ట్రెండింగ్ డైలాగ్.. టికెట్లు లేవా పుష్పా?

మామూలుగానే అల్లు అర్జున్ మరే దర్శకుడితో చేసినా.. సుకుమార్‌ ఇంకే హీరోతో జట్టు కట్టినా ఆ సినిమాలకు క్రేజ్ మామూలుగా ఉండదు. ఇక వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తే ఉండే క్రేజ్ ఎలాంటిదో చెప్పాల్సిన పని లేదు. పైగా ఇద్దరూ వేర్వేరుగా తమ కెరీర్లలోలో అతి పెద్ద హిట్లతో, నాన్ బాహుబలి రికార్డులు బద్దలు తర్వాత చేస్తున్న చిత్రం.. పుష్ప.

ఇక దీని హైప్ గురించి చెప్పేదేముంది? ముందు నుంచి ఉన్న అంచనాలు విడుదల సమయానికి ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో ఈ సినిమా టికెట్ల కోసం డిమాండ్ మామూలుగా లేదు.

ఏపీలో టికెట్ల ధరలు, షోల విషయంలో అస్పష్టత వల్ల కొంచెం గందరగోళం నడుస్తుండగా.. నైజాంలో మాత్రం ‘పుష్ప’ మోత మామూలుగా ఉండేలా లేదు. టికెట్ల రేట్లను దాదాపు 75 శాతం పెంచినా.. డిమాండ్ అలా ఇలా లేదు. ఇక్కడ ఐదో షో వేసుకోవడానికి అనుమతులు గురువారం మధ్యాహ్నం తర్వాత లభించగా.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఉదయం 6-7.30 మధ్య ఆయా థియేటర్ల వీలును బట్టి షోలు సెట్ చేసుకుని బుకింగ్స్ ఓపెన్ చేశారు.
ఒక థియేటర్లో బుకింగ్స్ ఓపెన్ చేయడం.. ఐదు పది నిమిషాల్లో టికెట్లన్నీ బుక్ అయిపోవడం.. ఇదీ వరస. మొత్తంగా కొన్ని గంటల్లోనే అన్ని థియేటర్లలోనూ అర్లీ మార్నింగ్ షోలకు టికెట్ల అమ్మకాలన్నీ పూర్తయ్యాయి. ఇక రెగ్యులర్ షోల సంగతైతే చెప్పాల్సిన పని లేదు.

చాలా ముందే టికెట్లు సోల్డ్ ఔట్. హైదరాబాద్ నగర శివార్లలో అంతగా పేరు లేని థియేటర్లలో సైతం టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. ఎక్కడికైనా సరే వెళ్లి సినిమా చూడాలన్న పట్టుదలతో ప్రేక్షకులు దొరికిన చోట బుక్ చేసుకునే పరిస్థితి తలెత్తింది. తొలి రోజు మొత్తానికి హైదరాబాద్‌లో ఎక్కడా ఒక్కటంటే ఒక్క టికెట్ అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో ‘పుష్ఫ’ సినిమాలోని ‘పార్టీ లేదా పుష్పా’ అనే ఫాహద్ ఫాజిల్ డైలాగ్‌ స్ఫూర్తితో ‘‘టికెట్లు లేవా పుష్పా’ అనే మీమ్‌‌ను పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు. సాయంత్రం నుంచి ఈ డైలాగ్ ట్రెండ్ అవుతోంది.