బాల‌య్య‌కు తెలిసే జంపింగ్‌..టీడీపీలో కొత్త చ‌ర్చ‌

బాల‌య్య‌కు తెలిసే జంపింగ్‌..టీడీపీలో కొత్త చ‌ర్చ‌

ఏపీ రాజ‌కీయాల‌పై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టిన భార‌తీయ జ‌న‌తాపార్టీ ఈ మేర‌కు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవల టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు.. సుజనా చౌదరి, సీఎం. రమేష్, టీజీ. వెంకటేష్, గరికపాటి మోహనరావు బీజేపీలో చేరారు. మొదట రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో భేటీ అయిన వీరు.. ఆ తరువాత బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ. నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. టీడీపీ రాజ్యసభ లెజిస్లేచర్ పార్టీ కమలం పార్టీలో విలీనం అయింది. అనంత‌రం, ఏలూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత అంబికా కృష్ణ.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ సంద‌ర్భంగా అంబికా కృష్ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న చేరిక సంగ‌తి  టీడీపీ అద్య‌క్షుడు చంద్ర‌బాబు వియ్యంకుడు, పార్టీ ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ‌కు తెలుసని వ్యాఖ్యానించారు.

తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పిన అనంత‌రం అంబికా కృష్ణ మీడియాతో మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయానికి చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయాలే కారణమని అంబికా కృష్ణ ఆరోపించారు. ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు, నాయకులు బ్రహ్మాండంగా పనిచేశారని అన్నారు. కానీ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలే ఓటమిని తెచ్చాయన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో విభేదాలు, కాంగ్రెస్‌తో కలయిక, దాదాపు 60 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లవ్వడం వంటి కారణాల వల్ల ఓటమి తప్పలేదన్నారు.  ఈ విషయాలపై తాను చంద్రబాబుకు ముందే చెప్పినా ఆయన పట్టించుకోలేదన్నారు. టీడీపీని వీడుతున్న విషయాన్ని చంద్రబాబునాయుడికి చెప్పలేదని.. ఆయన అందుబాటులో లేరని తెలిపారు. బాలకృష్ణకు తెలియజేశానని అంబికా కృష్ణ వివరించారు. పార్టీలోని ముఖ్య‌నేత‌కు త‌న జంపింగ్ వివ‌రాలు తెలియ‌జెప్పి కండువా మార్చుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇదిలాఉండ‌గా, పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ముఖ్య‌నేత‌ల్లో ఒక‌రిగా అంబికా కృష్ణ‌కు పేరుంది. గత ప్రభుత్వంలో ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌గా  అంబికా కృష్ణ పనిచేశారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో రెండు సీట్లు మాత్రమే వచ్చాయి. గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీడీపీలోనే కొనసాగుతారా? అనే చర్చ కూడా సాగుతున్న సమయంలో అంబికా కృష్ణ.. బీజేపీలో చేరనుండడం ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బే అంటున్నారు. తాజాగా జిల్లాలో పార్టీని పట్టించుకునే నేతలు కూడా కరువయ్యారనే టాక్ వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English