అంత ఇగో ఎందుకు జగన్?

అంత ఇగో ఎందుకు జగన్?

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న ఆరంభంలోనే కొన్ని చక్కటి నిర్ణయాలతో జనాల మనసులు గెలుచుకున్నాడు. జగన్ ముఖ్యమంత్రి అయితే అరాచకాలు జరిగిపోతాయని భయపడ్డ వాళ్లు కూడా అతను సిన్సియర్‌గా ఏదో చేయడానికి ప్రయత్నిస్తున్నాడన్న భావనకు వస్తున్నారు నెమ్మదిగా. జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు అందరి ఆమోదం పొందాయి.

ముఖ్యంగా ఫిరాయింపుల్ని ప్రోత్సహించనంటూ అసెంబ్లీలో చేసిన ప్రకటన ఆకట్టుకుంది. ప్రభుత్వ పాఠశాలల్ని మెరుగు పరిచే విషయంలో జగన్ ఇచ్చిన సవాల్‌ కూడా జనాల మెప్పు పొందింది. కానీ జగన్ తీసుకున్న తాజా నిర్ణయం ఒకటి మాత్రం అంత ఆమోదయోగ్యంగా అనిపించడం లేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కట్టిన ప్రజా వేదికను కూల్చేస్తాం అన్న జగన్ ప్రకటన పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజా వేదిక అక్రమ కట్టడం అంటున్నాడు జగన్. ఐతే అది చంద్రబాబు వ్యక్తిగతానికి కట్టుకున్నది కాదు. సక్రమమైనా అక్రమమైనా ప్రభుత్వం కోసం కట్టిన భవనం అది. ప్రైవేటు వ్యక్తులు నిబంధనల్ని అతిక్రమించి కట్టిన నిర్మాణాల్ని కూడా ప్రభుత్వం క్రమబద్ధీకరించేస్తుంటుంది. అలాంటిది ప్రభుత్వం రూ.10 కోట్లు నిర్మించిన భవన సముదాయాన్ని కూల్చేస్తామని అనడమే విడ్డూరంగా ఉంది. పది కోట్లంటే చిన్న మొత్తం కాదు. అది ప్రజాధనం.

అక్రమ నిర్మాణం కట్టిన వారి మీద కావాలంటే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కానీ రూ.10 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తామంటే ఎలా? ఆ భవనాల్ని ప్రభుత్వం కోసం మరో రకంగా ఉపయోగించుకోవచ్చు కదా? ఇది జగన్ ఇగోతో తీసుకున్న నిర్ణయంలా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరీ అంత దూకుడు పనికి రాదని.. చంద్రబాబు దుబారాను, ప్రజాధనాన్ని వృథా చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన జగన్.. పది కోట్లు వృథా అయ్యే నిర్ణయం విషయంలో పునరాలోచించాలని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English