లేదు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు.. రాజకీయాలకు మించి ఆర్థిక సంబంధాలు ఉన్నవారు కూడా చంద్రబాబు చేయి వదిలి కమలం గూటికి చేరిపోతున్నారు. ఇప్పటికే నలుగురు రాజ్యసభ ఎంపీలు కాషాయ కండువా కప్పుకోగా.. ఇప్పుడు ఎమ్మెల్యేలు జంపింగ్‌ల అంశం చంద్రబాబును తెగ కలవరపెడుతోంది.

కాపు ఎమ్మెల్యేలు ఇప్పటికే రహస్యంగా సమావేశం అవుతుండడంతో పాటు తాను నిర్వహించే సమావేశాలకు డుమ్మా కొడుతుండడంతో చంద్రబాబు వారిపై ఓ కన్నేసి ఉంచుతున్నారట. అయితే... ఈలోగా తనకు నమ్మకస్థులైన ఎమ్మెల్యేలూ దిల్లీ వెళ్తుండడం చంద్రబాబును ఆందోళనకు గురిచేస్తోంది.

తాజాగా గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ దిల్లీ పర్యటన సంచలనం రేపుతోంది. ఆయన బీజేపీ పెద్దలను కలిశారని.. ఆ పార్టీలో చేరిపోతున్నారని బుధవారం పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ, ఆయన మాత్రం అదంతా ఒట్టిదేనంటున్నారు. తాను సొంత పనులపై వచ్చానని... దిల్లీ వెళ్తున్నానని చంద్రబాబుకు కూడా చెప్పానన్నారు.

తాను పార్టీ మారానని... బీజేపీ నేతలను కలిశారంటూ వచ్చిన వార్తలను సత్యప్రసాద్ ఖండించారు.  తన వ్యక్తిగత పనులపైనే దిల్లీకి వచ్చానని స్పష్టంచేశారు. భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. తెదేపాలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.  

ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో భాజపా ఓట్ల శాతం కూడా పడిపోయిందని చెప్పారు. భాజపా అన్యాయం చేసిందనే భావన ప్రజల్లో ఉందని.. అందుకే ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేశారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత వైకాపాపై ఉందన్నారు. చంద్రబాబు గొప్ప నాయకుడన్నారు.

ఎంపీ గరికపాటి మోహన్‌రావు తనకు ఆప్తుడని.. అనారోగ్యంతో ఉన్న ఆయన్ను పరామర్శించేందుకే  దిల్లీ వచ్చానని తెలిపారు. ఒక పార్టీలో గెలిచి వేరే పార్టీలోకి వెళ్లడం సరికాదని అనగాని అభిప్రాయపడ్డారు.

అయితే... అలా వెళ్లిన గరికపాటితో జరిపిన మంతనాలేమిటో మాత్రం అనగాని చెప్పలేదు. ఆయన్ను పరామర్శించడానికేనని చెబుతున్నా టీడీపీలో మాత్రం అది పరామర్శ పర్యటన కాదు.. ఫిరాయింపు పర్యటన అని వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English