దీనికి జగన్, కేసీఆర్ ఏం సమాధానం చెబుతారు..?

దీనికి జగన్, కేసీఆర్ ఏం సమాధానం చెబుతారు..?

‘‘ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం అవసరమైతే పక్క రాష్ట్రమైన తెలంగాణతో స్నేహపూర్వకంగా మెలుగుతాం. వీలైతే అక్కడి అధికార పార్టీతో కలిసి పని చేస్తాం’’ అని సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూడా ఇరువురం కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం పోరాడుతామని చెప్పారు. అంతేకాదు, రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు, ప్రభుత్వాలు చేయాల్సింది ఖడ్గచాలనం కాదు.. కరచాలనం అని ఆయన చెప్పుకొచ్చారు.

 మరి ఇప్పుడు ఏమైంది..? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తామన్న కేసీఆర్ మాటల్లో నిజం లేదని తేలిపోయింది. లోక్‌సభ వేదికగా దీనిపై స్పష్టత వచ్చేసింది. ‘‘ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, ఒడిశా, రాజస్థాన్‌, బిహార్‌, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ల నుంచీ ప్రత్యేక హోదా డిమాండ్లు వచ్చాయి. అయితే, ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో లేవు’’‌ అని లోక్‌సభలో జేడీయూ ఎంపీ కౌశలేంద్ర కుమార్‌ అడిగిన ఓ ప్రశ్నకు సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. దీంతో కేసీఆర్ చెబుతున్న దానికి చేస్తున్న దానికి పొంతన లేదని స్పష్టమవుతోంది.

 ఈ నేపథ్యంలో దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలా స్పందిస్తారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ముఖ్యంగా కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారు..? హోదా కోసం టీఆర్ఎస్‌తో కలిసి నడుస్తామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఏ విధంగా వివరణ ఇస్తారు..? అన్నది చర్చనీయాంశం అవుతోంది. మరోవైపు, దీనిని వాడుకోవాలని తెలుగుదేశం పార్టీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వలసలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ పార్టీ.. దీనిపై స్పందించాలని చూస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

 గతంలో తెలంగాణకు చెందిన ఎంపీలు లోక్‌సభలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకూ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఏపీలో ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటంలో చిత్త శుద్ధిలేదని వారు బహిరంగంగానే విమర్శించారు. ఇక, ఆ మధ్య లోక్‌సభలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు పెట్టిన అవిశ్వాస తీర్మాణం సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు సభలో పదే పదే అడ్డు తగలడం.. ఓటింగ్ నుంచి తప్పుకోవడం చేశాయి. అప్పట్లోనే వాళ్లు హోదాకు వ్యతిరేకమనే అంచనాకు అంతా వచ్చేశారు. కానీ, ఈ మధ్య కేసీఆర్ ఏపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English