జగన్ నిర్ణయంపై అసంతృప్తి.. ఏపీలో ఉద్యమం..!

జగన్ నిర్ణయంపై అసంతృప్తి.. ఏపీలో ఉద్యమం..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఓ వర్గాన్ని అసంతృప్తికి గురి చేసిందా..? వారంతా త్వరలోనే ప్రభుత్వంపై పోరాటానికి దిగబోతున్నారా..? ఈ మేరకు సదరు వర్గానికి చెందిన వారంతా సమావేశం కూడా అయ్యారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

 ఒకేసారి నిరుద్యోగ సమస్యను, అవినీతిని రూపుమాపేందుకు జగన్ సారథ్యంలోని ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పథకాలను లబ్దిదారులకు నేరుగా చేరవేయడమే వీరి ప్రధాన విధి అని సీఎం గతంలోనే ప్రకటించారు. ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్‌ను నియమిస్తామని చెప్పారు. ఆగస్టు 15 వరకు గ్రామ వాలంటీర్లుగా 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. వీరికి ఒక్కొక్కరికి రూ. 5 వేల వేతనం చెల్లించనున్నారు. ఈ ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభమైపోయింది. ఇప్పుడిదే రాష్ట్రంలోని రేషన్ డీలర్లను అసంతృప్తికి గురి చేసిందట.

 ప్రస్తుతం రేషన్ కార్డు దారులకు బియ్యం, పంచదార, కందిపప్పు, కిరోసిన్ వగైరా సామాన్లను ప్రతి నెల ప్రభుత్వమే అందిస్తుంది. ఇందుకోసం కొన్ని వేల మంది రేషన్ డీలర్లు పని చేస్తున్నారు. ప్రభుత్వం త్వరలోనే గ్రామ వాలంటీర్లను నియమించనుండడంతో, రేషన్ డీలర్లకు పని లేకుండా పోతుంది. ఈ విషయంపై గతంలోనే క్లారిటీ ఉన్నప్పటికీ, కలెక్టర్ల సదస్సులో కూడా ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ‘‘ప్రభుత్వ అందజేసే రేషన్‌ను నేరుగా లబ్దిదారులకు గ్రామ వలంటీర్లే అందజేయనున్నారు. ప్రతి ఇంటికి వాళ్లే వెళ్లి ఇస్తారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇకపై రేషన్‌ డీలర్లు ఉండబోరు’’ అని ఆయన చెప్పుకొచ్చారు.

 దీంతో రాష్ట్రంలోని రేషన్ డీలర్ల సంఘం ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైందని సమాచారం. ఈ మేరకు వారంతా ఇప్పటికే సమావేశం కూడా అయ్యారని తెలిసింది. మొదట తమకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుందామని, ఆ తర్వాత సీఎం నిర్ణయంపై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిద్దామని రేషన్ డీలర్ల సంఘం నేతలు చర్చించినట్లు తెలిసింది. అయితే, ఈ విషయంలో జగన్ తాజాగా క్లారిటీ ఇచ్చే సరికి వాళ్లు ఉద్యమానికి వెనకాడకూడదని డిసైడ్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలోనే రాష్ట్రంలో ఉద్యమం మొదలవబోతుందని ప్రచారం జరుగుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English