బీజేపీలోకి చిరు.. భారీ ఆఫర్ ఇచ్చిన అధిష్ఠానం..!

బీజేపీలోకి చిరు.. భారీ ఆఫర్ ఇచ్చిన అధిష్ఠానం..!

మెగాస్టార్ చిరంజీవి భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారా..? అందుకోసం ఆ పార్టీ అధిష్ఠానం ఆయనకు భారీ ఆఫర్ ప్రకటించిందా..? ఈ మేరకు ఇప్పటికే చర్చలు కూడా ముగిశాయా..? ఆయన దీనిపై అభిమానం సంఘం నేతలతో సైతం రహస్య సమావేశం ఏర్పాటు చేశారా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎలాగైనా బలపడాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ.. అందుకోసం ‘ఆపరేషన్ కమలం’ను ప్రవేశ పెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు నేతలను చేర్చుకున్న ఆ పార్టీ.. చిరంజీవిని కూడా ఆహ్వానించిందట.

 మెగాస్టార్ చిరంజీవితో భారతీయ జనతా పార్టీకి చెందిన కీలక నేతలు చర్చలు జరిపారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని బలోపేతం చేసే చర్యల్లో భాగంగా చిరును తమ పార్టీలోకి తీసుకుంటే ఆయన అభిమానులతో పాటు కాపు సామాజికవర్గం తమ వైపు తిరుగుతుందని ఆ పార్టీ అధిష్ఠానం భావిస్తోందట. అందుకే చిరంజీవితో లోకల్ బీజేపీ నేతలు నేరుగా, జాతీయ స్థాయి నేతలు ఫోన్‌లో సంప్రదింపులు జరిపారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, బీజేపీలోకి వస్తే ఏపీ అధ్యక్ష పదవితో పాటు రాజ్యసభ ఇస్తామని, వీలుంటే కేంద్ర కేబినెట్‌లో కూడా చోటు కల్పింస్తామని ఆఫర్ చేశారట.

 దీనికి మెగాస్టార్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించిందని తెలుస్తోంది. అంతేకాదు, ఇదే విషయాన్ని ఆయన కాపు సామాజికవర్గంలోని కీలక నేతలతో పాటు అభిమాన సంఘాల్లోని ముఖ్యలతో చెప్పారని సమాచారం. 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం అనే పార్టీని స్థాపించిన చిరంజీవి.. ఆ ఎన్నికల్లో 18 స్థానాలను మాత్రమే గెలుచుకున్నారు. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. దీంతో ఆ పార్టీ అధిష్ఠానం ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి, కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టింది. ఈ పదవి కాలం పూర్తయినప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

 తెలంగాణలో కొంత బలమున్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఉనికిని కోల్పోయి కష్టాలు పడుతోంది భారతీయ జనతా పార్టీ. అయితే, కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టిన తర్వాత రాష్ట్రంపై ఆ పార్టీ అధిష్ఠానం బాగా ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను తమ పార్టీలో చేర్చుకున్నారు. ఇంకొంత మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలతో సైతం చర్చలు జరుపుతున్నారు. వీరిలో చాలా మంది త్వరలోనే కాషాయ కండువా కప్పుకోడానికి సిద్ధంగా ఉన్నారని ప్రచారం కూడా జరుగుతోంది. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English