అన్నకు పదవి ఇస్తే తమ్ముడు పార్టీలోనే ఉంటాడట

అన్నకు పదవి ఇస్తే తమ్ముడు పార్టీలోనే ఉంటాడట

కొద్దిరోజులుగా కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతున్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అధిష్ఠానంపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన రేపో మాపో కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారని ఈ మధ్య జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఆయన రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో తన అనుచరులతో సమావేశం కూడా నిర్వహించారు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడేది ఖాయమేనన్న టాక్ వినిపించింది. కానీ, తాజాగా ఆయన వ్యవహార శైలిలో మార్పు వచ్చిందని విశ్వసనీయంగా తెలుస్తోంది.

 వాస్తవానికి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు, భారతీయ జనతా పార్టీలో చేరేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలోనే కార్యకర్తలతో సైతం సమావేశం అయ్యారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మార్చేందుకు అధిష్ఠానం ప్రయత్నాలు ప్రారంభించడంతో ఆయన నిర్ణయంలో మార్పు వచ్చిందని తెలిసింది. పార్టీ మారే విషయంలో కొద్దిరోజులు వేచి చూడాలని భావిస్తున్నారట. దీనికి కారణం తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి దక్కే అవకాశాలు ఉండడమేనని సమాచారం.

 కొత్త పీసీసీ చీఫ్‌ కోసం అధిష్ఠానం పెద్దల పరిశీలనలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి పేర్లు ఉన్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడిన్నాయి. అయినా.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా తన వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఆయన లాబీయింగ్ కూడా ప్రారంభించారని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ఆయన జాతీయ నాయకులతో కూడా ఆయన మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. కొందరు నాయకులు ఆయనకు టీపీసీసీ పదవి ఇస్తామని చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

 ఈ విషయాన్ని వెంకటరెడ్డి.. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి కూడా చెప్పారనే టాక్ వినిపిస్తోంది. ఈ కారణంగానే ఆయన పార్టీ వీడే నిర్ణయాన్ని వాయిదా వేశారని ప్రచారం జరుగుతోంది. నిజానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెండు రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ.. తన సోదరుడు పార్టీ మారడని చెప్పారు. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రక్షాళన చేయాలన్న ఉద్ధేశంతో నా సోదరుడు రాజగోపాల్‌ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది ఆవేదనే తప్ప పార్టీ మారుతానని రాజగోపాల్‌ కూడా ఎక్కడా చెప్పలేదు’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూర్చుతున్నాయి. మరి భవిష్యత్‌లో ఏం జరుగుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English