సీఎం జగన్‌కు చెడ్డపేరు తెచ్చారట.. రాజీనామా చేసేశారు!

సీఎం జగన్‌కు చెడ్డపేరు తెచ్చారట.. రాజీనామా చేసేశారు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి చెడ్డపేరు తీసుకొచ్చానంటూ అధికార పార్టీ నేత ఒకరు తెగ బాధపడిపోతున్నారు. తనపై ఎంతో నమ్మకంతో చైర్మన్ పదవి అప్పగిస్తే, తన చేష్టలతో దానికి కళంకం తీసుకొచ్చానని ఫీలైపోయారు. అంతేకాదు... తనకు తాను శిక్ష వేసుకుని పదవిని వదిలేసుకున్నారు. ఇక ఈ పదవి నాకు వద్దే వద్దంటూ రాజీనామా కూడా చేశారు. ఆయన మరెవరో కాదు.. జగ్గయ్యపేట మునిసిపల్ చైర్మన్ ఇంటూరి రాజగోపాల్. అసలేం జరిగిందయ్యా అంటే?

జగయ్యపేట సీఐ నబీ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ మునిసిపల్ చైర్మన్ ఇంటూరి రాజగోపాల్‌పై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. రౌడీ షీటర్ల ఫొటోలు సేకరిస్తున్నామని, ఇందులో భాగంగా రాజగోపాల్‌కు ఫోన్ చేసి ఫొటోలు పంపాలని ఎస్సై కోరారని నబీ తెలిపారు. తనన రౌడీ షీటర్‌గా పేర్కొనడం, ఫొటోలు పంపాలని అడగడంతో చిర్రెత్తుకొచ్చిన రాజగోపాల్ తన అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని అర్ధనగ్నంగా బైఠాయించిన నిరసన తెలిపారు. దీంతో వారికి నచ్చజెప్పేందుకు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ప్రయత్నించారు. అతడిని పక్కకి తోసేసిన రాజగోపాల్ నోటికి పనిచెప్పారు. దీంతో చైర్మన్ సహా ఆయన అనుచరులపై కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.

ఈ ఘటన తర్వాత రాజగోపాల్‌ పశ్చాత్తాపంలో పడిపోయారు. సోమవారం రాత్రి తన ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభానును ఏర్పాటు చేసిన పౌరసన్మాన కార్యక్రమంలో చైర్మన్ బోరుమన్నారు. తాను చేసిన పనికి బహిరంగ క్షమాపణ చెప్పారు. అలా ప్రవర్తించి ఉండకూడదని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తనపై నమ్మకంతో చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించిన ఉదయభానుకు, ముఖ్యమంత్రి జగన్‌కు చెడ్డపేరు తీసుకొచ్చానని తెగ బాధపడిపోయారు. తనను క్షమించాలంటూ ఉదయభాను కాళ్లు పట్టుకుని వేడుకున్నారు. అలాగే, తన ప్రవర్తన కారణంగా బాధపడి ఉంటే క్షమించాలంటూ సీఐ అబ్దుల్ నబీ, ఎస్సై ధర్మరాజు, కానిస్టేబుళ్లను కోరారు. చైర్మన్‌గా కొనసాగే అర్హత తనకు లేదని, పదవికి రాజీనామా చేస్తున్నట్టు అప్పటికప్పుడు ఉదయభానుకు రాజనామా లేఖను అందించారు. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English