దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ కొత్త టార్గెట్లు ఇవే

దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ కొత్త టార్గెట్లు ఇవే

భారతీయ జనతా పార్టీ... రెండు ఎంపీ సీట్ల నుంచి 300లకు పైగా సీట్లను సాధించి కేంద్రంలో క్లిస్టర్ క్లియర్ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదాకా శక్తిని కూడదీసుకుంది. అయితే బీజేపీ ఎంత బలోపేతం అయినా... దక్షిణాదిలో మాత్రం ఆ పార్టీ జీరోనే. దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల్లో ఒక్క కర్ణాటక మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో బీజేపీకి అత్తెసరు మార్కులే. ఆ అత్తెసరు మార్కులు కూడా తాజా ఎన్నికల్లో తెలంగాణలో మాత్రమే దక్కగా... మిగిలిన మూడు రాష్ట్రాల్లో ఇప్పటికీ ఆ పార్టీ జీరోనే. ఉత్తరాదిలో ఒక్కటొక్కటే అన్నట్లుగా దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో జెండా పాతుకుంటూ వస్తున్న బీజేపీ... ఇప్పుడు దక్షిణాదిపై నిజంగానే ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ప్రత్యేక దృష్టి ఏదో సాదాసీదాగా కాకుండా వచ్చే పదేళ్లలో కర్ణాటకలో మాదిరిగా ఏకంగా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసే దిశగా సాగాలని ఆ పార్టీ కేంద్ర నాయకత్వం పక్కా పథకాన్ని రచించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

తాజా ఎన్నికలకు ముందు కేరళపై ఓ మోస్తరు దృష్టి సారించిన బీజేపీ... ఎందుకనో గానీ అక్కడ ఈ సారి కూడా ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది. అయితే తెలంగాణలో మాత్రం సింగిల్ గానే పోటీ చేసి ఏకంగా నాలుగు సీట్లను కైవసం చేసుకుంది. ఈ మాత్రం విజయం ఇప్పుడు ఆ పార్టీలో మంచి టార్గెట్లనే నిర్దేశించుకునేలా చేసిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2024లో తెలంగాణలో ఏకంగా అధికారం చేజిక్కించుకునేలా కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్న కమలనాథులు.... అందులో భాగంగానే సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికైన కిషన్ రెడ్డిని కేంద్ర కేబినెట్ లోకి తీసుకుని ఏకంగా హోం శాఖలో కూర్చోబెట్టింది. తెలంగాణలో కాంగ్రెస్ చావు దెబ్బ తినడం, అధికార పార్టీ టీఆర్ఎస్ పై అంతకంతకూ ప్రజా వ్యతిరేకత పెరుగుతుండటం.. వీటన్నింటినీ ఆసరా చేసుకుని ఎలాగైనా 2024లో ఆ రాష్ట్రంలో అధికారం చేపట్టాల్సిందేనన్న దిశగా బీజేపీ దూకుడు పెంచేసింది.

ఇక కేరళలోనూ మారుతున్న రాజకీయ పరిణామాలను చాలా జాగ్రత్తగానే గమనిస్తూ వస్తున్న కమలనాథులు... 2024లో ఎలాగైనా మెజారిటీ సాదించడంతో పాటుగా అధికారం చేపట్టాల్సిందేనని నిర్దేశించుకున్నారట. ఇక దక్షిణాదిలో మిగిలిన రెండు రాష్ట్రాలైన ఏపీ, తమిళనాడులకు సంబంధించి బీజేపీ 2029ని టార్గెట్ గా పెట్టుకుందట. ఈ రెండు రాష్ట్రాల్లో తాజా ఎన్నికల్లో బీజేపీ సింగిల్ సీటు దక్కించుకోలేదు కదా... తమిళనాడులో ఆ పార్టీతో అంటకాగుతున్న అధికార అన్నాడీఎంకేకు ఘోర పరాభవం ఎదురైంది.

పుదుచ్ఛేరితో కలిపి తమిళనాట మొత్తం 40 ఎంపీ సీట్లుంటే.. అన్నాడీఎంకే కేవలం ఒక్క సీటుకు మాత్రమే పరిమితమైంది. 2014 ఎన్నికల్లో 37 సీట్లను గెలుచుకున్న అన్నాడీఎంకే ఐదేళ్లు తిరక్కుండానే సింగిల్ సీటుకు పడిపోయిన వైనం బీజేపీని తీవ్ర నిరాశకే గురి చేసింది. బీజేపీతో కలిసి నడుస్తున్నట్లుగా స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన కారణంగానే అన్నాడీఎంకేకు ఈ ఘోర పరాజయం దక్కిందని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఇదే వాస్తవాన్ని గుర్తించిన బీజేపీ.. ఇప్పటికప్పుడు తమిళనాట జెండా పాతలేమని తేల్చేసుకుంది. అయితే 2024లో ఓ మోస్తరు మార్పును తీసుకువచ్చి 2029లో మాత్రం అధికారం చేజిక్కించుకునే దిశగా సాగాలన్నది బీజేపీ యోచన.

ఇక దక్షిణాదిలో కీలక రాష్ట్రంగా ఉన్న ఏపీలో బీజేపీ పరిస్థితి మరింత తీసికట్టుగానే మారింది. ఏపీకి ప్రత్యేక హోదాను ఎగ్గోట్టేసినట్టుగా వ్యవహరించిన బీజేపీ పట్ల ఏపీ ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజా ఎన్నికల్లో బీజేేపీకి చాలా తక్కువ శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన టీడీపీలోని కీలక నేతలను చేర్చుకోవడం ద్వారా 2024 నాటికి ఓ మోస్తరుగా ప్రభావం చూపే అవకాశాలుంటాయని అంచనా వేస్తున్న బీజేపీ... 2029లో మాత్రం ఏపీలోనూ జెండా పాతేయాలని చూస్తోంది. అంచనాలు, లెక్కలు, సమీకరణాలు చూడటానికి బాగానే ఉన్నాయి గానీ... ప్రాంతీయవాదంలో తమదైన శైలి తీర్పు ఇస్తున్న దక్షిణాధి రాష్ట్రాలపై బీజేపీ ప్లాన్ వర్కవుట్ అవుతుందా? లేదా? అన్నది కాలమే నిర్ణయించాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English