"ప్రజావేదిక కూల్చివేత: అర్ధరాత్రి హైకోర్టు కీలక తీర్పు"

ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తోంది. కృష్ణా నది కరకట్టపై గత అధికార పార్టీ తెలుగుదేశం నిర్మించిన ఈ భవనాన్ని కూల్చివేయాలంటూ రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించడం.. వారు మంగళవారం సాయంత్రం నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించడం వంటి వాటి వల్ల రాష్ట్రంలో అలజడి నెలకొంది. తెలుగుదేశం పార్టీ నేతలు కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వైసీపీ ప్రజావేదికను కూల్చివేస్తుందని ఆరోపిస్తున్నారు. మరోవైపు నిన్న దీనిని ఆపేయాలని ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు.

 ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైన సమయంలోనే దానిని నిలిపివేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా స్వర్ణకు చెందిన పోలూరి శ్రీనివాసరావు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం బుధవారం విచారణ జరిపింది. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి, జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం అత్యవసరంగా విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది శ్రీరాం వాదన వినిపించారు. దీంతో ప్రజావేదిక కూల్చివేతను అడ్డుకునేందుకు ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. అంతేకాదు, ఈ సందర్భంగా ప్రజావేదిక కూల్చివేత నిర్ణయం సబబేనని తేల్చేసింది.

పోలూరి శ్రీనివాసరావు వేసిన వ్యాజ్యంలో ప్రజా వేదిక నిర్మాణం అక్రమమని పేర్కొన్నప్పుడు దాన్ని కూల్చితే తప్పేముందుని ప్రశ్నించింది. కానీ, ప్రజావేదిక ఖర్చును తిరిగి రాబట్టాలన్న అంశంపై విచారణ కొనసాగిస్తామని వెల్లడించింది. ఈ అంశంపై విచారణను నాలుగు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. ఇదిలాఉండగా, మంగళవారం రాత్రి నుంచి దాదాపు 80 శాతం మేర ప్రజావేదిక భవనం కూల్చివేత జరిగింది. బుధవారం ఉదయం వర్షం కురుస్తుండడంతో కాస్త అంతరాయం కలిగినప్పటికీ.. ఆ తర్వాత కూల్చివేత కొనసాగుతోంది. కొద్దిసేపట్లోనే మొత్తం పూర్తవనుంది.

ప్రజా వేదికను కూల్చివేయకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రకాశం జిల్లా స్వర్ణకు చెందిన పోలూరి శ్రీనివాసరావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. మంగళవారం రాత్రి హౌస్‌ మోషన్‌ రూపంలో ఆయన అత్యవసరంగా ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటి వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి తదితరులతో పాటు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి పీ నారాయణలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English