బీజేపీలోకి అంబికా... ‘పశ్చిమ’లో టీడీపీ గల్లంతేనా?

బీజేపీలోకి అంబికా... ‘పశ్చిమ’లో టీడీపీ గల్లంతేనా?

ఏపీలో కొత్తగా విపక్ష హోదాలోకి వచ్చి చేరిన తెలుగుదేశం పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా ముగిసిన ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత ఇటీవలే ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి జంపై షాకిచ్చారు. ఈ నలుగురిలో టీజీ వెంకటేశ్ ను పక్కనపెడితే... మిగిలిన సుజనా చౌదరి, సీఎం రమేశ్, గరికపాటి మోహన్ రావులు పార్టీలో అత్యంత కీలక నేతల కిందె లెక్క. సుజనా, రమేశ్ లైతే ఏకంగా చంద్రబాబు కోటరీలో అత్యంత ముఖ్యులుగా ఉన్నవారు. తాజాగా టీడీపీలో మరో కీలక నేతగా కొనసాగుతున్న అంబికా కృష్ణ కూడా బీజేపీ గూటికి చేరిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీలో కీలక నేతగా ఉన్న అంబికా తన సోదరుడు అంబికా రాజాతో కలిసి కమలం గూటికి చేరిపోయారు. దీంతో టీడీపీకి వరుసగా మరో బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి.

ఎవరికీ చిన్న క్లూ కూడా ఇవ్వకుండా గుట్టుగా ఢిల్లీ ఫ్లైటెక్కిన అంబికా... నేటి ఉదయం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాథవ్ తో భేటీ అయ్యారు. బీజేపీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. ఆ వెంటనే కాసేపటి క్రితం ఆయన రాం మాధవ్ సమక్షంలోనే కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ  చేరికతో ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ పార్టీకి ఇప్పుడు గడ్డు పరిస్థితులు తప్పవన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే... టీడీపీ నేతగానే కాకుండా సినీ పరిశ్రమకు చెందిన వారిగా, ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్న అంబికా జిల్లాలోని దాదాపుగా అందరు టీడీపీ నేతలకు చాలా దగ్గరివారిగానే గుర్తింపు ఉంది. అంబికా మాటను కాదనే నేత ‘పశ్చిమ’ టీడీపీలో లేరనే మాట కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అంబికా ఒక్క పిలుపు ఇస్తే... జిల్లాకు చెందిన దాదాపుగా అందరు టీడీపీ నేతలు, చివరకు తాజా ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారేందుకు వెనుకాడరనే ప్రచారం సాగుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English